గిల్గిత్ బాల్టిస్తాన్‌పై పాక్ పన్నాగం
నక్కజిత్తుల మారి పాకిస్తాన్ మరోసారి భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతోంది. గిల్గిత్ బాల్టిస్తాన్‌ను ప్రావిన్స్‌గా మార్చి ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఆ ప్రాంత ప్రజలు పాక్ పాలన మాకొద్దు మొర్రో అన్నా వినిపించుకోవడం లేదు. చైనా అండదండలతో రెచ్చిపోతూ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి కొత్త ఎత్తులు వేస్తోంది. భారత్ సార్వభౌమత్వానికే సవాల్ విసురుతోంది. దీంతో ఏడు దశాబ్దాల నాటి వివాదం మళ్లీ రాజుకుంది.
చుట్టూ పచ్చని కొండలు, గలగల పారే సెలయేళ్ల మధ్య ఉన్న అందాల లోయ గిల్గిత్ బాల్టిస్తాన్. హాలీవుడ్ థ్రిల్లర్ వెర్టికల్ లిమిట్ వంటి సినిమా షూటింగ్‌లు జరిగిన భూతల స్వర్గం లాంటి ప్రాంతం. జమ్మూకశ్మీర్‌లో అంతర్భాగం. కానీ 1947 దేశ విభజన సమయంలో పాకిస్తాన్ ఆక్రమించిన 78,114 చదరపు కిలోమీటర్ల కశ్మీరంలో ఉత్తరాన ఈ భూభాగం ఉంది.
వివాదాస్పదమైన ఈ ప్రాంతాన్ని ఇన్నాళ్లూ పాకిస్తాన్ పాలనాపరమైన అవసరాల కోసం వాడుకుంది. ఇప్పుడు ఏకంగా ఆ ప్రాంతాన్ని సంపూర్ణ ప్రావిన్స్‌గా మార్చి (పూర్తి స్థాయి రాష్ట్ర హోదా) నవంబర్ 15న ఎన్నికల్ని నిర్వహించడానికి సిద్ధమవు తోంది. సిం«ధ్, పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫంక్తున్వా తర్వాత అయిదో ప్రావిన్స్‌గా గిల్గిత్ బాల్టిస్తాన్‌ను ప్రకటించడం కోసం త్వరలోనే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఆ ప్రాంతంలో పర్యటించనున్నారు.
భారత్‌పై ఆధిపత్యం కోసం ఆ ప్రాంత ప్రజల మనోభావాలను కూడా లెక్కచేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఇలా చేయడంవల్ల పాక్‌కి లాభం కూడా లేదు. భారత్‌తో తగాదాల కోసం చైనాతో చేతులు కలిపిన పాక్ అంతర్జాతీయ నిబంధనల్నీ తుంగలో తొక్కుతోంది. గత ఏడాది ఆగస్టులో జమ్మూకశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకు న్నాక గిల్గిత్ బాల్టిస్తాన్‌ను లద్దాఖ్‌లో అంతర్భాగంగా చూపిస్తూ మ్యాప్‌లు విడుదల చేసింది. అప్పట్నుంచి కడుపు మంటతో రగిలిపోతున్న పాక్ గిల్గిత్ బాల్టిస్తాన్‌ను దురాక్ర మణ చేయాలన్న దుస్సాహసానికి దిగుతోంది.
చైనా చెప్పు చేతల్లో...
చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) ఈ ప్రాంతం మీద నుంచే వెళుతుంది. ఓ రకంగా చెప్పాలంటే సీపీఈసీకి గేట్ వేలాంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించి రాజకీయంగా, చట్టపరంగా పాక్ పట్టు బిగిస్తే, చైనా ఈ ప్రాంతంలో బలపడడానికి అవకాశం వస్తుంది. వాస్తవాధీన రేఖ వెంబడి కర్కోరమ్ పాస్ చేరుకోవడానికి భారత్ నిర్మించిన డర్బక్–షయోక్–డీబీఓ రహదారికి గిల్గిత్ బాల్టి స్తాన్‌తో సంబంధం ఉంది. పాకిస్తాన్, గిల్గిత్ బాల్టిస్తాన్లకి చైనా చేరుకోవాలంటే కరకోరమ్ మార్గం అత్యంత కీలకం. అందుకే ఆ రహదారి నిర్మాణం పూర్తయిన దగ్గర్నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి ఘర్షణలకు తెరతీసిన చైనా ఇప్పడు పాక్ వెనకాలే ఉండి గిల్గిత్ కుంపటిని రాజేస్తోంది.
పీఓకే అంతా మాదే: భారత్
గిల్గిత్ బాల్టిస్తాన్‌ను ప్రావిన్స్‌గా మార్చి రాజకీయంగా పట్టు సాధించడానికి పాక్ చేస్తున్న కుయుక్తుల్ని ఎట్టి పరిస్థితిల్లోనూ సహించబోమని భారత్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపింది. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా పాక్ అడుగు ముందుకు వేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని విదేశాంగ శాఖ హెచ్చరికలు చేసింది. పీఓకేలోని ప్రతీ అంగుళం భూమి భారత్‌కే చెందుతుందని స్పష్టం చేసింది.
అదో బంగారు
గని గిల్గిత్ బాల్టిస్తాన్ అందాలు కనువిందు చేసే పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు అదొక ఖనిజాల గని. బంగారం, పచ్చలు వంటివి పుష్కలంగా లభించే ప్రాంతం. అయినప్పటికీ ఆ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. అనునిత్యం మిలటరీ ఉక్కు పాదాల కింద నలిగిపోతూ పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ది చెందలేకపోయింది. ప్రపంచంలోనే రెండవ ఎత్తయిన పర్వత శిఖరం కె–2 ఇక్కడే ఉంది. బౌద్ధ శిల్పాలకు నిలయం. జనాభా 12 లక్షల మంది వరకు ఉంటారు. షియా కమ్యూనిటీకి చెందినవారు ఎక్కువ.
చరిత్రలోకి చూస్తే..
గిల్గిత్ బాల్టిస్తాన్‌కి మొదట్నుంచి ఒక దశ, దిశ లేదు. పాక్ తాను ఆక్రమించుకున్న కశ్మీర్ నుంచి 1949లో ఈ ప్రాంతాన్ని వేరు చేసి పాలనాపరమైన అవసరాల కోసం వాడుకుంది. 1963 మార్చిలో ఈ ప్రాంతంలో 5,180 చదరపు కి.మీ భూభాగాన్ని చైనాకి ధారాదత్తం చేసింది.
2009లో మళ్లీ గిల్గిత్ బాల్టిస్తాన్‌కు స్వయంపాలనాధికారం కల్పించింది. అప్పట్లోనే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిబంధనల మేరకు కార్యనిర్వాహక తరహా ప్రభుత్వ ఏర్పాటు కావాలన్న డిమాండ్లు వినిపించాయి. కానీ పాక్ ఆ ప్రాంతంలో చైనా సహకారంతో భారీ ఎత్తున హైడల్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి దిగింది. ఆ నిర్మాణాలను స్థానికులు వ్యతిరేకించడంతో ఆ ప్రాంతంపై తన పట్టును వదలకుండా ఉంచుకుంది.