జిల్లాలో ఎక్సైజ్ దాడులు
కడప అర్బన్/తొండూరు/ముద్దనూరు/సిద్ధవటం, న్యూస్‌లైన్: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ విజయకుమారి ఆధ్వర్యంలో సోమవారం జిల్లావ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. వీటిలో 7 కేసుల్లో ఒకరిని అరెస్టు చేసి 66 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 3,800 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 25 కిలోల నల్లబెల్లంను స్వాధీనం చేసుకున్నారు. బెల్టుషాపుల కేసులను ఐదు నమోదు చేశారు.
ఈ కేసుల్లో ఐదు మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 25 లీటర్ల బ్రాందీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సోమవారం రాబడిన సమాచారం మేరకు గుర్రంగుంపుతాండాలోని ఓ ఇంటిపై దాడి చేశారు. మూడె సుశీలమ్మ తన ఇంటికి తాళం వేసి పరారైంది. రెవెన్యూ అధికారుల సమక్షంలో సుశీలమ్మ ఇంటి తాళం పగులగొట్టగా ఇంటిలో 16 లీటర్ల నాటుసారా ఉన్నట్లు గమనించి స్వాధీనం చేసుకున్నారు. సుశీలమ్మపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడిలో కడప ఎస్సై స్వామినాథ్, హెడ్కనాఇస్టేబుల్ నారాయణరెడ్డి, కానిస్టేబుళ్లు గోపాలకృష్ణ, సుబ్రమణ్యం, కొత్త కానిస్టేబుల్ విజయ్ ప్రవీణ్, విష్ణువర్ధన్‌రెడ్డిలు పాల్గొన్నారు.
తిమ్మాపురంపేటలో...
తొండూరు మండలం తిమ్మాపురంపేటలో అక్రమంగా నిల్వ ఉన్న 87మద్యం బాటిళ్లను సీజ్ చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఫ్లయింగ్ స్క్వాడ్ ఎస్ఐ బాల అంకయ్యతోపాటు ముద్దనూరు పోలీసులు తిమ్మాపురం పేటలో దాడులు నిర్వహించారు. జల్లా దామోదర్‌రెడ్డి తన కలం దొడ్డిలో అక్రమంగా నిల్వ ఉన్న 87మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని ఎక్సైజ్ అధికారులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
రాచగూడిపల్లెలో ...
ఒంటిమిట్ట మండలం రాచగూడిపల్లెలో సోమవారం దాడులు నిర్వహించి బొమ్మిల చెన్నయ్య నుంచి 25మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సీఐ రామ్మోహన్ తెలిపారు. ఒంటిమిట్ట మండలం రాచగూడిపల్లెలో మద్యం విక్రయాలు అక్రమంగా జరుగుతున్నాయని సమాచారం తెలియడంతో హుటాహుటీన ఎస్ఐలు శ్రీధర్‌బాబు, లావణ్యలు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామన్నారు. బొమ్మిళ్ల చెన్నయ్యను రిమాండ్‌కు తరలించామన్నారు.