మాల్యా 6,630 కోట్ల ఆస్తులు ఈడీ జప్తు
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకుని విదేశాలకు చెక్కేసిన పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా ఆస్తుల జప్తునకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) రెండో జప్తు ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఫామ్‌హౌస్, ఫ్లాట్స్, ఎఫ్డీలుసహా రూ.6,630 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. అక్రమ ధనార్జనా కేసులో ఈడీ ఈ చర్య తీసుకుంది. దీనితో ఈ కేసుకు సంబంధించి ఈడీ జప్తు విలువ రూ.8,041 కోట్లకు చేరింది. వాస్తవానికి తాజా ఉత్తర్వు జప్తు ఆస్తుల విలువ రూ.4,235 కోట్లని అయితే ఆయా ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ రూ.6,630 కోట్లని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.
ఆస్తులు ఇవీ: జప్తు చేసిన ఆస్తుల్లో మాడ్వా ఫామ్ హౌస్ (రూ.25 కోట్లు), బెంగళూరు కింగ్ ఫిషర్ టవర్లోని మల్టీఫ్లాట్స్ (రూ.565 కోట్లు), ప్రైవేటు బ్యాంకుల్లో రూ.10 కోట్ల స్థిర డిపాజిట్లు ఉన్నాయి. వీటితోపాటు యూఎస్ఎల్, యునెటైడ్ బ్రువరీస్ లిమిటెడ్, మెక్‌డోవెల్ హోల్డింగ్ కంపెనీ షేర్లు కూడా జప్తు ఉత్తర్వుల్లో ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.3,635 కోట్లు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్‌తో నేరపూరితంగా కుమ్మకై, బ్యాంకుల నుంచి సమీకరించిన నిధులను అక్రమ మార్గాల్లోకి మళ్లించడం ద్వారా అక్రమ ధనార్జనకు మాల్యా పాల్పడినట్లు ఈడీ ఆరోపించింది. సీబీఐ ఇప్పటికే విచారణ జరుపుతున్న 17 బ్యాంకులకు మాల్యా రుణ ఎగవేత కేసుకు కూడా ఇటీవల ఈడీ విచారణా పరిధి విస్తరించిన సంగతి తెలిసిందే. అటు తర్వాత జరిగిన తాజా జప్తు ప్రక్రియ ఇది.