ఇదే అదును.. లూటీకి పదును!
♦ ఇసుకను లూఠీ చేస్తున్న పచ్చనేతలు
♦ ప్రొక్లైయిన్లతో తోడేయడం...లారీలతో తరలించడం
♦ ఆదినిమ్మాయపల్లెలో రేటు ఫిక్స్ చేస్తున్న హెడ్‌కానిస్టేబుల్
♦ కొండాపురంలో 8లారీలు సీజ్...మరో 15లారీలను విడిపించిన టీడీపీ నేత
అధికారం అండ ఉంది..అవకాశం వచ్చింది.. ఇంకేముంది వీలైనంత దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు పచ్చనేతలు. పోలీసుల మద్దతుతో ఓ చోట.. సొంత మందితో మరోచోట విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. అడ్డూ అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. ఇసుక క్వారీలు రద్దు చేయడంతో పచ్చ నేతలు చెలరేగిపోతున్నారు. ఆదినిమ్మాయపల్లె వద్ద ముగ్గురు నేతలు ముచ్చటగా మూడుచోట్ల టోల్గేట్ విధించి బలవంతంగా లాక్కుంటున్నారు. ఇందుకు ఏకంగా ఓ హెడ్‌కానిస్టేబుల్ వత్తాసు పలుకుతున్నాడు.
సాక్షి ప్రతినిధి, కడప: ఇసుక క్వారీలు రద్దు చేయడం అధికారపార్టీ నేతలకు కలిసొచ్చింది. జిల్లాలో పలు క్వారీల నుంచి ఇసుకను ఉచితంగా తరలించుకోవచ్చుని అధికారికంగా ఉత్తర్వులు వెలుబడ్డాయి. అందులో ఆదినిమ్మాయపల్లె ఇసుక క్వారీ కూడా ఉంది. అక్కడ టీడీపీ నేతలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. మూడు చోట్ల ముగ్గురు నాయకులు టోల్‌ఫ్లాజా నిర్వహిస్తున్నారు. మూడు చోట్ల ముడుపులు చెల్లించడం సబబేనని వల్లూరు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ హెడ్‌కానిస్టేబుల్ వత్తాసుగా నిలుస్తుండడం విశేషం. పొలాలకు వ్యక్తిగత అవసరాలకు తీసుకెళ్లుతున్నా.. అనధికారికంగా నిర్వహిస్తున్నా.. టోల్‌ఫ్లాజాలో సొమ్ము చెల్లించకపోతే సదరు హెడ్‌కానిస్టేబుల్ దాడులు చేయడం.. కేసు నమోదు చేస్తామని బెదిరిస్తూ అండగా నిలుస్తున్నట్లు సమాచారం. ఆదినిమ్మాయపల్లె క్వారీ నుంచి జేసీబీ ద్వారా రాత్రిపూట యధేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నట్లు సమచారం. క్వారీని అనధికారికంగా పచ్చనేతలు నడుపుతున్నారు. వీరిలో ఓ మాజీ ఎమ్మెల్యే మేనల్లుడు, మరోటీడీపీ నేత సమీప బంధువు ఉన్నట్లు తెలుస్తోంది. వారితోపాటుగా తమకు సైతం చెల్లించాల్సిందేనని స్థానిక టీడీపీ నేతలు ఓ జట్టుగా ఏర్పడ్డట్లు తెలుస్తోంది.
పెన్నానదీ లూటీ..
జల్లా సరిహద్దులు కొండాపురం నుంచి ప్రొద్దుటూరు వరకూ పెన్నానదీని పచ్చ నేతలు యథేచ్ఛగా లూఠీ చేస్తున్నారు. కొండాపురం మండలంలో గ్రామస్థాయి నాయకులు పోటీపడి ఇసుకను కొల్లగొట్టుతున్నారు. నిత్యం నంద్యాల, బెంగుళూరుకు ఇసుక తరలివెళుతోంది. లారీలను తనిఖీ లేకుండా పట్టలు కట్టుకొని ఇసుకను తరలిస్తున్నారు. అధికారులు అండదండలతో యధేచ్చగా అక్రమవ్యవహారం సాగుతోంది. ఈక్రమంలో సోమవారం సాయంత్రం విజిలెన్సు అధికారులకు కొండాపు రం క్వారీలో 8లారీలు పట్టుబడ్డట్లు సమాచారం. మరో 15లారీలను స్థానిక టీడీపీ నేత అక్కడి నుంచి తరలించి నట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ వాహనాల్లో ఆన్ గవర్నమెం ట్ డ్యూటీ అని ఉన్న టిప్పర్ కూడా ఉన్నట్లు సమాచారం.
హనుమాన్‌గుత్తి టు ఆర్టీపీపీ....
ఓ ఎంపీ సోదరుడి నేతృత్వంలో హనుమాన్‌గుత్తి నుంచి ఆర్టీపీపీకి ప్రతిరోజు 30ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. పోట్లదుర్తికి చెందిన వ్యక్తులు పెన్నానదిలో తిష్టవేసి ఆ ట్రాక్టర్లు మినహా మరే ట్రాక్టర్ నదిలో దిగేందుకు వీలులేదని ఆంక్షలు విధించినట్లు సమచారం. ఆర్టీపీపీ కట్టడాలకు మొత్తం తామే ఇసుకను సరఫరా చేస్తామని, మరెక్కడా కొనుగోలు చేయరాదంటూ హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇసుకక్వారీలు రద్దు కావడం పచ్చ నేతలకు వరంగా మారిందని పరిశీలకులు భావిస్తున్నారు.