గుర్తింపు ఫీట్లు!
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: ఏదైనా ఒక కోర్సుకు సంబంధిత అధీకృత సంస్థ గుర్తింపు పొందాలంటే.. అందుకు తగిన వనరులు సిద్ధం చేయాలి. సౌకర్యాలు కల్పించాలి. ఆ తర్వాత ఇంకా ఏమైనా చిన్నచిన్న లోటుపాట్లు ఉంటే అప్పటికప్పుడు సర్దుబాటు చేసుకోవడంలో తప్పులేదు గానీ.. కనీస సౌకర్యాలే కల్పించకుండా నిర్లక్ష్యం వహించి.. తీరా పరిశీలక బృందం వచ్చే ముందు హడావుడి పడి.. లేనివి ఉన్నట్లు చూపించడానికి ప్రయత్నించడం.. అది కూడా గౌరవప్రదమైన విశ్వవిద్యాలయం స్థాయిలో జరగడం విడ్డూరమే. ఇంత చేసినా పరిశీలక బృందాన్ని పూర్తిగా సంతృప్తిపరచగలిగారా అంటే అదీ లేదు. బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఎంఈడీ కోర్సుకు గుర్తింపు సాధించేందుకు అక్కడి అధికారులు పడిన తంటాలు అన్నీ ఇన్నీ కావు. ఈ కోర్సుకు అవసరమైన వసతులు వర్సిటీలో ఉన్నాయా లేవా అన్నది పరిశీలించేందుకు బెంగళూరు నుంచి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ)కు చెందిన ప్రొఫెసర్ శ్రీకాంత ప్ప, ఎడ్వర్డ్ విలియం బెంజ్‌మన్ , తదితరులతో కూడిన బృందం బుధవారం వచ్చినప్పుడు ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి.
గుర్తింపు తప్పనిసరి
ఎంఈడీ కొనసాగాలంటే ఎన్సీటీఈ గుర్తింపు తప్పనిసరి. ఆ గుర్తింపు పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. పూర్తిస్థాయిలో సౌకర్యాలు సమకూర్చుకోవాలి. ఇంతవరకు ఆంధ్రా యూనివర్సిటీ అనుబంధ సంస్థగా కొనసాగడంతో అభ్యంతరాలు లేకుండా కోర్సు కొనసాగుతోంది. ఇకముందు మాత్రం ఎన్సీటీఈ గుర్తింపుపైనే కోర్సు మనుగడ ఆధారపడి ఉంటుంది. వర్సిటీలో ప్రస్తుతం 40 మంది ఎంఈడీ కోర్సు చేస్తున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ సెట్ (ఆసెట్) ద్వారా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఈ కోర్సుకు డిమాండు ఉండటంతో సీట్లన్నీ నిండిపోతున్నాయి. అయితే తరగతుల నిర్వహణకు వనరులు, సౌకర్యాలే అంతంతమాత్రంగా ఉన్నాయి. సోషల్ వర్కు బ్లాకులో ఒక తరగతి గది, మరో చిన్న గదిలో సైకాలజీ ల్యాబ్ నిర్వహిస్తున్నారు. కామన్ లైబ్రరీలో ఈ కోర్సుకు చెందిన కొన్ని పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. ఈ విభాగానికి ప్రత్యేక లైబ్రరీ అంటూ లేదు. ఎన్సీటీఈ బృందం పరిశీలన సమయంలో మాత్రం వర్సిటీ అధికారులు మసి పూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నించారు.
లేనిది ఉన్నట్లు..
లైబ్రరీ బ్లాక్ మొత్తం ఎంఈడీ కోర్సుకు ఉపయోగిస్తున్నట్లు చూపారు. ఇందులో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎల్ఎల్బీ మూడేళ్లు, ఎల్ఎల్ఎం మొదటి ఏడాది, రూరల్ డెవలప్మెంట్ రెండో ఏడాది, తెలుగు మొదటి, ద్వితీయ ఏడాది తరగతులను వేరే చోటకు మార్చేశారు. కామన్ సిల్వర్ జూబ్లీ లైబ్రరీని పూర్తిస్థాయి ఎంఈడీ గ్రంథాలయంగా చూపేందుకు ప్రయత్నించారు. డిపార్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథాలయంగా గ్లోసైన్ ఏర్పాటు చేశారు. తరగతి గదులతో పాటు, సైకాలజీ ల్యాబ్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ల్యాబ్ ,ఐసీటీ ల్యాబ్, స్టాఫ్ రూమ్, మల్టీపర్పస్ హాల్, కామన్ రూమ్స్ ఉమెన్, మెన్, ఎస్‌యూపీడబ్ల్యూ రూం, సెమినార్ హాల్.. ఇలా అన్ని గదుల ముందు స్టిక్కర్లు అతికించారు. ఇన్ని చేసినా పలు లోపాలు బయటపడ్డాయి. ఎన్సీటీఈ నిబంధనల మేరకు తరగతి గదులు తగిన విస్తీర్ణంలో లేవు, లైబ్రరీలో పూర్తిస్థాయిలో పుస్తకాలు లేవు. రెగ్యులర్ బోధకులు కూడా లేరు. ఉన్న టీచింగ్ అసోసియేట్లకు నిబంధనల మేరకు జీతాలు చెల్లించడం లేదు. డిపార్ట్మెంట్ హెడ్ సైతం లేరు. ప్రస్తుతం డాక్టర్ హెచ్.సుబ్రమణ్యం (కోర్సు కోఆర్డినేటర్) ,డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ స్వామినాయుడు, డాక్టర్ శ్రీనివాస్ ఉన్నారు. ఈ ప్యాకల్టీతో సంబంధం లేని బీఎడ్ మెంటల్లీ రిటర్డ్ టీచింగ్ అసోసియేట్ డాక్టర్ యడ్ల రవికుమార్‌ను అతిధి బోధకునిగా చూపించారు. బృందం పరిశీలన అనంతరం రెక్టార్ చంద్రయ్య విలేకరులతో మాట్లాడుతూ కోర్సు కొనసాగించాలంటే ఈ మాత్రం పాట్లు పడటంలో తప్పులేదని చెప్పటం కొనమెరుపు.