పిట్టల్లా రాలిపోతున్న గొర్రెలు
ఒకే గ్రామంలో ఇప్పటికే 500 గొర్రెలు మృత్యువాత
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పీటీఆర్ మందులు
కాళ్లరిగేలా తిరిగినా వాటికీ గతిలేదు
ప్రైవేట్‌లో మందులు అందుబాటులో లేక ఇక్కట్లు
ఆందోళనలో గొల్లకురుమలు
దుబ్బాక: పిల్లల నుంచి చేతికొచ్చే వరకు పోషించిన గొర్రెలు కళ్లెదుటే ఒక్కొక్కటి రాలిపోతుండడంతో గొల్ల, కురుమల్లో ఆందోళన నెలకొంది. వాటికొచ్చిన వ్యాధిని నయం చేసుకుందామంటే మార్కెట్లో మందు బిల్ల దొరకడం లేదు. దిక్కు తోచక కాపరులు దేవుడిపై భారం వేసి బతుకీడుస్తున్నారు. పశువుల డాక్టర్లు చేతులెత్తేయడంతో గొల్ల కురుమలకు కంటిమీద కనుకు లేకుండా పోతోంది.
దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లిలో 90 కుటుంబాలు గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రతి ఇంట్లో 100 నుంచి 200 వందల జీవాలను పోషిస్తారు. పెరిగి పెద్దగయ్యే వరకు పోషించి విక్రయించగా వచ్చిన డబ్బులతోనే కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. గొర్రెల మూతి చుట్టూ ఎర్రటి మచ్చలు, నాలుక రంగు మారడం, లో జ్వరంతో బాధపడుతుండడమే సొరపు వ్యాధి ముఖ్య లక్షణం. గొర్రెలకు సొరపు వ్యాధి సోకడంతో గ్రామంలో 500 గొర్రెలకు ఇప్పటికే మృత్యువాత పడ్డాయి.
గ్రామానికి చెందిన పెద్దొళ్ల బాలమల్లు-40, బైతి చంద్రయ్య-15, బట్టు మల్లయ్య-25, బీర్ల మల్లయ్య-24, ఏల్పుల తిరుపతి-18, కోర్ల ఎల్లయ్య-13, గూడూరి నాగయ్య-20, దయ్యాల ఎల్లయ్య-8, దయ్యాల మల్లయ్య-24, చిట్టపురం దుర్గయ్య-18 మేకలు, కంతుల మల్లయ్య-14, ఏల్పుల ఎల్లయ్య-6, బీర్ల రాజయ్య-14, గూడూరి నాంపల్లి-16, గూడూరి యాదయ్య-14, బీర్ల వీరమల్లు-40, దయ్యాల బాలమల్లుకు చెందిన 40 గొర్రెలు మరణించాయి. మరో 600 గొర్రెలు చావుకు దగ్గర్లో ఉన్నాయి.
సొరపు వ్యాధి నివారణకు వాడే పీటీఆర్ మందులు ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రుల్లోనే లభిస్తాయి. ప్రైవేట్ మందుల దుకాణాల్లో అసలే దొరకవు. మందుల కోసం 3 నెలల నుంచి ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ గొల్ల కురుమలు చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేదు. తమ వద్ద స్టాక్ లేదని డాక్టర్లు పంపిస్తున్నారని గొర్రె, మేకల పెంపకందారులు వాపోతున్నారు. చేతికందివచ్చిన గొర్రెలు కళ్లెదుటే మరణిస్తుండడంతో వేలకు వేలు నష్టపోతున్నారు.
ఈ వ్యాధి విషయాన్ని జెడ్పీటీసీ ఏల్పుల గౌతమి సమక్షంలో గొర్రెలకాపరులు రాష్ర్ట శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో ఫోన్లో మాట్లాడి గొర్రెలకు వచ్చిన వ్యాధి, కావాల్సిన మందులను పంపించాలని కోరారు.
సొరపు వ్యాధిపై మంత్రి దృష్టికి..
పెద్దగుండవెళ్లి గ్రామంలోని గొర్రెలకు వచ్చిన సొరపు వ్యాధి నివారణకు మందులు కావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశా. మంత్రి సానుకూలంగా స్పందించారు. రెండు, మూడు రోజుల్లో నివారణ మందులు అందుబాటులోకి రానున్నాయి. గొర్రెల వృత్తిదారులెవ్వరూ ఆందోళన చెందొద్దు. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం. - ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి
మందులు ఇవ్వడం లేదు
గొర్రెల పెంపకంపైనే ఆధారపడి జీవిస్తున్నా. సొరపు వ్యాధితో 40 గొర్రెలు చనిపోయాయి. వ్యాధి నివారణ మందుల కోసం ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా ఒక్క మందు బిల్ల ఇవ్వడం లేదు. ఆసుపత్రిలో స్టాక్ లేదని తిప్పి పంపుతున్నరు. సొరపు వ్యాధితో నష్టపోతున్న మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. - గూడూరి చంద్రయ్య, గొర్రెల కాపరి, పెద్దగుండవెళ్లి
ప్రభుత్వం ఆదుకోవాలి
సొరపు వ్యాధితో వందలాది గొర్రెలు చస్తానయ్. నేను పెంచుతున్నవాటిలో 40 గొర్రెలు ఇప్పటికే మరణించాయి. మరిన్ని చనిపోవడానికి సిద్ధంగా ఉన్నయి. వ్యాధి నివారణకు మందులు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. డాక్టర్లు సకాలంలో స్పందించాలి. గొర్రె కాపరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. - బీర్ల వీరమల్లు, గెర్రెల కాపరి, పెద్దగుండవెళ్లి