ఒకే ఖాతా ద్వారా ఆస్తుల సమాచారం!
అవకాశాలపై నియంత్రణ సంస్థల చర్చలు
కోల్కతా: వ్యక్తిగత ఆస్తుల సమాచారాన్ని ఒకే ఖాతాలో క్రోడీకరించేందుకు వీలుగా ఆర్థిక వ్యవహారాల నియంత్రణ సంస్థలు ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏ చేతులు కలిపాయి. తద్వారా ఎవరైనా ఒక వ్యక్తి ఒకే ఖాతా ద్వారా తనకు సంబంధించిన వివిధ ఆస్తుల వివరాలను పొందేందుకు వీలు కల్పించాలని భావిస్తున్నాయి. వెరసి బ్యాంక్ ఖాతాలు, షేర్లు, బాండ్లు, బీమా పథకాలు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు తదితర ఆస్తులను ఒకే ఖాతా ద్వారా క్రోడీకరించే యోచనలో ఉన్నాయి.
ఈ దిశలో అంతర్నియంత్రణ సాంకేతిక బృందం(ఐఆర్టీజీ) ఇచ్చిన సూచనమేరకు ఆర్థిక స్థిరీకరణ, అభివృద్ధి మండలి(ఎఫ్ఎస్డీసీ)పై ఏర్పాటైన ఉపకమిటీ గురువారమిక్కడ సమావేశమై చర్చలు నిర్వహించింది. ఉపకమిటీలో సభ్యులైన ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏ, పీఎఫ్ఆర్డీఏ, ఎఫ్ఎంసీల చీఫ్లతోపాటు, ఆర్థిక శాఖ ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశం తరువాత ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఒకే ఖాతా ద్వారా వివిధ ఆస్తుల అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇందుకు ఉన్న అవకాశాలపై తామంతా చర్చించినట్లు తెలిపారు.