పీఓకేకు ప్రావిన్సు హోదా.. భారత్‌లో కలవరం
పీఓకేకు ప్రావిన్సు హోదా.. భారత్‌లో కలవరం
Published Thu, Mar 16 2017 9:37 AM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)కు పాకిస్తాన్ ప్రావిన్సు హోదాను ఇవ్వనుంది. పీఓకేను పాకిస్తాన్‌లో గిల్గిత్-బాల్టిస్ధాన్‌గా పిలుస్తారు. హోదాను కల్పిస్తే పాకిస్తాన్‌లో ఐదో ప్రావిన్సుగా అవతరిస్తుంది గిల్గిత్-బాల్టిస్ధాన్. ఈ మేరకు పాకిస్తాన్ మంత్రి రియాజ్ హుస్సేన్ జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో ప్రకటన చేశారు. పీఓకేను ప్రావిన్సుగా మార్చాలని కొద్ది రోజుల క్రితం విదేశాంగ శాఖ సలహాదారు సర్తాజ్ అజీజ్ సూచించినట్లు చెప్పారు.
చైనా-పాకిస్తాన్ స్నేహమే పీఓకేను ప్రత్యేక ప్రావిన్సుగా ప్రకటించడం వెనుక ఉన్న ప్రధాన కారణంగా తెలుస్తోంది. పాకిస్తాన్‌లో చైనా చేపట్టిన చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడర్(సీపీఈసీ) పీఓకే గుండా పోతుంది. భారత్-పాకిస్తాన్‌లకు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పీఓకేపై మనస్పర్దలు ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతంలో బిలియన్ల డాలర్లు కుమ్మరించడానికి చైనా సంశయించింది. దీంతో పెట్టుబడులు కావాలంటే ప్రత్యేక ప్రావిన్సుగా గిల్గిత్-బాల్టిస్ధాన్‌ను ప్రకటించాలని చైనా పాక్‌పై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది.
కాగా, పీఓకేను ప్రావిన్సుగా చేసేందుకు రాజ్యాంగ సవరణ కూడా చేస్తామని రియాజ్ హుస్సేన్ పేర్కొన్నారు. పాక్‌లో ప్రస్తుతం బలూచిస్ధాన్, ఖైబర్ ఫక్తూఖ్వా, పంజాబ్, సింధ్‌లు ప్రావిన్సులుగా ఉన్నాయి. భారత్ పాకిస్తాన్‌లు రెండుగా విడిపోవడానికి ముందు కశ్మీర్‌ను రాజా హరిసింగ్ పాలించేవారు. ఇరు దేశాలు స్వతంత్రం పొందిన తర్వాత కశ్మీర్ పాక్‌లో అంతర్భాగమేనని ఆ దేశం అంటుండటంతో కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తున్నట్లు అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూతో ఒప్పందంపై సంతకం చేశారు.
దీంతో కశ్మీర్‌లోకి దూసుకువచ్చిన పాక్ సైన్యాలు వాయువ్య కశ్మీర్‌ను ఆక్రమించాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధవాతావరణ పరిస్ధితిని సరిదిద్దాలంటూ నెహ్రూ ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించారు. కశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ప్రజల నిర్ణయం మేరకు నడుచుకోవాలని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కాకుండా మిగిలిన ప్రాంతంలో ప్రజలు తాము భారత్‌లోనే ఉంటామంటూ ఓటు వేశారు. కాగా, ఉద్దేశపూర్వకంగా స్వలాభం కోసం సమస్యాత్మక ప్రాంతంగా ఉన్న భాగాన్ని ప్రత్యేక ప్రావిన్సుగా మార్చడం భారత్‌కు కలవరం కలిగించే అంశమే.
మరోవైపు పాకిస్తాన్‌లో చైనా నిర్మిస్తున్న సీపీఈసీని వ్యతిరేకిస్తున్నట్లు బుధవారం పార్లమెంటులో కేంద్ర రక్షణ శాఖ ఓ రిపోర్టును దాఖలు చేసింది. భారత్‌లో ఉగ్రదాడులకు పాకిస్తాన్ ప్రేరేపిస్తుందని పునరుద్ఘాటించింది. భారతదేశ సార్వభౌమత్వాన్ని సీపీఈసీ ప్రశ్నిస్తుందని పేర్కొంది. అయితే, గతేడాది హంగ్జౌలో జరిగిన జీ-20 దేశాల సమావేశంలో సీపీఈసీకి సంబంధించిన అంశాలను చైనా అధ్యక్షునితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చించారు. ఇరుదేశాలకు ఉన్న సెన్సిటివ్ అంశాలతో ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు.
కానీ ఆ సమావేశం తర్వాత చైనా చర్యలు భారత్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉన్నాయి. పాకిస్తాన్ తన మిత్ర దేశమని దాన్ని కూడా అణు శక్తి సరఫరా బృందంలోకి చేర్చుకోవాలని తాజాగా చైనా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Advertisement