బంజారాహిల్స్‌లో సూదిగాడి కలకలం
సిరంజితో చిన్నారిపై దాడి చేసిన సైకో సురేశ్
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో సూదిగాడు కలక లం రేపాడు. ఆదివారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారికి సిరంజి గుచ్చి పరారవుతుండగా స్థానికులు అప్రమత్తమై సూదిగాడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించా రు. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఇందిరానగర్ లో నివసించే పాండురంగారావు, శ్రావణి దంపతుల చిన్నారి గ్రేష్మ కావ్యశ్రీ ఇంటి ముందు ఆడుకుంటోంది. అదే సమయంలో ఓ యువకుడు చేతిలో సూది పట్టుకొని ఆడుకుంటున్న చిన్నారి తొడకు పొడిచి పారిపోయాడు.
దీంతో కావ్య కిందపడిపోయింది. పాప ఏడుపు విని లోపలి నుంచి తల్లి శ్రావ ణి, పాండురంగారావు బయటకు రాగా విషయం చెప్పింది. వెంటనే పారిపోతున్న యువకుడిని స్థాని కుల సహకారంతో పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించగా నిందితుడి పేరు జి. సురేశ్‌గా తేలింది. స్థానికంగా నలుగురు స్నేహితులతో కలసి అద్దెగదిలో నివసిస్తూ హిమాయత్‌నగర్‌లోని అవిదా మీడియా సొల్యూషన్స్‌లో ప్రోగ్రాం డెవలపర్‌గా పని చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
పోలీసులు సురేశ్ గదిలో తనిఖీలు చేయగా... ల్యాప్‌టాప్‌తోపాటు కొన్ని మందులు, సిరంజిలు లభించాయి. ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఘటనాస్థలానికి బస్తీ యావత్తు తరలి వచ్చి ఆందోళన నిర్వహించింది. పట్టపగలే సూదిగాడు చిన్నారిని సిరంజితో పొడిచి పరారు కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. నిందితుడిని విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. కాగా కావ్యకు నిలోఫర్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. పాప ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.