కొలంబోలో రణరంగం
కొలంబో: తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభం, ఆహార కొరతతో అల్లాడిపోతున్న శ్రీలంకలో శనివారం సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైన అధ్యక్షుడు గొటబయా రాజపక్స, ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జనం రణరంగం సృష్టించారు. ‘దేశమంతా కొలంబో’కు అంటూ ఉద్యమ నాయకులు ఇచ్చిన పిలుపునకు మద్దతుగా వేలాది మంది నిరసనకారులు గొటబయా రాజపక్స అధికారిక నివాసాన్ని ముట్టడించారు.
పరిస్థితిని ముందే గ్రహించిన ఆయన శుక్రవారమే తన నివాసం నుంచి పరారయ్యారు. ప్రధాని విక్రమసింఘే నివాసానికి జనం నిప్పుపెట్టారు. ప్రజాగ్రహాన్ని గుర్తించిన విక్రమసింఘే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ప్రజల భద్రత కోసం, ప్రతిపక్ష నాయకుల సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా పదవి నుంచి తప్పుకుంటున్నానని ప్రధాని విక్రమసింఘే ట్విట్టర్లో స్పష్టం చేశారు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటై, పార్లమెంట్లో మెజారిటీ నిరూపించుకొనేదాకా విక్రమసింఘే ప్రధానమంత్రిగా బాధ్యతలు కొనసాగిస్తారని, ఈ తర్వాతే రాజీనామా చేస్తారని ఆయన కార్యాలయం వెల్లడించింది. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక ఈ ఏడాది మే నెలలో గొటబయా రాజపక్స సోదరుడు మహిందా రాజపక్స ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడంతో విక్రమసింఘే నూతన ప్రధానిగా నియమితులైన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు గొటబయా కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈ నెల 13న పదవి నుంచి వైదొలుగుతానని స్పీకర్‌కు సమాచారమిచ్చారు.
జనం అధీనంలోకి ప్రెసిడెంట్ హౌస్
సెంట్రల్ కొలంబోలో హై సెక్యూరిటీ కలిగిన ఫోర్ట్ ఏరియాలో అధ్యక్షుడు గొటబయా రాజపక్స అధికారిక నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ సంఖ్యలో పోలీసులు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, జవాన్లు మోహరించారు. దేశంలో సంక్షోభాన్ని పరిష్కరించలేని అధ్యక్షుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది నిరసనకారులు రాజపక్స నివాసాన్ని ముట్టడించారు. శ్రీలంక జాతీయ జెండాలను చేబూని బారికేడ్లను ధ్వంసం చేస్తూ ముందుకు పరుగులు తీశారు. అధ్యక్షుడు దిగిపోవాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
తమను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి రణరంగాన్ని తలపించింది జనాన్ని చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది జల ఫిరంగులు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఈ ఘటనలో కనీసం 45 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురు భద్రతా సిబ్బంది ఉన్నారు. క్షతగాత్రులను నేషనల్ హాస్పిటల్‌కు తరలించారు. అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయాన్ని నిరసనకారులు స్వా«ధీనం చేసుకున్నారు.
గోడలు ఎక్కి లోపలికి ప్రవేశించారు. ఆ ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. అక్కడున్న స్విమ్మింగ్ పూల్‌లో కొందరు ఈత కొట్టి సేద తీరడం గమనార్హం. మరికొందరు లోపల వంటలు చేసుకొని, ఆరగిస్తున్న దృశ్యాలు కనిపించాయి. కొలంబోలో ప్రధానమంత్రి విక్రమసింఘే ప్రైవేట్ నివాసాన్ని సైతం జనం చుట్టుముట్టారు. విధ్వంసం సృష్టించారు. నివాసానికి నిప్పుపెట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. రాజధాని కొలంబోకు రైళ్లను నడపాలని ఒత్తిడి చేస్తూ నిరసనకారులు గాల్లే, కాండీ, మతారా తదితర ప్రాంతాల్లో రైల్వే అధికారులతో ఘర్షణకు దిగారు.
అన్ని పార్టీలతో కూడిన కొత్త ప్రభుత్వం
ప్రెసిడెంట్ హౌస్‌ను నిరసనకారులు చుట్టుముట్టినట్లు సమాచారం అందుకున్న ప్రధాని విక్రమసింఘే వెంటనే అన్ని పార్టీలతో అత్యవసర భేటీ నిర్వహించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో స్పీకర్ మహిందా యాపా అబేయవర్దనే అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు గొటబయా రాజపక్స తప్పుకోవాలని, అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నాయకులు తేల్చిచెప్పారు.
కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా తక్షణమే రాజీనామా చేయండి అని విక్రమసింఘే, గొటబయాకు స్పీకర్ అబేయవర్దనే సూచించారు. తాత్కాలిక అధ్యక్షుడిని నియమించడానికి, కొత్త ప్రధాని నేతృత్వంలో మధ్యంతర అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏడు రోజుల్లోగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కొద్ది కాలంలోపే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన భేటీలో నిర్ణయించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని పార్టీలు అంగీకరించాక రాజీనామా చేస్తానంటూ ప్రధాని ప్రకటన విడుదల చేశారు.
గొటబయాకు సొంత పార్టీ ఎంపీల లేఖ
గొటబయా రాజపక్సకు చెందిన శ్రీలంక పొడుజనా పెరమునా పార్టీ ఎంపీలు ఆయనను ఉద్దేశించి ఓ లేఖ రాశారు. పదవి నుంచి తప్పుకోవాలని, అన్ని పార్టీలతో కూడిన కొత్త ప్రభుత్వాన్ని లేఖలో కోరారు. శుక్రవారం నుంచి శనివారం వరకు కొలంబోలో కర్ఫ్యూ విధించాలని పోలీసులు తొలుత నిర్ణయించారు. పలు పార్టీలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గారు.
గొటబయా ఎక్కడున్నారు?
నిరసనకారుల ముట్టడిని ముందే గ్రహించిన అధ్యక్షుడు గొటబయా శుక్రవారమే శ్రీలంక నావికాదళానికి చెందిన నౌకలో సురక్షిత ప్రాంతానికి చేరుకున్నట్లు ఓ వార్తా చానల్ ప్రకటించింది. కొలంబో పోర్టు నుంచి రెండు నౌకల్లో లగేజీతో సహా కొందరు ప్రముఖులు వెళ్లిపోయినట్లు హార్బర్ మాస్టర్ చెప్పారు. వారు ఎవరన్నది తాను బయటపెట్టలేనని అన్నారు. అలాగే వీఐపీ వాహన శ్రేణి కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. గొటబయా ప్రస్తుతం అండర్‌గ్రౌండ్‌లో తలదాచుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.
(చదవండి: షింజో అబే మృతి.. అమెరికా అధ్యక్షుడి ప్రగాఢ సంతాపం, భావోద్వేగ నోట్)