పాములకు పూజలు నిషేధం
సాక్షి, ముంబై: నాగ పంచమి రోజున ప్రాణమున్న పాములకు పూజలు చేయడంపై హైకోర్టు నిషేధం విధించింది. ఇత్తడి, వెండి, రాగి తదితర లోహాలతో తయారుచేసిన పాము ప్రతిమలకు పూజలు చేసుకోవచ్చని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. వన్య ప్రాణుల చట్టం ప్రకారం పాములను ప్రాణాలతో పట్టడం, వాటిని ఆడించడం, నాగ పంచమి రోజున వాటికి బలవంతంగా పాలు పోయడం లాంటి పనులు చేయకూడదు. ఈ నియమాలను కచ్చితంగా అమలు చేయడంతోపాటు ప్రజల్లో చట్టంపై జాగృతి కల్పించడానికి ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
ఇదిలాఉండగా, ప్రాణం లేని ప్రతిమలతో నాగ పంచమి ఉత్సవాలు జరుపుకోవడం అపరాధమని, దీంతో పాములు పట్టేందుకు అనుమతివ్వాలని కోరుతూ 32 గ్రామాల ప్రజలు కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. అదేవిధంగా వన్య ప్రాణుల చట్టం ప్రకారం పాములు పట్టడం నేరమని, మతం, పండుగల పేరుతో ప్రాణులను హింసించడం మరింత నేరమని పేర్కొంటూ సామాజిక కార్యకర్త అజిత్ పాటిల్ కూడా పిల్ దాఖలు చేశారు. ఇరు వ్యాజ్యాలపై న్యాయమూర్తులు అభయ్ ఓక్, ఎ.ఎస్.చాందుర్కర్ ల బెంచి విచారణ జరిపింది. ఈ సందర్భంగా 32 గ్రామాల ప్రజల తరఫున న్యాయవాది శేఖర్ జగ్తాప్ వాదించారు.
హిందువులకు పండుగ జరుపుకునే హక్కు ఉందని, ఆ ప్రకారం నాగ పంచమి రోజున పాములు పట్టుకునేందుకు అనుమతివ్వాలని జగ్తాప్ డిమాండ్ చేశారు. కాని అందుకు న్యాయమూర్తుల బెంచి నిరాకరించింది. చట్టాన్ని క చ్చితంగా అమలు చేయాల్సిందేనని, నియమాలను ఉల్లంఘించినవారిని శిక్షించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆగస్టు ఒకటో తేదీన నాగ పంచమి జరగనుంది. కాగా కోర్టు తీర్పుతో నాగ భక్తులకు నిజమైన పాములను పూజించేందుకు అవకాశం లేకుండా పోయింది.