పక్కా సమాచారం ఇవ్వాల్సిందే
బెదిరింపులకు దిగడం సరికాదు
కేసులకు హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు
పలువురు అధికారులకు జరిమానా
ఆర్టీఐ రాష్ట్ర కమిషనర్ విజయబాబు
అనంతపురం టౌన్ : సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా దరఖాస్తు చేస్తే వివరాలన్నీ పక్కాగా ఇవ్వాల్సిందే.’ అని సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ పి.విజయబాబు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులకు సూచించారు. ఆర్టీఐకి సంబంధించిన కేసుల విచారణకు అప్పిలేట్ అధికారులు హాజరుకాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
బుధవారం డ్వామా హాల్లో సీమ పరిధిలోని జిల్లాల్లో మునిసిపాలిటీ, పంచాయతీరాజ్, డీఆర్డీఏ–వెలుగు, డ్వామా శాఖలకు సంబంధించి 36 కేసులపై విచారణ చేపట్టారు. సుమారు 18 కేసులకు సంబంధించి అధికారులు రాకపోవడంపై మండిపడ్డారు. వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసినా కమిషన్ ముందుకు హాజరుకాని డీఆర్డీఏ, ఐకేపీ పుట్టపర్తి ఏపీఎం, బ్రహ్మసముద్రం ఈఓఆర్డీకి రూ.5 వేలు, కడప మునిసిపల్ కార్యాలయం సిటీ ప్లానింగ్ అధికారికి రూ.2 వేలు జరిమానా విధించారు.
సమాచారం అడిగిన వారితో పాటు హైదరాబాద్ నుంచి కమిషన్ వస్తే జిల్లాలోనే ఉన్న అధికారులు రావడం లేదంటే వారికి చట్టంపై ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చని విజయబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీడీఓపై ఆగ్రహం :
సోమందేపల్లి మండలంలో పింఛన్లకు సంబంధించి సమాచారం ఇవ్వలేదని, రూ.10.67 లక్షల అవినీతి జరిగిందని సమాచార హక్కు దరఖాస్తుదారుడు బాబుప్రసాద్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం కోసం రూ.3342 కట్టించుకున్నారని, వివరాలు మాత్రం అందజేయలేదన్నారు. పైగా బెదిరిస్తున్నారని ఎంపీడీఓ లలితాబాయిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీడీవోను ఆయన ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం డీఆర్డీఏ పీడీ పరిధిలో ఉంటుందని ఆమె తెలుపగా అదే విషయాన్ని రాసివ్వాలని, రికవరీ నివేదికను కమిషన్‌కు అందజేయాలని ఆదేశించారు.
విచారణకు ఆదేశం :
∙దర్మవరంలోని బీఎస్ఆర్ బాలికల హైస్కూల్, ఎస్పీసీఎస్ గర్‌్ల్స హైస్కూల్స్‌లో ఉపాధ్యాయులు మహిళలే ఉండాలని జీవో 33 ఉందని, నిబంధనలకు విరుద్ధంగా సుమారు 19 మంది పురుషులు ఉన్నట్లు అనంతపురానికి చెందిన ఉపాధ్యాయుడు పెద్దన్న తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి వివరాలు కోరినా ఇవ్వడం లేదని చెప్పడంతో తక్షణం విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
∙పెనుకొండ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిందని, వివరాలడిగితే సరిగ్గా ఇవ్వడం లేదని బాబావలి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక పుట్టపర్తి వెలుగు కార్యాలయంలో గతంలో పంపిణీ చేసిన గడ్డపారల వివరాలు అడిగితే రికార్డులు లేవని సమాధానం ఇచ్చారని కర్ణాటక నాగేపల్లికి చెందిన ప్రసాద్ విచారణలో తెలిపారు. దీంతో సంబంధిత ఉన్నతాధికారికి షోకాజ్ నోటీస్‌తో పాటు రూ.5 వేలు జరిమానా విధించారు. తాడిపత్రికి సంబంధించి ఓ పంచాయతీలో పని చేస్తున్న వారి వివరాలు ఇవ్వనందుకు డీపీఓకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు.