ఇస్లామాబాద్ : గ్వాదర్ ఓడరేవు వద్ద చైనా ఎటువంటి మిలటరీ బేస్‌ను నిర్మించడం లేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఇటువంటి ఈ ప్రచారంపై పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్వాదర్ పోర్టు దగ్గర చైనా ఎటువంటి నిర్మాణాలు చేపట్టడం లేదు.. ప్రస్తుతం జరుగుతున్నవి చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ నిర్మాణ పనులు మాత్రమేనని ఆ దేశ అధికార ప్రతినిధి ముహమ్మద్ ఫైజల్ పేర్కొన్నారు. సీపీఈసీ ప్రాజెక్ట్‌తో బలపడుతున్న చైనా-పాకిస్తాన్ దౌత్య సంబంధాలను దెబ్బతీసేలా పొరుగుదేశాలు కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ఇదిలావుండగా.. భారత్ ఈ మధ్య ఇంటర్‌స్పెక్టర్ మిస్సైల్‌ను పరీక్షించడంపై ఆయన స్పందించారు. తమ దగ్గర శక్తివంతమైన యాంటి బాలిస్టిక్ మిస్సైల్ సిస్టమ్ ఉందని.. పొరుగు దేశం తమను తక్కువ అంచనా వేస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని ఆయన చెప్పారు. ఉపఖండంలో భారత్ ఆయుధ పోటీకి కేంద్రంగా మారిందని.. ఇది ఎవరికీ మంచిది కాదని అన్నారు. ఉపఖండంలో శాంతిని పెంపొందించే క్రమంలో క్షిపణులు, అణ్వాయుధ పరీక్షలను కొంత కాలం నిలిపివేయాలని ప్రతిపాదించామని ఫైజల్ తెలిపారు. పాకిస్తాన్ ప్రతిపాదనలను భారత్ తోసిపుచ్చి మరీ ఆయుధ పరీక్షలు నిర్వహిస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment