విభజనతోనే వికాసం
సిద్దిపేట/సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: విభజన.. జాతి వికాసానికి తోడ్పడుతుందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విశ్లేషించారు. నాలుగున్నర కోట్ల ప్రజల అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. గురువారం సిద్దిపేటలో స్థానిక ఎమ్మెల్యే హరీష్‌రావు నివాసంలో విలేకరులతో, అనంతరం రాత్రి ఎన్జీవో భవన్లో జరిగిన సకలజన భేరి సన్నాహక సభలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. ఈ ప్రాంతవాసుల ఆకాంక్షలకు విరుద్ధంగా సమైక్యాంధ్రలో తెలంగాణను విలీనం చేశారని, అందుకే ఈ పోరాటం అంతిమంగా విభజన దశకు చేరిందన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా తన అధికారాలను చెలాయిస్తూ సీఎం కిరణ్ నేరానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సీమాంధ్రవాసుల్లో లేని అనుమానాలు, విద్వేషాలను సీఎం సృష్టిస్తున్నారన్నారు. కుట్రల భగ్నానికే హైదరాబాద్‌లో ఈ నెల 29 ‘సకల జనుల భేరి’ని తలపెట్టామని ప్రస్తావించారు. హైదరాబాద్‌లో జరిగే భేరికి ఉప్పెనలా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
కిరణ్ పాలన మాకొద్దు: హరీష్‌రావు
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో జరిగిన 58 ఎన్నికల్లో 50 సార్లు కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయిన క్రమంలో ప్రజాతీర్పు గౌరవించి ఎందుకు రాజీనామా చేయలేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రశ్నించారు. నీ పాలన మాకొద్దని తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు చెబుతున్నందున వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చివరి బంతి దాకా ఆట సాగుతుందని సీఎం తాజాగా ప్రకటించిన వ్యాఖ్యలపై హరీష్‌రావు స్పందించారు. సీమాంధ్ర సీఎం వద్ద ఒక్క బంతి మాత్రమే మిగిలి ఉందని చివరి గెలుపు తమదేనన్నారు. పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర బిల్లును ప్రవేశపెడితే సీమాంధ్ర ఎంపీల మద్దతు లేనప్పటికీ 400 మంది బిల్లుకు మద్దతు ప్రకటించడానికి సిద్దంగా ఉన్నారన్నారు. బిల్లు ఆమోదానికి 270 మంది సభ్యుల మద్దతు మాత్రమే అవసరం కాగా 130 మంది సభ్యులు అదనంగా తమకు అండగా ఉంటారన్నారు. స్టార్ బ్యాట్స్‌మెన్‌గా చెప్పబడుతున్న సీఎం తోక ముడవాల్సిందేనన్నారు.
హైదరాబాద్ అందమైన సీతాకోక చిలుక
‘హైదరాబాద్ అందమైన సీతాకోకచిలుక.. దాని రెక్కలకు కత్తులు కట్టి కోడిపందేలు ఆడొద్దు’ అని నంది అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి అన్నారు. 50 రోజుల సీమాంధ్రుల ఆందోళనకు తీవ్రంగా చలించిపోతున్న సీఎం.. 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంపై ఎందుకు మౌనం వహిస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ అశోక్‌బాబుతో తోలుబొమ్మలాటలు ఆడిస్తున్న కాంగ్రెస్, టీడీపీ కుట్రలు ఇక చెల్లవన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ మాట్లాడుతూ సకలజనుల భేరితో కుట్రలను వ్యతిరేకించాలన్నారు. సభ అధ్యక్షుడు పాపయ్య, టీఎన్జీవో నేత శ్రీహరి, బీజేపీ రాష్ట్ర నేత విద్యాసాగర్, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, టీజేఏసీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్, టీఆర్ఎస్ నేతలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, భూంరెడ్డి తదితరులు ప్రసంగించారు.