నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ 24
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) సతీష్ ధావన్స్పేస్ సెంటర్ (షార్)లో మొదటి ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం సాయంత్రం 5.14 గంటలకు పీఎస్ఎల్వీ సీ24 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. బుధవారం ఉదయం ప్రారంభమైన కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. బుధవారం రాత్రి ఆర్మింగ్ ఆపరేషన్ ప్రక్రియ నిర్వహించారు. గురువారం రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రకియను చేపట్టారు. శుక్రవారం నైట్రోజన్, హీలియం గ్యాస్‌లు నింపడం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తారు. పీఎస్ఎల్వీ సీ24 ఉపగ్రహ వాహకనౌక ద్వారా 1432 కిలోల ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం-1బీ (ఐఆర్ఎన్ఎస్ఎస్ 1బీ)ను 20.25 నిమిషాల్లో 284 కి.మి. పెరిజీ (భూమికి దగ్గరగా), 20,652 కి.మి. అపోజి (భూమికి దూరంగా) భూమధ్య రేఖాతలానికి 19.2 డిగ్రీల వాలులో దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఉపగ్రహం కక్ష్యలోకి చేరిన తరువాత బెంగళూరు సమీపంలోని హసన్‌లో ఉన్న ఉపగ్రహా నియంత్రణ కేంద్రం నుంచి కక్ష్య దూరాన్ని పెంచే కార్యక్రమాన్ని చేపడతారు.
ఉపగ్రహంలో ద్రవ ఇంజిన్ మోటారును ఐదుసార్లు మండించి కక్ష్య దూరాన్ని పెంచుతూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో 55 డిగ్రీల తూర్పుగా, భూమధ్య రేఖాతలానికి 31 డిగ్రీల వాలుతో వృత్తాకార కక్ష్యలో ఉపగ్రహాన్ని స్థిరపరుస్తారు. 1.5 బ్యాండ్, ఎస్ బ్యాండ్ పౌనఃపున్యాలతో ఉపగ్రహం పనిచేస్తుంది. ఇందులో కచ్చితంగా పనిచేసే రుబీడియం అణుగడియారం కీలకమైంది. ఈ ఉపగ్రహంలో ఉండే సీ బ్యాండ్ ట్రాన్స్ఫాండర్ ఉపగ్రహ వ్యాప్తిని తెలియజేసేందుకు ఉపయోగపడుతుంది. ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏ ప్రయోగం తరువాత ఏడు నెలల కాలంలో ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీ ఉపగ్రహ ప్రయోగాన్ని చేస్తున్నారు.
చెంగాళమ్మ సేవలో ఇస్రో చైర్మన్: ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ గురువారం సాయంత్రం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ అధికారులకు, మీడియాకు సమాచారం ఇవ్వకుండా దర్శనం చేసుకుని వెళ్లారు. షార్‌లో ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియను ఆయన పరిశీలించి, శాస్త్రవేత్తలతో గురువారం రాత్రి సమీక్షించారు. శుక్రవారం ప్రయోగం వరకు ఆయన ఇక్కడే ఉంటారు.