రష్యాతో భారీ రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్
అంతర్జాతీయం
40 ఒప్పందాలపై చైనా, బంగ్లాదేశ్ సంతకాలు
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అక్టోబర్ 13న బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య విద్యుత్తు, రోడ్డు మార్గాలు - రైల్వే అనుసంధానత, మౌలిక వసతుల్లో పెట్టుబడులు వంటి కీలక రంగాల్లో 40 ఒప్పందాలు కుదిరాయి. బంగ్లాదేశ్‌లో చైనా అధ్యక్షుడు పర్యటించడం గత 30 ఏళ్లలో ఇదే తొలిసారి.
రెండు ఖండాలను కలిపే కేబుల్ లైన్ ఏర్పాటుకు అంగీకారం
అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రపంచంలో అత్యధిక దూరం సముద్ర గర్భంలో నుంచి కేబుల్ లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు గూగుల్, ఫేస్బుక్ సంస్థలు ప్రకటించాయి. పసిఫిక్ మహాసముద్రం ద్వారా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నుంచి హాంగ్‌కాంగ్‌కు 12,800 కి.మీ హైస్పీడ్ ఇంటర్నెట్ కేబుల్ ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా అమెరికా, ఆసియాలను అనుసంధానం చేస్తారు. ఇప్పటికే అమెరికా, జపాన్ల మధ్య ప్రపంచంలోనే తొలి హై కెపాసిటీ ఇంటర్నెట్ కేబుల్ సముద్ర గర్భం నుంచి ఏర్పాటై ఉంది.
ఆకలి సూచీలో 97వ స్థానంలో భారత్
అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ.. అక్టోబర్ 11న విడుదల చేసిన ప్రపంచ ఆకలి సూచీ (జీహెచ్ఐ)లో భారత్ 97వ స్థానంలో నిలిచింది. 118 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చేసిన సర్వే ఆధారంగా ఈ సూచీ రూపొందింది. నైజీరియా, చాద్, ఇథియోపియా, సియర్రాలియోన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌ల పరిస్థితి భారత్ కంటే దారుణంగా ఉంది. శ్రీలంక , బంగ్లాదేశ్, చైనా, నేపాల్‌లు.. భారత్ కంటే మెరుగ్గా ఉన్నాయి. పౌష్టికాహారానికి నోచుకోని జనాభా ఎంత? ఐదేళ్ల వయసులో పిల్లలు మరణాలు, చదువుకునేవారు ఎంత మంది? వంటి అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
కామన్వెల్త్ నుంచి వైదొలగిన మాల్దీవులు
కామన్వెల్త్ దేశాల గ్రూపు నుంచి వైదొలుగుతున్నట్లు మాల్దీవులు అక్టోబర్ 13న ప్రకటించింది. 2012 నాటి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ నషీద్‌ను పదవీచుత్యుణ్ని చేయడానికి దారితీసిన పరిస్థితులను, రాజకీయ అశాంతిని అరికట్ట లేకపోయినందువల్ల ఆ దేశంపై ఆంక్షలు విధించాలని కామన్వెల్త్ నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా కామన్వెల్త్ నుంచి వైదొలుగుతున్నట్లు మాల్దీవులు పేర్కొంది. 53 దేశాలున్న కామన్వెల్త్ దేశాల కూటమి నుంచి 2013లో జాంబియా వైదొలగగా, తర్వాత తప్పుకున్న దేశం మాల్దీవులు.
జాతీయం
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు బ్రిక్స్ దేశాల పిలుపు
ప్రపంచ దేశాలన్నీ తమ భూభాగాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని, ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఐక్యరాజ్య సమితి తీర్మానానికి త్వరగా ఆమోదం తెలపాలని బ్రిక్స్ దేశాల సదస్సు కోరింది. గోవాలో జరిగిన వార్షిక సదస్సులో సభ్య దేశాలు.. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు ఈ మేరకు తీర్మానిస్తూ అక్టోబర్ 16 ప్రకటన (గోవా డిక్లరేషన్) విడుదల చేశాయి. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న వ్యవస్థీకృత నేరాలైన మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిర్మూలించడంతోపాటు ఉగ్రవాదుల స్థావరాల్ని నాశనం చేయడం, ఇంటర్నెట్ ద్వారా ఉగ్రవాద అనుకూల ప్రచారాన్ని తిప్పికొట్టడంపై ప్రధానంగా దృష్టి సారించాలని సదస్సు పేర్కొంది. అనేక దేశాల్లో రాజకీయ, భద్రతాపర అస్థిరతపై బ్రిక్స్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో సహకారమందిస్తామంది. నిజాయితీతో కూడిన పన్ను వ్యవస్థకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. అంతర్జాతీయ ఉగ్రవాదానికి పొరుగు దేశమే పుట్టినిల్లుగా మారిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని, దానికి పూర్తి మద్దతిస్తున్న వారిని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు సమగ్ర, సంయుక్త కార్యాచరణతో ముందుకెళ్లాలని కోరారు.
రష్యాతో భారీ రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్
పనాజీ (గోవా)లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత్.. రష్యాతో 16 ఒప్పందాలను అక్టోబర్ 15న కుదుర్చుకుంది. వీటిల్లో రష్యా నుంచి ఎస్ 400 ట్రయంఫ్ దీర్ఘశ్రేణి వాయు రక్షణ వ్యవస్థల కొనుగోలుతోపాటు, నాలుగు అడ్మిరల్ గ్రిగోరోవిచ్ తరగతి (ప్రాజెక్ట్ -11356) నిర్దేశిత క్షిపణి రహస్య యుద్ధ నౌకల కొనుగోలు, కమోవ్ హెలికాప్టర్ల తయారీ కోసం సంయుక్త ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, హైడ్రోకార్బన్లు, అంతరిక్షం, స్మార్‌టసిటీలు, హైస్పీడ్ రైళ్లు వంటి వాటిలో సంబంధాలు బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఉరీ ఉగ్రదాడి సహా అనేక అంశాలు చర్చకు వచ్చాయి.
భోపాల్‌లో అమర వీరుల స్మారక కేంద్రం
యుద్ధంలో అమరవీరులైన సైనికుల స్మృత్యర్థం దేశంలో తొలిసారిగా భోపాల్‌లో నిర్మించిన అమర వీరుల (శౌర్య) స్మారక కేంద్రాన్ని అక్టోబర్ 13న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 12.67 ఎకరాల్లో రూ.41 కోట్ల వ్యయంతో శౌర్య స్మారక కేంద్రాన్ని నిర్మించారు. సైనికులు కేవలం పరాక్రమానికే కాదు మానవత్వానికి కూడా ప్రతీకలని మోడీ పేర్కొన్నారు. వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ పథకం అమలుతో మాజీ సైనికులకు లబ్ధి చేకూర్చామన్నారు.
రాష్ట్రీయం
తెలంగాణలో 21 కొత్త జిల్లాలు ప్రారంభం
తెలంగాణలో 21 కొత్త జిల్లాలు ఏర్పాటుతో రాష్ర్టంలో జిల్లాల సంఖ్య 31కి చేరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధిపేట జిల్లాను, మిగిలిన జిల్లాలను మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసన మండలి చైర్మన్ అక్టోబర్ 11న ప్రారంభించారు. ఒకే రోజున కొత్తగా రాష్ర్టంలో 21 జిల్లాలు, 25 రెవెన్యూ డివిజన్లు, 125 మండలాలు ఉనికిలోకి వచ్చాయి. దీంతో రాష్ర్టంలో మొత్తం జిల్లాల సంఖ్య 31కి, రెవెన్యూ డివిజన్లు 68కి, మండలాలు 584కి చేరుకున్నాయి. 1974 జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం కింద తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు.
సిలికాన్ వ్యాలీలో టీ - బ్రిడ్జి ప్రారంభం
హైదరాబాద్‌లో స్టార్టప్‌లను ప్రపంచ దేశాలతో అనుసంధానం చేసే టీ - బ్రిడ్జిని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో అక్టోబర్ 15న ప్రారంభించారు. ఉబర్, టై సిలికాన్ వ్యాలీలతో కలిసి.. టీ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని 10 స్టార్టప్ నగరాల్లో ఒకటిగా హైదరాబాద్‌ని నిలపాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ధాన్యం సేకరణ విధానం ప్రకటించిన తెలంగాణ
రాష్ర్టంలో ధాన్యం సేకరణ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 14న ప్రకటించింది. 2016 - 17 మార్కెటింగ్ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించింది. ఏ - గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ. 1,510, సాధారణ రకం క్వింటాల్‌కు రూ. 1,470 చెల్లించాలని నిర్ణయించింది.
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి అనుమతి
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించనున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ పథకం ద్వారా పోలవరం ఎడమ ప్రధాన కాల్వ నుంచి ఏలేరు రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు. ఇందులో భాగంగా 24 టీఎంసీలను విశాఖలోని పరిశ్రమలకు, గృహ అవసరాల కోసం కేటాయిస్తారు. విశాఖ జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారు.
అవార్డులు
బాబ్డెలాన్కు సాహిత్యంలో నోబెల్
అమెరికాకు చెందిన ప్రముఖ గేయ రచయిత బాబ్డెలాన్కు సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. 1941లో అమెరికాలో జన్మించిన బాబ్ అసలు పేరు రాబర్ట ఎలెన్ జిమ్మర్‌మ్యాన్. ఆయన గేయ రచయితగా, గాయకుడిగా మంచి పేరు సంపాదించారు. బాబ్ రచించిన బ్లోయింగ్ ఇన్ ది విండ్, ది టైమ్స్ దే ఆర్ ఏ-చేంజింగ్ గేయాలు అమెరికా పౌర హక్కులు, యుద్ధ వ్యతిరేక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చే గీతాలుగా నిలిచాయి.
సైన్స్ అండ్ టెక్నాలజీ
హైడ్రోఫ్లోరో కార్బన్ల తగ్గింపునకు కిగాలి
సదస్సులో ఒప్పందం
హైడ్రోఫ్లోరో కార్బన్ల తగ్గింపునకు సంబంధించిన ఒప్పందానికి 197 దేశాలు కిగాలి (రువాండా)లో అక్టోబర్ 15న ఆమోదం తెలిపాయి. 2045 నాటికి దాదాపు 85 శాతం హైడ్రోఫ్లోరో కార్బన్ (హెచ్ఎఫ్సీ)లను తగ్గిస్తారు. ఇవి గ్రీన్హౌస్ ఉద్గారాలకు చెందినవే. భూతాపాన్ని పెంచే ఈ ఉద్గారాలను ఎక్కువగా రిఫ్రిజిరేటర్లు, కార్ల ఎయిర్ కండీషనర్లలో వినియోగిస్తారు. వీటి ఉద్గారాలు ఏటా 10 శాతం పెరుగుతున్నాయి. ఇవి కార్బన్ డై ఆక్సైడ్ కంటే ప్రమాదకరమైనవి. కిగాలి ఒప్పందం ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలు హెచ్ఎఫ్సీల తగ్గింపును 2019 నుంచి ప్రారంభించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలు 2024 నుంచిచేపట్టాలి. ఈ ఉద్గారాలను 2050 నాటికి పూర్తిగా నిర్మూలించాలి. ఇది పారిస్ ఒప్పందానికి సంబంధించి అతి ముఖ్యమైన అంశం. పారిస్ ఒప్పందం ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్ లోపు ఉంచాలని నిర్దేశిస్తోంది.
ఆర్థికం
సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.31 శాతం
ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడంతో సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.31 శాతంగా నమోదైంది. ఇది 13 నెలల కనిష్ట స్థాయి. ఆగస్టులో ద్రవ్యోల్బణం 5.05 శాతంగా ఉంది. వరుసగా రెండు నెలల పాటు ద్రవ్యోల్బణం తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 13న ప్రకటించింది. 2016 - 17 ఆర్థిక సంవత్సరంలో మొదటిసారి రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశించిన 5 శాతం కంటే తక్కువగా నమోదు కావడం విశేషం.
వార్తల్లో వ్యక్తులు
థాయ్ రాజు అదుల్య కన్నుమూత
థాయ్‌లాండ్ రాజు భుమిబోల్ అదుల్యదేజ్ (88) అక్టోబర్ 13న బ్యాంకాక్‌లో మరణించారు. థాయ్‌లాండ్‌ను అత్యధిక కాలం పరిపాలించిన రాజుగా ప్రత్యేకత సాధించారు. సుమారు 70 ఏళ్లపాటు థాయ్‌లాండ్‌ను పరిపాలించిన ఆయనను రామా-9గా కూడా వ్యవహరిస్తారు. యువరాజు మహా వజిరలాంకోర్న (63) తదుపరి థాయ్‌లాండ్ రాజు కానున్నారు.
క్రీడలు
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్న భారత్
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. అక్టోబర్ 12న ముగిసిన మూడో టెస్ట్‌ను గెలుచుకోవడంతో సిరీస్ 3-0 తేడాతో భారత్‌కు దక్కింది. అశ్విన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. దీంతో భారత్ మూడు అంతకంటే ఎక్కువ టెస్టు సిరీస్‌ల్లో క్లీన్ స్వీప్ చేయడం ఇది నాలుగోసారి. గతంలో 1993లో ఇంగ్లండ్‌పై 3-0, 1994లో శ్రీలంకపై 3-0తో, 2013లో ఆస్ట్రేలియాపై 4-0తో భారత్ సిరీస్‌లు గెలుచుకుంది.
రంజీల్లో 594 పరుగులతో రికార్డు నెలకొల్పిన గుగలే, బావ్నే
ముంబై వాంఖడే మైదానంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ర్ట బ్యాట్స్‌మెన్స్.. స్వప్నిల్ గుగలే, అంకిత బావ్నే జోడీ.. 594 పరుగుల భాగస్వామ్యంతో రికార్డు సృష్టించారు. రంజీల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. అయితే శ్రీలంకకు చెందిన మహేలా జయవర్థనే, కుమార సంగక్కర దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో (2006) మూడో వికెట్‌కు చేసిన 624 పరుగుల రికార్డును వీరు అధిగమించలేకపోయారు.