ప్రముఖ పాత్రికేయుడు వినోద్ మెహతా కన్నుమూత
న్యూఢిల్లీ: కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ప్రముఖ జర్నలిస్టు, టీవీ వ్యాఖ్యాత వినోద్ మెహతా(73) ఇక లేరు. సుదీర్ఘకాలంగా ఊపిరితిత్తుల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఇక్కడి ఎయిమ్స్ ఆస్పత్రిలో మరణించారు. మెహతా అంత్యక్రియలను లోడీ రోడ్డు శ్మశానవాటికలో నిర్వహించారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, బీజేపీ నేత ఎల్కే అద్వానీ, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆంగ్ల వార్తాపత్రిక ‘ఔట్లుక్’ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ చైర్మన్ అయిన మెహతా సాహసోపేత జర్నలిజానికి మారుపేరు. సండే అబ్జర్వర్, ఇండియన్ పోస్ట్, ది ఇండిపెండెంట్, ద పయనీర్(ఢిల్లీ ఎడిషన్) వంటి విజయవంతమైన పత్రికలను ఆయన ప్రారంభించారు.
మెహతా 1942లో ఇప్పటి పాకిస్తాన్‌లోని రావల్పిండిలో జన్మించారు. ఆయన కుటుంబం దేశ విభజన తర్వాత లక్నోలో స్థిరపడింది. మెహతా బీఏ చదివాక భారత్, బ్రిటన్లలో చిన్నచితకా పనులు చేశారు. 1974లో ‘డెబోనేర్’ అనే పురుషుల పత్రికలో ఎడిటర్‌గా చేరారు. ‘ద పయనీర్’ ప్రారంభించారు. ఆయన ఆత్మకథ ‘లక్నో బాయ్’ పాఠకాదరణ పొందింది. ఆయన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా పనిచేశారు. మెహతా భార్య సుమితా పాల్ కూడా జర్నలిస్టే. మెహతా మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఆయన ఉత్తమ జర్నలిస్టు, రచయితగా గుర్తిండిపోతారని పేర్కొన్నారు. ఎపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ తదితరులు కూడా సంతాపం వ్యక్తం చేశారు.