మేమంటే వాళ్లకు భయం!
సాక్షి, చెన్నై : డీఎంకే, కాంగ్రెస్‌లను చూస్తే చాలు, అన్నాడీఎంకేకు ఎక్కడి లేని భయం పుట్టుకు వస్తున్నదని నటి కుష్బు వ్యాఖ్యానిస్తున్నారు. తమ ప్రచార పర్యటనలకు వస్తున్న స్పందన చూసి భయంతో వణుకుతున్నారట. అందుకే సీఈసీ వద్దకు అన్నాడీఎంకే ఎంపిలు పరుగులు తీశారని ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల యంత్రాంగం కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా అన్నాఢీఎంకే అనుకూల అధికారుల భరతం పట్టే విధంగా బదిలీల పర్వం సాగుతున్నది. దీంతో అన్నాడీఎంకే వర్గాల్లో ఆగ్రహం రేగి, ఎంపిలందరూ కట్టకట్టుకుని సీఈసీ నజీం జైదీకి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.
మంగళవారం కన్యాకుమారికి వచ్చిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్బు సీఈసీకి ఎంపీల ఫిర్యాదు వ్యవహారంగా స్పందిస్తూ చలోక్తులు, చమత్కారాలు, వ్యాంగ్యాస్త్రాలను విసిరారు. అబ్బో వాళ్లకు భయం ఎక్కువే , డీఎంకే, కాంగ్రెస్‌లకు అనుకూలంగా వాతావరణం మారడంతో మరీ భయం పెరిగినట్టుందని ఎద్దేవా చేశారు. అధికార పగ్గాల్ని డీఎంకే, కాంగ్రెస్ కూటమి చేపట్టడం ఖాయం అన్నది స్పష్టం అవుతుండడంతో అన్నాడీఎంకేలో ఓటమి భయం రెట్టింపు అయిందని చమత్కరించారు. ముందస్తుగా సిద్ధం చేసుకున్న వ్యూహాలు బెడిసి కొడుతుండడంతోఅధికారుల బదిలీలను ఆపించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట.
వాళ్ల ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టినట్టే. అని కుష్బు సెలవిచ్చారు. ఇక, తమ ప్రచారాలకు వస్తున్న స్పందనను ఎత్తి చూపుతూ, తమకు తిరుగు లేదని వ్యాఖ్యానించారు. అలాగే, పెద్ద ఎత్తున జనం తరలి వస్తే చాలు, ఓట్లు రాలినట్టే అని పదే పదే ధీమా వ్యక్తం చేస్తున్నారట. అయితే, గత ఎన్నికల్లో ఓట్లు ఎందుకు రాలేదో, అదే విధంగా, గత ఎన్నికల్లో డీఎంకే కండువాతో ప్రచారంలోకి వచ్చిన కుష్బు ఈ సారి కాంగ్రెస్ కండువాతో ప్రత్యక్షం అవుతుండడంతో ఓట్లు రాలుతాయన్న ధీమా వ్యక్తం చేస్తున్నట్టుంది.