పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా సీపీఈసీ వెళ్తున్న మార్గం
బీజింగ్ : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) గుండా వెళ్తున్న చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్(సీపీఈసీ) ప్రాజెక్టుపై భారత్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సోమవారం చైనా ప్రకటించింది. సీపీఈసీపై భారత్‌కు అభ్యంతరాలు ఉన్నాయని చైనాలోని భారత రాయబారి గౌతమ్ బాంబవాలే చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు.
గౌతమ్ వ్యాఖ్యలపై స్పందించిన చైనా సీపీఈసీపై భారత్‌కు ఉన్న అభ్యంతరాలపై చర్చించేందుకు సిద్ధమని ప్రకటించింది. సీపీఈసీ వల్ల ఇరుదేశాల మధ్య విభేదాలు తలెత్తడం ఇష్టంలేదని చెప్పింది. ఇరు దేశాల జాతీయ ప్రయోజనాలు సీపీఈసీ కారణంగా ప్రభావితం అవకుండా ముందే చర్చలు జరపడం మేలని తెలిపింది.
సీపీఈసీ కేవలం ఓ ఆర్థిక సహకార ప్రాజెక్టు అని పేర్కొంది. ఎవరినో లక్ష్యంగా చేసుకుని తాము ఈ ప్రాజెక్టును ప్రారంభించలేదని చెప్పింది. భారత్ దీన్ని దృష్టిలో పెట్టుకుని చర్చలకు వస్తే.. బలమైన సంబంధాలకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కాగా, 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ప్రారంభిస్తున్న సీపీఈసీ ప్రాజెక్టు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) గుండా వెళ్లడాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది.
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో గల గ్వాదర్ పోర్టు నుంచి చైనాలోని గ్జిన్‌జియాంగ్ ప్రావిన్సును సీపీఈసీ ప్రాజెక్టు కలుపుతుంది.
Comments
Please login to add a commentAdd a comment