వసూళ్ల ‘రాణి’!
ఇందూరు : నిజామాబాద్ రూరల్ ప్రాజెక్టు సీడీపీఓ ఝాన్సీలక్ష్మి అక్రమాలకు పాల్పడుతూ ఐసీడీఎస్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ పేరిట రూ.వేలల్లో బిల్లులు తయారు చేసి దాని మంజూరు కోసం ట్రెజరీలో సమర్పించారు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు బిల్లును నిలుపుచేయించారు. ఇదొక్కటే కాకుండా సీడీపీఓ వివిధ రకాలుగా శిక్షణ కార్యక్రమాలు, కాంట్రాక్టర్లు, అంగన్వాడీ కార్యకర్తల నుంచి అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రెండు నెలల క్రితం జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల, పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించారు. తమ ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించామని అందుకు రూ.35 వేలు ఖర్చు అయ్యిందని బిల్లులు చూపించి ట్రెజరీలో పక్షం రోజుల క్రితం బిల్లులను సమర్పించారు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు కార్యక్రమాలకు అంతగా నిధులు ఖర్చు కావని, ఎంత చేసినా రూ.5000 లలో అవుతుందని లెక్కలు వేసి, సదరు బిల్లులను నిలుపుదల చేయించారు.
సీడీపీఓ ఝాన్సీలక్ష్మిని ఇంత పెద్ద మొత్తంలో బిల్లు ఎలా పెట్టారని ప్రశ్నించారు. దీంతో బిల్లులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఒకరిచే సరిచేయించి రెండు,మూడు వేలు తగ్గించి మళ్లీ బిల్లులును ట్రెజరీకి పంపించారు. సరిచేసిన బిల్లులను కూడా పాస్ చేయవద్దని ఐసీడీఎస్ అధికారులు ట్రెజరీ అధికారులకు తెలిపారు. తప్పుడు బిల్లులు పెట్టిన సీడీపీఓ డొల్లతనం బయటపడటంతో రెండు మూడు రోజుల క్రితం సెలవుపై వెళ్లారు.
వసూళ్ల పర్వం
రూరల్ సీడీపీఓ వసూళ్లకు కూడా పాల్పడుతున్నట్లుగా బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూపర్వైజర్ల టీఏ,డీఏ బిల్లులు చేసినప్పుడల్లా సగం డబ్బులను తన ఖాతాలో వేసుకున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 11 రిజిష్ట్రర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా మార్చిలో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ తరగుతులు నిర్వహించారు. 400మంది కార్యకర్తలు ఈ శిక్షణ తరగతులకు మధ్యాహ్న భోజనాలు ఇంటి నుంచే తెచ్చుకున్నారు. కానీ వారికి భోజనాలు పెట్టినట్లుగా చూపి రూ.లక్షా35వేల నిధుల డ్రా చేశారు. అనుమానం రాకుండా కొంతమందికి నిధులు చెల్లించినట్లు సమాచారం. ఇలా లక్షల్లో అక్రమాలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. బిల్లులు చేసినందుకు తనకు పర్సెంటేజీ ఇవ్వనందుకు కార్యకర్తలను, సూపర్వైజర్లను వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది.
చర్యలు తీసుకుంటాం
- రాములు, ఐసీడీఎస్ పీడీ
నిజామాబాద్ రూరల్ సీడీపీఓపై వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. అయితే ట్రెజరీలో రూ.35 వేలు తప్పుడు బిల్లులు సమర్పించిన విషయం వాస్తవమే. ఆ బిల్లు నిలిపివేయాలని ట్రెజరీ అధికారులకు సూచించాం. ఇటు అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లు చేస్తున్న విషయంపై దృష్టి సారించి క్షేత్ర స్థాయిలో విచారణ చేస్తాం.