ఎలగందుల ఖిల్లాకు కళ
సాక్షి, కరీంనగర్ : శతాబ్ధాల చారిత్రక వైభవానికి జిల్లాలోని ఎలగందుల ఖిల్లా ప్రతీక. కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ఆ ఖిల్లా ఆదరణను కోల్పోయింది. ఈ నేపథ్యంలో తిరిగి ఎలగందుల ఖిల్లా పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది. ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు పర్యాటకశాఖ, పురావస్తు శాఖల నుంచి నిధులు మంజూరయ్యాయి.
జిల్లాలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఎలగందుల ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలన్న ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. చివరకు కేంద్ర పర్యాటక శాఖ ఎలగందుల ఖిల్లా వద్ద సౌండ్ అండ్ లైట్ ప్రాజెక్టును మంజూరు చేసింది. ఇందుకు రూ.4.62 కోట్లు మంజూరు చేసింది. సౌండ్ అండ్ లైట్ సిస్టమ్ ఏర్పాటు కోసం రాష్ట్ర పర్యాటక శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఎలగందులకు చారిత్రకంగా ఉన్న ప్రాముఖ్యాన్ని ప్రముఖ చరిత్రకారుడు జెశైట్టి రమణయ్య నుంచి సేకరించి దాన్ని డాక్యుమెంటరీగా రూపొందించనున్నారు. ఈ పనులు వారం రోజుల్లో పూర్తవుతాయని, ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని తెలుస్తోంది.
చారిత్రక ప్రాధాన్యం..
1905కు ముందు ఎలగందుల కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఉంది. ఎలగందుల ఖిల్లాలో నిజాం ప్రభుత్వ ప్రతినిధిగా ఖిలేదారు కరీముద్దీన్ వ్యవహరించేవారు. 1905లో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లాకేం ద్రాన్ని 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్‌కు మార్చారు. కరీముద్దీన్ పేరిటే కరీంనగర్ ఏర్పడిందన్న వాదన ఉంది. ఇంత చారిత్రక ప్రా ముఖ్యం ఉన్న ఎలగందుల ఖిల్లా క్రమంగా శిథిలావస్థకు చేరుతోంది. దీ నిని పరిరక్షించడానికి జిల్లా పర్యాటకశాఖ అధికారులు పురావస్తు శాఖ కు రూ.3కోట్ల అంచనాలతో ప్రతిపాదన పంపారు. ఖిల్లా ప్రాకారం పునరుద్ధరణ, ఖిల్లా లోపల రాణీమహల్, బందీఖానాల మరమ్మతులు, ఉ ద్యానవన అభివృద్ధి తదితర పనులు ఇందులో ఉన్నాయి. ఈ ప్రతిపాదనకు పురావస్తు శాఖ సానుకూలంగా స్పందించి రూ.కోటి నిధులు మం జూరు చేసింది.ఈ పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయింది.
2న శంకుస్థాపన
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఫిబ్రవరి 2న ఎలగందుల ఖిల్లా వద్ద సౌండ్ అండ్ లైట్ సిస్టమ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధి కోసం తాను వివిధ ప్రతిపాదనలు చేయగా, ఈ పథకానికి నిధులు మంజూరయ్యాయని ఆయన చెప్పారు.