PSA Group
-
వచ్చే ఏడాదిలో సిట్రోయెన్ ‘సీ5 ఎయిర్‌క్రాస్’..!
న్యూఢిల్లీ: యూరోపియన్ ఆటో దిగ్గజం గ్రూప్ పీఎస్ఏ.. వచ్చే ఏడాదిలో తన సిట్రోయెన్ బ్రాండ్ కార్లను ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా తొలుత ‘సీ5 ఎయిర్‌క్రాస్’ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్యూవీ)ని విడుదలచేయనున్నట్లు వెల్లడించింది. కంపెనీ ప్రణాళిక ప్రకారం.. ఈ ఏడాదే ఎస్యూవీ విడుదల కావాల్సి ఉన్నా, తొలికారు విషయంలో రాజీలేకుండా ఉండటానికే మరింత సమయం తీసుకున్నట్లు సంస్థ భారత సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ రోలాండ్ బౌచారా అన్నారు. -
సిట్రోన్ కార్లతో పీఎస్ఏ గ్రూప్ రీఎంట్రీ
న్యూఢిల్లీ: యూరోపియన్ ఆటోమొబైల్ దిగ్గజం పీఎస్ఏ గ్రూప్ తాజాగా భారత మార్కెట్లో రీఎంట్రీ కోసం సిట్రోన్ బ్రాండ్ కార్లను ఎంచుకుంది. 2021 ఆఖరుకి తొలి మోడల్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 2018–19 ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా పీఎస్ఏ గ్రూప్ చైర్మన్ కార్లోస్ టెవారెస్ ఈ విషయాలు తెలిపారు. ‘ సిట్రోన్ బ్రాండ్ ద్వారా భారత మార్కెట్లో మళ్లీ ప్రవేశించాలని నిర్ణయించాం. ఇందుకోసం ఇప్పటికే పెట్టుబడులు కూడా పెట్టాం. భారత్‌లో తయారీ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఒక పవర్ ట్రెయిన్ ప్లాంటు, వాహనాల తయారీ ప్లాంటు ఉంది. ఒక సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. కొత్త బ్రాండ్‌ను ప్రవేశపెట్టేందుకు అవసరమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంటున్నాం‘ అని ఆయన తెలిపారు. భారత మార్కెట్లో సీకే బిర్లా గ్రూప్‌తో పీఎస్ఏ గ్రూప్ 2017లో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. తమిళనాడులో వాహన, పవర్‌ట్రెయిన్ తయారీ ప్లాంట్ల ఏర్పాటు కోసం 100 మిలియన్ యూరోలు కేటాయించింది. పీఎస్ఏ గ్రూప్ అంతర్జాతీయంగా ప్యుజో, సిట్రోన్, డీఎస్ అనే మూడు బ్రాండ్స్ కింద వాహనాలు విక్రయిస్తోంది. గతంలో భారత్‌లో ప్రీమియర్ సంస్థతో ఒప్పందం ద్వారా కార్లను విక్రయించింది. కానీ 2001లో జాయింట్ వెంచర్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత పలు దఫాలుగా మళ్లీ భారత మార్కెట్లోకి ప్రవేశించే ప్రయత్నాలు చేసినా సాధ్యపడలేదు. 2011లో మధ్య స్థాయి సెడాన్ కారుతో రీఎంట్రీ ఇవ్వాలని భావించినప్పటికీ కుదరలేదు. -
భారత మార్కెట్లోకి పీఎస్ఏ గ్రూప్ మళ్లీ ఎంట్రీ
న్యూఢిల్లీ: యూరప్‌నకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం పీఎస్‌ఏగ్రూప్ మరోసారి భారత మార్కెట్లో ప్రవేశించింది. ఈసారి సీకే బిర్లా గ్రూప్‌తో చేతులు కలిపింది. తమిళనాడులో వాహనాలు, పవర్‌ట్రెయిన్స్ తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం పీఎస్ఏ గ్రూప్ ప్రాథమికంగా వంద మిలియన్ యూరోలు (దాదాపు రూ. 700 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఇందుకోసం రెండు ఒప్పందాలు కుదుర్చుకుంది. మొదటిదాని ప్రకారం.. తమ ప్యాసింజర్ వాహనాల అసెంబ్లింగ్, పంపిణీ కోసం హిందుస్తాన్ మోటార్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌ఎంఎఫ్‌సీఎల్)తో పీఎస్ఏ గ్రూప్ జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేయనుంది. దీనిలో పీఎస్ఏ గ్రూప్‌నకు మెజారిటీ వాటాలు ఉంటాయి. ప్రాథమికంగా ఏటా 1,00,000 వాహనాల తయారీ సామర్ధ్యంతో ప్లాంటు ఏర్పాటు కానుంది. ఇక పవర్‌ట్రెయిన్స్ తయారీ, సరఫరా కోసం చెరి యాభై శాతం వాటాలతో ఏవీటీఈసీతో మరో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు రెండో ఒప్పందం కుదుర్చుకుంది. దేశీ, విదేశ వాహన తయారీ సంస్థల అవసరాలకు అనుగుణంగా పవర్‌ట్రెయిన్స్ ఉత్పత్తి ఉండగలదని పీఎస్ఏ గ్రూప్ చైర్మన్ కార్లోస్ టవరెస్ తెలిపారు.