psychological expert
-
పుట్టగానే పిల్లలు ఏడవడం లేదా? ఈ సమస్య రావొచ్చు..కారణాలివే!
సుమంత్ చాలా చురుకైన పిల్లవాడు. వాడికి కొత్తా పాతా ఏమీ ఉండదు. ఎవరింటికెళ్లినా ఇల్లు పీకి పందిరేస్తాడు. కొడుకు చురుకుదనం చూసి, ఆనంద్, రేఖ మురిసిపోయేవారు. వాడేం చెప్పినా ఎదురుచెప్పేవారు కాదు. ఖరీదైన వస్తువులను పగలగొట్టినా చిన్నతనంలో అదంతా మామూలే అని సర్ది చెప్పుకునేవారు. కానీ సుమంత్‌ను స్కూల్లో చేర్పించాకే అసలు సమస్య మొదలైంది. అస్సలు కుదురుగా కూర్చోడని, కూర్చోనివ్వడని రోజూ కంప్లయింట్స్. బోర్డు మీద రాసింది రాసుకోడు, హోమ్‌వర్క్ పూర్తి చేయడు. ఎన్నిసార్లు చెప్పినా చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తుంటాడు. ఇంటికి ఎవరొచ్చినా పట్టించుకోకుండా తనిష్టమొచ్చినట్లు తానుంటాడంతే. వాడిని కుదురుగా పది నిమిషాలు కూర్చోపెట్టడం ఆనంద్, రేఖలకు తలకు మించిన పనిగా తయారైంది. సుమంత్ లాంటి పిల్లలు మనకు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటారు. చాలామంది పేరెంట్స్ ఆ సమస్యను పట్టించుకోరు లేదా వయసుతో పాటు అదే పోతుందని వదిలేస్తారు. కానీ అది అటెన్షన్–డెఫిషిట్/హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ADHD).. ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ప్రపంచవ్యాప్తంగా 7.2 శాతం పిల్లల్లో కనిపించే మానసిక రుగ్మత. ఇది పాఠశాల వయసులో ఎక్కువగా ఉంటుంది. టీనేజ్‌లో తగ్గుతుంది. వయోజనుల్లో తక్కువగా కనిపిస్తుంది. కారణాలు– పర్యవసానాలు ఏడీహెచ్‌డీ ఎందుకు వస్తుందనడానికి స్పష్టంగా కారణం చెప్పలేం. కొందరిలో జన్యు సంబంధమైన కారణాలుంటాయి. మరికొందరి మెదడు ఆకృతిలోనే తేడాలుంటాయి. తల్లి గర్భంతో ఉన్నప్పుడు మద్యం, ధూమపానం, అధిక రక్తపోటు, కాన్పు కష్టమవడం కూడా కారణం కావచ్చు. అలాగే పుట్టగానే ఏడవని పిల్లలు, మరేదైనా కారణాల వల్ల మెదడు దెబ్బతిన్న పిల్లలు కూడా ఇలా అవ్వొచ్చు. ఏ కారణమూ లేకుండా కూడా ఈ సమస్య ఉత్పన్నం కావొచ్చు. ఇలాంటి పిల్లలకు సకాలంలో చికిత్స అందించకపోతే పెద్దయ్యే కొద్దీ మొండిగా తయారవుతారు. పరీక్షల్లో తక్కువ మార్కులతో సరిపెట్టుకుంటారు. స్నేహితులతో తరచూ గొడవపడుతుంటారు. ఒక దగ్గర నిలకడగా ఉద్యోగం చేయలేరు. ఎప్పుడూ ఆత్మన్యూనత భావంతో ఉంటారు. మగ పిల్లలైతే సంఘవ్యతిరేక చర్యలు చేయడం, లేకపోతే తాగుడు లాంటి దురలవాట్ల పాలవుతారు. లక్షణాలు ఇలా ఉంటాయి.. ఏడీహెచ్డీలో ప్రధానంగా మూడు లక్షణాలుంటాయి. 1. చంచలత్వం (Inattention), 2. అతి చురుకుదనం (Hyperactive), 3. ఇంపల్సివ్. వీటిల్లో ఏదో ఒక లక్షణం ఉన్నంత మాత్రాన ఈ రుగ్మత ఉందనలేం. ఈ కింద చెప్పిన లక్షణాల్లో ఆరు అంతకుమించి లక్షణాలు ఆరునెలలకు మించి ఉన్నప్పుడు మాత్రమే ఈ రుగ్మత ఉందని చెప్పవచ్చు. చంచలత్వం (attention deficit) లక్షణాలు: వివరాలపై శ్రద్ధ చూపడంలో విఫలవమవడం లేదా అజాగ్రత్తగా తప్పులు చేయడం. టాస్క్స్ లేదా ఆటల్లో శ్రద్ధ వహించడంలో ఇబ్బంది ∙నేరుగా మాట్లాడినప్పుడు వినకపోవడం, పరధ్యానం సూచనలను అర్థం చేసుకోవడంలో, పాటించడంలో ఇబ్బంది ∙క్రమపద్ధతిలో, గడువులోపు పనులను పూర్తి చేయడంలో ఇబ్బంది ∙సమయ నిర్వహణలో ఇబ్బందులు అవసరమైన పనులను కూడా ఇష్టపడక పోవడం లేదా తరచుగా తప్పించుకోవడం పెన్సిళ్లు, పుస్తకాలు, ఇతర వస్తువులను తరచూ పోగొట్టు కోవడం ∙రోజువారీ కార్యకలాపాల్లో మతిమరపు హైపర్యాక్టివ్ అండ్ ఇంపల్సివ్ లక్షణాలు: ►తరచుగా చేతులు లేదా కాళ్లు కదిలిస్తూ ఉండటం ∙సీట్లో స్థిరంగా కూర్చోలేకపోవడం, సీటు వదిలేసి బయటకు వెళ్లడం. తరచుగా ఆడటం, నిశ్శబ్దంగా ఉండలేకపోవడం, ఎక్కువగా పరుగెత్తడం లేదా గెంతడం ► ప్రశ్న పూర్తయ్యేలోపు సమాధానాలు చెప్పడం, అతిగా మాట్లాడటం ∙తన వంతు వచ్చేవరకూ వేచి ఉండకుండా ఇతరులకు అంతరాయం కలిగించడం ∙తరచుగా ఇతరుల సంభాషణల్లోకి, పనుల్లోకి చొరబడటం ► ఇతరుల వస్తువులను అనుమతి లేకుండానే తీసుకోవడం, ఉపయోగించడం ఈ లక్షణాల్లో ఆరేడు కనిపించాయంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్‌ను కలసి సమగ్ర మూల్యాంకనం చేయించడం అవసరం. తల్లిదండ్రులు ఏం చేయాలి? ADHD లక్షణాలున్న పిల్లలను గైడ్ చేసేందుకు తల్లిదండ్రులకు ఓపిక అవసరం. పేరెంట్స్‌గా మీరేం చేయొచ్చంటే.. ♦మీరిచ్చే సూచనలు ఒక్కొక్కటిగా స్పష్టంగా, సరళంగా, నేరుగా ఉండాలి ∙పిల్లలు చదువుతున్నప్పుడు వాళ్ల ఏకాగ్రతకు భంగం కలిగించే అంశాలు లేకుండా చూసుకోండి ♦ వారిలోని శక్తి ఖర్చయ్యేందుకు నిత్యం వ్యాయామం చేసేలా ప్రోత్సహించండి ∙మీ పిల్లల సమస్యను అధిగమించడానికి తగిన వసతులు పాఠశాలలో ఉన్నాయో లేదో తెలుసుకోండి ∙ADHD ఉన్న పిల్లలను పెంచడం ఒక సవాల్. అందువల్ల ఆ అంశంపై మీ పరిజ్ఞానాన్ని పెంచుకోండి ∙సాధారణ చిట్కాలతో ADHD అదుపులోకి రాదు. అందుకు థెరపీ, మందులు అవసరమవుతాయి. ♦ పేరెంటింగ్ ట్రైనింగ్, బిహేవియర్ థెరపీ రోజువారీ పనితీరును మెరుగుపరచుకోవడానికి సహాయపడతాయి ∙సామాజిక నైపుణ్యాల శిక్షణ ఇతరులతో మరింత సమర్థంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడానికి సహాయపడుతుంది ∙మందులు మెదడులోని న్యూరోట్రాన్మ్సిటర్లు డోపమైన్, నోర్ ఎపినెఫ్రిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి, ఇవి అటెన్షన్ ను మెరుగుపరుస్తాయి. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com -
డ్రైవర్ బబ్లూకైనా.. అమెరికాలో డాక్టర్ కోమలికైనా! ఎందుకీ విపరీతారాధన?
బబ్లూ ఒక సినిమా హీరోకు వీరాభిమాని. ఎంత అంటే ఆధార్ కార్డ్‌లో తన పేరు కూడా మార్చేసుకునేంత! ఆ హీరో సినిమా రిలీజ్ అయ్యిందంటే వారం రోజులపాటు థియేటర్ల దగ్గరే ఉంటాడు. పూలదండలు, బ్యాండ్ మేళాలు, ఊరేగింపుల కోసం వేలకు వేలు ఖర్చు చేస్తాడు. తమ హీరోను ఎవరైనా ఏదైనా అంటే వాళ్లను కొట్టేస్తాడు. తమ హీరోను ఆన్లైన్లో ఎవరైనా ఏమైనా అంటే తన ఫేక్ ప్రొఫైల్ నుంచి వాళ్లను అసభ్యకరమైన రీతిలో ట్రోల్ చేస్తాడు. అలా ట్రోలింగ్‌కు గురైన వాళ్లలో ఒకరు సైబర్ క్రైమ్ కేసు పెట్టడంతో బబ్లూ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇంతా చేసి బబ్లూ చదివింది పదో తరగతి, చేసేది డ్రైవర్ ఉద్యోగం. ∙∙ కోమలి అమెరికాలో డాక్టర్. ఇండియాలో ఉన్నప్పుడు మామూలుగానే ఉన్నా అమెరికా వెళ్లాక భారతీయ సంస్కృతీ సంప్రదాయాలపై ఆసక్తి పెరిగింది. ఉదయం లేవగానే ప్రవచనాలు వింటుంది. ఆ ప్రవచనకారుడు ఏం చెప్తే అది తు.చ. తప్పకుండా పాటిస్తుంది. ఆయన చెప్పేదంతా చాదస్తమని కుటుంబ సభ్యులు చెప్పినా పట్టించుకోదు. మెడిసిన్ చదివి కూడా అంత అన్ సైంటిఫిక్ విషయాలను ఎందుకు పాటిస్తున్నావని కొలీగ్స్ ఎవరైనా అడిగితే.. ఆ ప్రవచనాల్లోని శాస్త్రీయత గురించి వివరించేందుకు ప్రయత్నిస్తుంది. అంతకుమించి ఏమైనా మాట్లాడితే వాళ్లతో గొడవ పడుతుంది, మాట్లాడటం మానేస్తుంది. సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ బబ్లూ, కోమలి.. ఇలా సినిమా హీరోలు, రాజకీయ నాయకులు, మత గురువులు, ప్రవచనకారులను అభిమానించేవారు మన చుట్టూ చాలామంది కనిపిస్తారు. అభిమానించడంలో తప్పులేదు. కానీ ఆ అభిమానం దురభిమానంగా, ఉన్మాదంగా మారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే.. సంబంధబాంధవ్యాలను దెబ్బతీస్తుంటే.. దాన్నే ‘సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్’ అంటారు. ఈ సిండ్రోమ్ ఉన్నవారికి తమ జీవితం కన్నా తాము అభిమానించే వారి జీవితం ముఖ్యం. తన కుటుంబ సభ్యులను పట్టించుకోకపోయినా తాము అభిమానించే హీరో, నేతలకోసం డబ్బు, సమయం, శక్తీ ఖర్చు పెడుతుంటారు. వారికోసం ఎంతటికైనా సిద్ధమవుతారు. ఇలాంటి వారిలో మానసిక ఆరోగ్యం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంటే వారికే తెలియని కొన్ని మానసిక సమస్యలు ఉంటాయన్నమాట. అసలెందుకు ఆరాధిస్తారు? కొందరు వ్యక్తులు కొన్నిరంగాల్లో ఏదో ఉన్నతిని సాధిస్తారు. మీడియా దాన్ని పదే పదే చూపిస్తుంది. వారి జీవితంలో జరిగే ప్రతి అంశాన్నీ గొప్పగా ప్రొజెక్ట్ చేస్తుంది. వారు చేసే ప్రతి పనినీ గొప్పగా ప్రచారం చేస్తుంది. దాన్ని చూసి అభిమానిస్తారు. అయితే కొందరిలో ఈ అభిమానం హద్దులు దాటుతుంది. తాము అభిమానించే వ్యక్తులను మనుషులుగా చూడటం మరిచిపోతారు. వారిని మహాత్ములుగా, మహిమానిత్వులుగా, సర్వశక్తి సంపన్నులుగా, దైవ స్వరూపులుగా చూడటం మొదలుపెడతారు. వారిలో తప్పులేమీ ఉండవన్నట్లుగా, వారు చేసేవన్నీ ఒప్పే అన్నట్లుగా విశ్వసిస్తారు. ఈ స్థితికి చేరాక తార్కికతకు తావుండదు. తర్కంతో సంబంధం లేకుండా వారు చేసే ప్రతి పనినీ సమర్థిస్తుంటారు. వాస్తవికతకు దూరం... సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ ఉన్న అభిమానులు వాస్తవికతకు దూరమవుతారు. తాము నమ్మిందే వాస్తవమనే భ్రమల్లో బతుకుతుంటారు తమ సెలబ్రిటీని విమర్శించిన వాళ్లపై విరుచుకు పడతారు. ఎలాంటి గొడవలకైనా సిద్ధపడతారు. కేసుల్లో ఇరుక్కుంటారు. తమను సెలబ్రిటీతో పోల్చుకుని వారిలా ఉండాలని ప్రయత్నిస్తారు. అలా లేనందుకు బాధపడుతుంటారు. బాడీ ఇమేజ్ సమస్యలుంటాయి. ఆలోచించే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. బాధ్యత లేకుండా ఫూలిష్‌గా ప్రవర్తిస్తుంటారు సెన్సేషన్ కోరుకుంటారు. ఇతరుల స్సేస్‌ను గుర్తించడంలో సమస్యలుంటాయి. బయటపడటం ఎలా? మీరు అభిమానించే సెలబ్రిటీలో ఏయే లక్షణాలు, ప్రవర్తనలు మీకు నచ్చాయో లిస్టు రాసుకోండి. అదంతా పబ్లిక్ బిహేవియర్ మాత్రమేనని, నిజం కావాల్సిన అవసరం లేదని గ్రహించండి ∙అతనంటే మీకెందుకు ఇష్టమో విశ్లేషించుకోండి. అతని పట్ల అభిమానం మీ జీవితాన్ని, బంధాలను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోండి. వారితో కలవగలిగితే, మాట్లాడగలిగితే మీరు అభిమానించడంలో తప్పులేదు. లేదంటే మీరు ఊహల లోకంలో ఉన్నారని తెలుసుకోండి మీ సెలబ్రిటీ గురించి తెలుసుకోవడం కోసం, వారి గురించి మాట్లాడుతూ రోజుకు ఎన్ని గంటలు వెచ్చిస్తున్నారో లెక్కేయండి. ఆ సమయాన్ని క్రమేపీ తగ్గించండి లేదా పూర్తిగా మానేయండి. ఆ సెలబ్రిటీకి భిన్నంగా వేరే అలవాట్లను, హాబీలను అలవాటు చేసుకోండి ∙ఎంత ప్రయత్నించినా మీరు ఆ వలయం నుంచి బయటపడటం సాధ్యం కాకపోతే సైకాలజిస్ట్‌ను, లేదా సైకియాట్రిస్టును కలవండి. -సైకాలజిస్ట్ విశేష్. -
అనుకరణ ఆమోదమేనా?!
ఉదయం నిద్ర కళ్లతోనే సోషల్ మీడియాను చూడటం ఈ రోజుల్లో సర్వసాధారణమైన పని. ‘ఎంత బాగుంది...’ అనుకునే ఫొటోలు మన కళ్ల ముందు కుప్పలు తెప్పలు. వాటిని చూసి ‘నేనెందుకిలా ఉన్నాను’ అనే నిరుత్సాహంతో తమ శరీరంతో పోలిక. తర్వాత ‘నేనూ అలా ఉంటే బాగుండు’ అనే ఆలోచన. ఆ మరు నిమిషం ‘ఎలాగైనా సరే, నేనూ అంత అందంగా, ఫిట్‌గా మారిపోవాలి’ అనే నిర్ణయం... ఒకదాని వెంట ఒకటి వచ్చేస్తుంటుంది. దీంతో ఏమవుతుంది!? తినే ఆహారంలో మార్పులు వచ్చేస్తాయి. చేసే వ్యాయామాల్లో మార్పులు. ప్రయత్నాలలో లోపం, సరిపడని ఆహారం.. అన్నీ ఒక్కోసారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రపంచవ్యాప్తంగా మహిళలు సోషల్ మీడియా లో ఫిట్‌నెస్‌కు సంబంధించిన క్లిక్‌లు, ఫిట్నెస్ సెంట్రిక్ ప్రొఫైల్స్‌ను తనిఖీ చేయడంలో ఈ రెండేళ్లలో విపరీతం గా పెంచినట్టు ప్రముఖ విశ్వవిద్యాలయాల మానసిక శాస్త్రవేత్తలు గుర్తించారు. సోషల్‌మీడియా కారణంగా ఫిట్నెస్ పట్ల ప్రభావితమైనవారు ఎలాంటి అనర్థాలకు లోనవుతున్నారో, వారి భవిష్యత్తు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో చెబుతూ అమెరికాలోని ఫ్లోరిడా మానసిక విశ్వవిద్యాలయం అధ్యయనం చేసి, కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. ఇతరులతో పోలికలు శరీరాకృతి అందంగా ఉండాలని న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌లో గట్టి నిర్ణయమే తీసుకుని ఉంటారు. అందుకు మీ చేతిలోని ఫోన్ యాప్‌లలో పోస్ట్ అయ్యే అందమైన శరీరాకృతి గల మహిళలు, వారు చేస్తున్న ఫిట్నెస్ చర్యల గురించి తెలుసుకోవడానికి తెగ తనిఖీ చేస్తుంటారు. ఈ విషయంపై నార్త్‌వెస్ట్రన్ విశ్వవిద్యాలయంలో బాడీ, మైండ్ ల్యాబ్‌ను నడుపుతున్న మనస్తత్వవేత్త రెనీ ఎంగెల్న్ –‘సాధారణంగా తమ చుట్టూ ఉన్న వ్యక్తులతో పోల్చుకునే స్వభావం మనిషిలో ఉంటుంది. గతంలో తక్కువ స్థాయిలో ఉన్న ఈ స్వభావం సోషల్ మీడియా వల్ల ఈ పోలికలు వేగంగా ఎన్నడూ లేనంత గా అవకాశాలను అందిస్తోంది’ అంటారామె. నిరుత్సాహానికి 7నిమిషాలు ఎంగెల్స్, ఇతర మనస్తత్వవేత్తలు వ్యక్తుల మెదడు వారి చర్యలపై సోషల్ మీడియా ప్రభావాన్ని వివరించడానికి 2020 నుంచి సామాజిక పోలిక సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేశారు. స్ఫూర్తిదాయకమైన హ్యాష్‌ట్యాగ్‌లను ట్రోల్ చేయడం లేదా తమ సొంత ఆరోగ్య ఆకాంక్షలకు కొంచెం మసాలాను జోడించడానికి ఫిట్నెస్ సెంట్రిక్ ప్రొఫైల్‌లను తనిఖీ చేయడం ఉత్సాహం కలిగిస్తుంది. అయితే, అవన్నీ తమ స్వీయ భావాన్ని దెబ్బతీస్తాయి. కాలేజీ అమ్మాయిలు కేవలం ఏడు నిమిషాలు ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చేయడం వల్ల వారిలో తమ శరీరం పట్ల అసంతృప్తిగా ఉన్నారని, ఫేస్‌బుక్‌ని ఉపయోగించిన దానికంటే ఎక్కువ బాడీ ఇమేజ్ పోలికలు, వారి రూపం గురించి ఎక్కువ ఆలోచించారని కనుక్కున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోతో కూడిన సెలబ్రిటీ హెవీ కంటెంట్ ఆ పోలికలను పెంచడానికి కారణమైందని గుర్తించారు. అసూయతో స్క్రోలింగ్ చేసే అసంతృప్తి కేవలం మొదటి దశ మాత్రమే. యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడాకు చెందిన మనస్తత్వవేత్త పమేలా ఎస్. కీల్ ఈ విషయంలో తినే రుగ్మతలు, శరీర ఇమేజ్ను ప్రభావితం చేసే సామాజిక అంశాలను పరిశోధించారు. 2020 అధ్యయనంలో కీల్, ఆమె సహోద్యోగులు ఎడిట్ చేసిన వారి ఫోటోలను పోస్ట్ చేసే వారి కంటే ఎక్కువగా తినే క్రమ రహిత ప్రవర్తనను ప్రదర్శించారని కనుక్కున్నారు. అన్ని రకాల డిజిటల్ వ్యూహాలు ఫొటోలను ఎడిట్ చేయడం అనే అంశాన్ని పార్టిసిపెంట్స్ ముందుకు తీసుకువచ్చారు. ఫోటోలను ఎడిట్ చేసిన పార్టిసిపెంట్స్ కి ఎలాంటి సూచన లూ చేయలేదు. వారు సోషల్ ‘మీడియాలో పోస్ట్ చేసేవి మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేయమని మాత్రమే వారికి చెప్పాం. దీంతో అన్ని ఫిల్టర్లు, ఫేస్‌టైమ్ వంటి అనేక ఇతర డిజిటల్‌పరంగా తారుమారు చేసే వ్యూహాలన్నీ ఉపయోగించినట్టు మా ముందుకు వచ్చిన ఫొటోలు చూపాయి. ఈటింగ్ డిజార్డర్ లక్షణాలను ఎవరూ పెద్దగా పేర్కొనలేదు. కానీ వారు తమను తాము ఇతరులతో పోల్చుకున్నారు. అంతేకాదు, తమ ప్రత్యర్థుల ఇష్టాలు, వ్యాఖ్యలపై ఎక్కువ సమయాన్ని ఖర్చు చేశారని నిరూపించారు. చెడు సమాచారం మీకు నప్పని, హాని కలిగించే సమాచారం నుంచి సోషల్ మీడియా మిమ్మల్ని రక్షించదు. నిర్ణయాల అమలు, ఆందోళన రేకెత్తిస్తూ మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశ ఉంది. ‘ఆరోగ్యకరమైన ఆహారం‘పై 1.2 మిలియన్ల కంటే ఎక్కువ ట్వీట్లను విశ్లేషించిన 2020 అధ్యయనం ఏం చెబుతుందంటే అలాంటి సమాచారం వెలిబుచ్చినవారిలో నిపుణులు ఎక్కువ మంది లేరని కనుక్కున్నారు. 8.5 శాతం కంటెంట్ తమకు తెలిసిన సమాచారాన్ని రీ పోస్ట్ చేయడం పైనే శ్రద్ధ చూపినట్టు తెలుస్తోంది. దీని కారణంగా ‘సులభం గా ప్రభావితమైన వ్యక్తులు‘ ఆహారం, ఆరోగ్యం గురించి రకరకాల ఉబుసుపోని కబుర్లు సృష్టిస్తారు. అంతేకాదు, వారికి నచ్చిన ఉత్పత్తులు, సేవలను అందించే వాణిజ్య సంస్థల ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తారు. ఇతరులనూ చేయమని ప్రేరేపిస్తారు. ‘అందుకని ఒక పోస్ట్ నాణ్యతను ఎలా అంచనా వేయాలో నేర్చుకోవడం చాలా ముఖ్యం’ అంటారు కీల్. అలాంటిదేదైనా గమనిస్తే ‘వాడద్దు’ అనే హెచ్చరికకు సంకేతం’ అని గుర్తించాలంటారు ఆమె. ఎందుకంటే, ఏ ఒక్కరికీ మిగతావారికి సరిపడే పోషకాలలో పోలిక ఉండదు. ఏం చేయాలంటే.. ‘మీరు మరొకరిని చూసి వారిలాగే అవాలనుకునే నిర్ణయాన్ని ఈ క్షణమే వదిలేయండి. ఒక వ్యక్తిగా ఎదగడం గురించి ఎదుటివారిని అనుసరించవచ్చు. ఆ విలువలు మనకు మార్గనిర్దేశం చేస్తాయి. కానీ, ఆహార– ఫిట్నెస్ తీర్మానాల్లో కాదు’ అంటారు కీల్. తోటివారు ఏం చేస్తున్నారో తెలుసుకోవడంలో తప్పులేదు. కానీ మీ కోసం ఓ మార్గాన్ని రూపొందించడానికి ఇతరులకు అవకాశం ఇవ్వద్దు. ఆచరించే నియమాలివి.. నిరుత్సాహపరిచే సోషల్ మీడియా కంటెంట్ నుండి దూరం అవ్వాలనుకుంటే ఎంగెల్న్, ఆమె సహచరులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ► మొదటి దశగా మిమ్మల్ని తమ శరీరాకృతితో పోలిక తెచ్చే సోషల్ మీడియా అకౌంట్లను తీసేయండి. దానికి బదులుగా మిమ్మల్ని ఉత్తేజిత పరిచే సమాచారాన్ని తీసుకోండి. మరొక సులువైన పరిష్కారం కూడా ఉంది. అలాంటి ఫొటోలను పదే పదే చూస్తున్నాం అనుకుంటే ఆ యాప్‌ను పూర్తిగా తొలగించండి. సోషల్ మీడియా నుండి విరామం మీ మానసిక ఆరోగ్యానికి మేలే చేస్తుంది. ► సోషల్ మీడియా వ్యక్తులు మీ సొంత లక్ష్యాలను ప్రభావితం చేయడానికి మీరు అనుమతిస్తే, మీరు ఓటమికి లేదంటే కనీసం నిరుత్సాహానికి లోనవుతారు. ► మీ శరీరాకృతిని మార్చడానికి సంబంధించిన ఇతరుల నిర్ణయాలు ఏ మాత్రం విలువైనవి కావు అనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. -
వైరస్ కంటే ఆందోళన వ్యాప్తి ఎక్కువైంది
సాక్షి, అమరావతి: ప్రపంచమంతటా కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి జరిగిందా.. లేదా అన్న దానిపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. నిపుణులు మాత్రం వైరస్ వ్యాప్తికంటే.. ఆందోళన మాత్రం సామాజిక వ్యాప్తి పక్కాగా జరిగిందని చెబుతున్నారు. ఇటీవలే అమెరికన్ సైకియాట్రిస్ట్ అసోసియేషన్ దీనిపై పరిశీలన జరిపింది. ఈ అసోసియేషన్‌తో పాటు బర్మింగ్‌హాం విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లూ పరిశోధన చేశారు. తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా కరోనా వైరస్ వ్యాప్తి కంటే.. ఆందోళన ఎక్కువ మందిలో కనిపిస్తోందని స్పష్టం చేశారు. ఇంతకీ వాళ్లు చెప్పిన విషయాలు ఏమిటంటే.. ► కరోనా సోకిన వారికంటే తమకూ సోకుతుందేమోనన్న అనుమానంతో ఎక్కువ మంది ఆందోళనకు గురవుతున్నారు. ► ఒక విధంగా ఈ ఆందోళన, భయం, స్ట్రెస్ వంటివి సామాజిక వ్యాప్తి జరిగినట్టు చెప్పుకోవచ్చు. ► అనవసర ఆందోళన కారణంగా ఆరోగ్యవంతులు కూడా వ్యాధి నిరోధక శక్తి కోల్పోతున్నారు. ► పాశ్చాత్య దేశాల కంటే ఆసియా దేశాల్లో ఇలాంటి ఆందోళన ఎక్కువ మందిలో కనిపిస్తోంది. ► యువకుల్లోనూ ఇలాంటి ఆందోళన ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. దీనికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ► ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉన్న వృద్ధులు కూడా వెంటనే కోలుకుంటున్నారు. ► యాంగ్జైటీ లేకపోతే రక్తంలో ఆక్సిజన్ నిల్వలు నిలకడగా ఉంటాయి. కరోనా వార్తలు వినకుండా మిగతా వ్యాపకాల్లో ఉండటమే దీనికి సరైన మందు. -
మానసిక బలమే విజయ రహస్యం!
మనిషి నిండు నూరేళ్ళ జీవితంలో యుక్తవయస్సు ఒక ముఖ్యమైన ‘జోన్’. ఈ జోన్లో ఉన్నప్పుడు, ఎదుర్కొంటున్న అనేక సమస్యలను అధిగమించి బయటకు రావడం, ఒక ‘ఛాలెంజ్’గా ఉంటుందంటాడు డా. జాన్ ఎడ్వర్డ్ అనే మానసిక నిపుణుడు. ఇలాంటి సంఘర్షణలో చాలామంది ఒకవైపు పెద్దవారు చెప్పే పద్ధతులనూ, మరోవైపు స్నేహితుల జీవనశైలినీ గమనిస్తూ... ఏ పద్ధతి ఆచరించాలో, ఎవరి మాట వినాలో తెలియక సందిగ్ధంలో పడి కొట్టుమిట్టాడుతుంటారు. ఏదైనా ఒక పని చెయ్యాలనుకున్నప్పుడు దాంట్లో ఉండే సాధకబాధకాలను లోతుగా ఆలోచించి చెయ్యాలి. కానీ, అలా చెయ్యాలనుకోకపోవడం, తీరా దానివల్ల వచ్చే రిస్కును ఎలా ఎదుర్కోవాలో తెలియక, సతమతమై పోవడం అన్నవి చాలామందిలో చూస్తుంటాం. అలానే కొందరు పెద్దలు తమ అభిరుచుల్ని పిల్లలపై రుద్దడానికి చూస్తారు. దీనివల్ల పిల్లలపై ఒత్తిడి ఎక్కువ అవుతుంటుంది. మరికొందరు టీనేజర్లు దుందుడుకుతనంతో ఎక్కువగా రిస్క్ తీసుకుంటూ ఉంటారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో సాహసాలు చేస్తుంటారు. అలానే మిత్రులతో కలిసి మద్యపానం, సిగరెట్లు కాల్చడం లాంటివి చేస్తూ, హీరోయిజమ్ ప్రదర్శిస్తుంటారు. ఇవన్నీ ఉడుకు రక్తంతో యువతరం తీసుకుంటున్న నిర్ణయాలు. ఈనాటి యువతరంలో కనబడే ఇంకొక ముఖ్యమైన మానసిక రుగ్మత - ‘యాంక్సైటీ న్యూరోసిస్’. దీనికి లోబడిన వారు ప్రతిదానికీ భయపడుతుంటారు. ఏమీలేక పోయినా ఏదో జరుగుతుందని ఊహించుకొని భయపడుతుంటారు. గుండెదడ, చెమటలు అధికంగా పట్టడం, ఏకాగ్రత కోల్పోవడం లాంటి లక్షణాలుంటాయి. ఫలితంగా మద్యం సేవించడం, డ్రగ్స్‌కు అలవాటు పడడం, ఆ మత్తులో జీవితాన్ని నాశనం చేసుకోవటం చూస్తున్నా. టీనేజ్‌లో ఉండే మరో ముఖ్య సమస్య ‘ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్’. దీంతో బాధపడుతున్నవారు ఎవరి మాట వినరు. తాము ఏం చేసినా అదే సరైనదని భావిస్తుంటారు. తల్లితండ్రుల మాట అసలు వినరు. వాళ్ళను ‘ఓల్డ్టైమర్సు’ అంటారు. మొండితనం, వాదనతో ఎదుటి వారిని కన్విన్సింగ్ చేయడానికి ప్రయత్నించి అలవాటుగా మార్చుకుంటారు. యువతలో వచ్చే మరో తీవ్రమైన మానసిక జబ్బు ‘మేనిక్ డిప్రెసివ్ సైకోసిస్’. ఈ జబ్బులో పడ్డవారిది మితిమీరిన ఆత్మవిశ్వాసం. అతి హుషారుగా, అధికంగా మాట్లాడుతుంటారు. అందరితో వాదించడం, అతి సంతోషం, అతికోపంతో ప్రవర్తించడం, డాబులు, గొప్పలు చెప్పడం, విపరీతంగా డబ్బు ఖర్చు చేయడం, అనవసరపు షాపింగులు చేయడం, ఆలోచించకుండా వ్యాపారాలు చేయడం, ఏదో సాధిద్దామని తలాతోకా లేని కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం, ప్రణాళిక లేకుండా అప్పులు చేయడం - ఇదంతా ‘మేనియా’ లక్షణాలుగా చెప్పవచ్చు. ఇదే సమయంలో కొందరు ఎంతటి సమస్యనైనా తెలివిగా పరిష్కరించుకొని జీవితంలో ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకొంటుంటారు. అందుకు వారి మానసిక ఆరోగ్యమే కారణం. -డా॥కల్యాణ్ చక్రవర్తి, న్యూరోసైకియాట్రిస్టు