పూరా నిర్లక్ష్యం
సాక్షి, హన్మకొండ : పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన పుర (ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఎమినిటీస్ ఇన్ రూరల్ ఏరియా) పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది. రూ.168 కోట్లతో చేపట్టే ఈ పథకాన్ని మొదటగా అమలు చేసేందుకు 2011లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పర్వతగిరి మండలాన్ని ఎంపిక చేసింది. కానీ, మూడేళ్లు దాటినా పనులు ప్రారంభం కాలేదు. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకానికి నిధులు కేటాయింపుపై ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు.
ఈ పథకానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూపకల్పన చేసింది. వీటిలో కేంద్ర ప్రభుత్వం వాటా 73 శాతం అంటే రూ.123.34కోట్లు, రాష్ర్ట ప్రభుత్వం వాటా 15 శాతం అంటే రూ.25.80 కోట్లతో పాటు భాగస్వామ్య సంస్థల వాటా 11 శాతం అంటే రూ.19.38కోట్లగా నిర్ణరుుంచారు. ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయడం ద్వారా గ్రామాలు పట్టణాల తరహాలో స్వయం పోషకాలుగా అభివృద్ధి చెందడంతో పాటు అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాల్సి ఉంటుంది.
అక్కడ పూర్తి.. ఇక్కడ మొదలుకాలేదు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరంగల్, కృష్ణా జిల్లాలను మొదటిదశలో ఎంపిక చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో ప్రాజెక్టు ప్రారంభానికి అప్పటి ప్రభుత్వం చొరవ చూపించడంతో యూపీఏ-2 హయూంలోనే ఈ పథకం కృష్ణా జిల్లాలో విజయవంతంగా పూర్తయింది. అప్పటి పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణకు మంజూరైన ప్రాజెక్టు నేటికీ కార్యరూపం దాల్చలేదు. మూడేళ్ల క్రితం మంజూరైన ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర వాటాగా రూ.8.34 కోట్ల నిధులు 2014 జనవరిలో విడుదల చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేందుకు ఒకరోజు ముందు ఈ పథకాన్ని అప్పటి ఎంపీ సిరిసిల్ల రాజయ్య హడావుడిగా ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పథకం దారితెన్నూ లేకుండా నిలిచిపోయింది. అటు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం గద్దెదిగి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. దానితో యూపీఏ హయూంలో ప్రారంభించిన ఈ పథకానికి నిధులు కేటాయిస్తారా ? లేదా అనే సందిగ్ధం నెలకొంది. పైగా మూడేళ్ల కిందటి అంచనాలతో పోల్చితే ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం 30 శాతం పెరిగే అవకాశం ఉంది. ఇందుకు కేంద్రం ఒప్పుకుంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది.