అమ్మాయిల ధర్మాగ్రహం
ప్రగతినగర్: ‘‘అమ్మాయిలూ అధైర్య పడవద్దు.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి’’ అని అదనపు జాయింట్ కలెక్టర్ పి.శేషాద్రి విద్యార్థినులకు సూచించారు. ఆధునిక సమాజంలోనూ మహిళలపై ఆరాచాకాలు కొనసాగడం దారుణమన్నారు. నగరంలోని యాదగిరిబాగ్‌లో శనివారం తెల్లవారుజామున భార్యను అతి కిరాతకంగా హత్యచేసి ఆనందంతో తాండవమాడిన కిరాతకుడిని ఉరి తీయాలంటూ వివిధ కళాశాలలకు చెందిన విద్యార్ధినులు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు.
అక్కడే బైఠాయించారు. అంతకుముందు నగరంలోని కంఠేశ్వర్ మైదానం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కోర్టు సమీపంలోనే వీరిని పోలీసులు నిలువరించడంతో, కలెక్టర్ బయటకురావాలని నినాదాలు చేశారు. అదనపు జేసీ శేషాద్రి, డీఆర్ఓ మనోహర్, ఐసీడిఎస్ పీడీ రాములు బయటకు వచ్చి విద్యార్థినులను సముదాయించారు.
యాదగిరిబాగ్‌లో జరిగిన ఘటనకు చింతిస్తున్నామని, నిందితుడిని కఠినంగా శిక్షించమని ఎస్పీని కో రామన్నారు. విద్యార్థినులు తమను తాము రక్షించుకునేలా శిక్షణ పొందాల న్నారు. మహిళలపై దాడులను నివారించేందుకు అవగాహన సదస్సులు ఏర్పా టు చేస్తామన్నారు. అన్ని కళాశాలలు, పాఠశాలలలో మహిళల రక్షణ పట్ల అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి, లెక్చరర్లు వసుంధర తదితరులు పాల్గొన్నారు.