మార్స్ మిషన్‌లో సెయిల్ ఉక్కు
హైదరాబాద్: అంగారక గ్రహానికి పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)లో తమ భాగస్వామ్యం కూడా ఉందని ఉక్కు దిగ్గజం సెయిల్ పేర్కొంది. అరుణ గ్రహానికి వెళ్లిన పీఎస్ఎల్వీకి సంబంధించి ఇంధనం, ఆక్సిడైజర్ ట్యాంకుల ఫ్యాబ్రికేషన్‌లో సెయిల్ ఉక్కును ఉపయోగించినట్లు వివరించింది. ఇందుకోసం సేలంలోని స్టీల్ ప్లాంటులో తయారైన ఉక్కును వినియోగించినట్లు సంస్థ చైర్మన్ సీఎస్ వర్మ తెలిపారు. ఇంధన, ఆక్సిడైజర్ల ప్రతిచర్యలను ఎదుర్కొని దీర్ఘకాలం పాటు ఎటువంటి లీకేజీలు లేకుండా ఇది మన్నుతుందని ఆయన వివరించారు. గతంలోనూ పలు పీఎస్ఎల్వీలకు స్టెయిన్లెస్ స్టీల్‌ను అందించినట్లు ఆయన వివరించారు.