మహిళా చైతన్యమే లక్ష్యం
పేదల సేవతో పాటు మహిళలను చైతన్యవంతులుగా చేయాలనే లక్ష్యమే ఆమెను ఉన్నతాధికారిని చేసింది. ఆర్థిక స్వావలంబన సాధించిననాడే మహిళలకు కుటుంబంలో, సమాజంలో సముచిత స్థానం దక్కుతుందని విశ్వసించారామె. మూడుసార్లు సివిల్స్ మెయిన్స్ పరీక్షలు రాసి ఇంటర్వ్యూ వరకూ వెళ్లారు. కానీ అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేకపోయారు. అయినా ఆమె నిరుత్సాహపడలేదు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తూనే గ్రూప్-1 పరీక్షలు రాశారు. పోలీస్ శాఖలో డీఎస్పీ పోస్టును సాధించారు సీహెచ్. సౌజన్య. ప్రస్తుతం ఆమె చేవెళ్లలో ప్రొబేషనరీ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా సౌజన్య తన మనోగతాన్ని ‘న్యూస్‌లైన్’తో పంచుకున్నారు.
- న్యూస్‌లైన్, చేవెళ్ల
ఇదీ నా ఫ్యామిలీ
నాన్న కామేశ్వరరావు. సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. అమ్మ విజయకుమారి ఎండోమెంట్లో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్నారు. ఇద్దరు చెల్లెళ్లు మృధుల, మౌనిక. చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. నా భర్త శ్రీనివాస్. సీఐడీలో డీఎస్పీగా పనిచేస్తున్నారు. నేను గ్రూప్-1 సాధించడానికి తల్లిదండ్రులతోపాటు భర్త ప్రోత్సాహం ఎంతో ఉంది.
కాకినాడలో అక్షరాభ్యాసం
మా సొంతూరు తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాల విద్యాభ్యాసమంతా అక్కడే సాగింది. కళాశాల విద్యకూడా అక్కడే. కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తిచేశాను. చిన్నప్పటినుంచి ఐఏఎస్ కావాలన్నదే నా కోరిక. కానీ 2006-07లో సివిల్ సర్వీస్ రాశాను. మెయిన్స్ దాటి ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. ఇంటర్వ్యూలో కొద్దిలో తప్పిపోయాను. 2009లో గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు రాశాను. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్-2 లో ఉత్తీర్ణత సాధించడంతో పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి ఏజెన్సీలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐగా చేరాను. అదే సంవత్సరం రాసిన గ్రూప్-1లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచడంతో డీఎస్పీగా ఎంపికయ్యాను. 2011లో ఉద్యోగంలో చేరి అప్పాలో ఒక సంవత్సరంపాటు శిక్షణ పొందాను. అనంతరం జిల్లాలో శిక్షణకోసం చేరాను. దీంతో చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఎస్హెచ్ఓగా విధులు నిర్వర్తిస్తున్నాను.
వైఎస్సార్ నా రోల్ మోడల్
పేద ప్రజలకు సేవ చేయడంలో రాజకీయ నాయకుడు ఎలా ఉండాలనే విషయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి నాకు రోల్‌మోడల్. ఆయన పేదప్రజలకు ఎన్నో పథకాలను అందించి మాస్‌లీడర్‌గా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. కాగా పరిపాలనా పరంగా (అడ్మినిస్ట్రేషన్)లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదర్శం. షారుక్‌ఖాన్ నటన బాగుంటుంది. సినిమాలు చూడడం పెద్దగా ఇష్టంలేకపోయినా అప్పుడప్పుడూ మంచి సినిమాలు వస్తే చూస్తాను.
యువత సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి
యువత అవసరం దేశానికి ఎంతో ఉంది. సేవ చేసే దృక్పథాన్ని యువత అలవర్చుకోవాలి. జ్ఞానం, సాంకేతికపరంగా దేశానికి ఉపయోగపడే లక్ష్యాన్ని ఏర్పరుచుకొని కృషి చేసి సఫలీకృతులు కావాలి. సమయాన్ని వృథా చేయకుండా ఆశయసాధనకు కష్టపడాలి. చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అదే మహాభాగ్యం. నేటి ఆధునిక సమాజంలో నైపుణ్యం ఉన్నవారికి మంచి అవకాశాలు, ఉజ్వల భవిష్యత్తు ఉంది.
చాలా బాధపడ్డా..
2008-07లో ఐఏఎస్ కావాలనే ఆశయంతో సివిల్స్ పరీక్షలు రాశాను. జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టులను ఆప్షన్లుగా ఎంచుకొని ప్రయత్నంచేశాను. మొదటి ప్రయత్నంలోనే మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూ వరకు వెళ్లాను, కొద్దిలో తప్పిపోవడంతో జీవితంలో ఎప్పుడూ పడనంత బాధపడ్డాను. కలెక్టర్‌గానో, ఆర్డీఓగానో ఉద్యోగం వస్తే పేద ప్రజలకు మరింత సేవచేసే అవకాశం లభించేది. కానీ అది మిస్సయింది.
ఆర్థిక స్వావలంబనతోనే మహిళలకు గౌరవం
గ్రామీణ ప్రాంతాల మహిళల్లో అధికశాతం మంది నిరక్షరాస్యులే. చిన్నపాటి విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మహిళల అక్షరాస్యత పెంపునకు, ఆత్మహత్యల నివారణకు కృషిచేస్తా.
మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థికంగా స్వావలంబన సాధించినప్పుడే వారికి గౌరవం. చేవెళ్ల ప్రాంతంలో రో డ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. వీటి నివారణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి.