అనుకరణ ఆమోదమేనా?! | Fitness Content and Community-Driven Communication as Social Media | Sakshi
Sakshi News home page

అనుకరణ ఆమోదమేనా?!

Published Sun, Jan 30 2022 6:22 AM | Last Updated on Sun, Jan 30 2022 6:22 AM

Fitness Content and Community-Driven Communication as Social Media - Sakshi

ఉదయం నిద్ర కళ్లతోనే సోషల్‌ మీడియాను చూడటం ఈ రోజుల్లో సర్వసాధారణమైన పని. ‘ఎంత బాగుంది...’ అనుకునే ఫొటోలు మన కళ్ల ముందు కుప్పలు తెప్పలు. వాటిని చూసి ‘నేనెందుకిలా ఉన్నాను’ అనే నిరుత్సాహంతో తమ శరీరంతో పోలిక. తర్వాత ‘నేనూ అలా ఉంటే బాగుండు’ అనే ఆలోచన. ఆ మరు నిమిషం ‘ఎలాగైనా సరే, నేనూ అంత అందంగా, ఫిట్‌గా మారిపోవాలి’ అనే నిర్ణయం... ఒకదాని వెంట ఒకటి వచ్చేస్తుంటుంది. దీంతో ఏమవుతుంది!?

తినే ఆహారంలో మార్పులు వచ్చేస్తాయి. చేసే వ్యాయామాల్లో మార్పులు. ప్రయత్నాలలో లోపం, సరిపడని ఆహారం.. అన్నీ ఒక్కోసారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రపంచవ్యాప్తంగా మహిళలు సోషల్‌ మీడియా లో ఫిట్‌నెస్‌కు సంబంధించిన క్లిక్‌లు, ఫిట్‌నెస్‌ సెంట్రిక్‌ ప్రొఫైల్స్‌ను తనిఖీ చేయడంలో ఈ రెండేళ్లలో విపరీతం గా పెంచినట్టు ప్రముఖ విశ్వవిద్యాలయాల మానసిక శాస్త్రవేత్తలు గుర్తించారు. సోషల్‌మీడియా కారణంగా ఫిట్‌నెస్‌ పట్ల ప్రభావితమైనవారు ఎలాంటి అనర్థాలకు లోనవుతున్నారో, వారి భవిష్యత్తు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో చెబుతూ అమెరికాలోని ఫ్లోరిడా మానసిక విశ్వవిద్యాలయం అధ్యయనం చేసి, కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు.

ఇతరులతో పోలికలు
శరీరాకృతి అందంగా ఉండాలని న్యూ ఇయర్‌ రిజల్యూషన్స్‌లో గట్టి నిర్ణయమే తీసుకుని ఉంటారు. అందుకు మీ చేతిలోని ఫోన్‌ యాప్‌లలో పోస్ట్‌ అయ్యే అందమైన శరీరాకృతి గల మహిళలు, వారు చేస్తున్న ఫిట్‌నెస్‌ చర్యల గురించి తెలుసుకోవడానికి తెగ తనిఖీ చేస్తుంటారు. ఈ విషయంపై నార్త్‌వెస్ట్రన్‌ విశ్వవిద్యాలయంలో బాడీ, మైండ్‌ ల్యాబ్‌ను నడుపుతున్న మనస్తత్వవేత్త రెనీ ఎంగెల్న్‌ –‘సాధారణంగా తమ చుట్టూ ఉన్న వ్యక్తులతో పోల్చుకునే స్వభావం మనిషిలో ఉంటుంది. గతంలో తక్కువ స్థాయిలో ఉన్న ఈ స్వభావం సోషల్‌ మీడియా వల్ల ఈ పోలికలు వేగంగా ఎన్నడూ లేనంత గా అవకాశాలను అందిస్తోంది’ అంటారామె.

నిరుత్సాహానికి 7నిమిషాలు
ఎంగెల్స్, ఇతర మనస్తత్వవేత్తలు వ్యక్తుల మెదడు వారి చర్యలపై సోషల్‌ మీడియా ప్రభావాన్ని వివరించడానికి 2020 నుంచి సామాజిక పోలిక సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేశారు. స్ఫూర్తిదాయకమైన హ్యాష్‌ట్యాగ్‌లను ట్రోల్‌ చేయడం లేదా తమ సొంత ఆరోగ్య ఆకాంక్షలకు కొంచెం మసాలాను జోడించడానికి ఫిట్‌నెస్‌ సెంట్రిక్‌ ప్రొఫైల్‌లను తనిఖీ చేయడం ఉత్సాహం కలిగిస్తుంది. అయితే, అవన్నీ తమ స్వీయ భావాన్ని దెబ్బతీస్తాయి. కాలేజీ అమ్మాయిలు కేవలం ఏడు నిమిషాలు ఇన్‌స్టాగ్రామ్‌ బ్రౌజ్‌ చేయడం వల్ల వారిలో తమ శరీరం పట్ల అసంతృప్తిగా ఉన్నారని, ఫేస్‌బుక్‌ని ఉపయోగించిన దానికంటే ఎక్కువ బాడీ ఇమేజ్‌ పోలికలు, వారి రూపం గురించి ఎక్కువ ఆలోచించారని కనుక్కున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోతో కూడిన సెలబ్రిటీ హెవీ కంటెంట్‌ ఆ పోలికలను పెంచడానికి కారణమైందని గుర్తించారు. అసూయతో స్క్రోలింగ్‌  చేసే అసంతృప్తి కేవలం మొదటి దశ మాత్రమే. యూనివర్శిటీ ఆఫ్‌ ఫ్లోరిడాకు చెందిన మనస్తత్వవేత్త పమేలా ఎస్‌. కీల్‌ ఈ విషయంలో తినే రుగ్మతలు, శరీర ఇమేజ్‌ను ప్రభావితం చేసే సామాజిక అంశాలను పరిశోధించారు. 2020 అధ్యయనంలో కీల్, ఆమె సహోద్యోగులు ఎడిట్‌ చేసిన వారి ఫోటోలను పోస్ట్‌ చేసే వారి కంటే ఎక్కువగా తినే క్రమ రహిత ప్రవర్తనను ప్రదర్శించారని కనుక్కున్నారు.

అన్ని రకాల డిజిటల్‌ వ్యూహాలు
ఫొటోలను ఎడిట్‌ చేయడం అనే అంశాన్ని పార్టిసిపెంట్స్‌ ముందుకు తీసుకువచ్చారు. ఫోటోలను ఎడిట్‌ చేసిన పార్టిసిపెంట్స్‌ కి ఎలాంటి సూచన లూ చేయలేదు. వారు సోషల్‌ ‘మీడియాలో పోస్ట్‌ చేసేవి మీకు నచ్చిన విధంగా ఎడిట్‌ చేయమని మాత్రమే వారికి చెప్పాం. దీంతో అన్ని ఫిల్టర్‌లు, ఫేస్‌టైమ్‌ వంటి అనేక ఇతర డిజిటల్‌పరంగా తారుమారు చేసే వ్యూహాలన్నీ ఉపయోగించినట్టు మా ముందుకు వచ్చిన ఫొటోలు చూపాయి. ఈటింగ్‌ డిజార్డర్‌ లక్షణాలను ఎవరూ పెద్దగా పేర్కొనలేదు. కానీ వారు తమను తాము ఇతరులతో పోల్చుకున్నారు. అంతేకాదు, తమ ప్రత్యర్థుల ఇష్టాలు, వ్యాఖ్యలపై ఎక్కువ సమయాన్ని ఖర్చు చేశారని నిరూపించారు.

చెడు సమాచారం
మీకు నప్పని, హాని కలిగించే సమాచారం నుంచి సోషల్‌ మీడియా మిమ్మల్ని రక్షించదు. నిర్ణయాల అమలు, ఆందోళన రేకెత్తిస్తూ మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశ ఉంది. ‘ఆరోగ్యకరమైన ఆహారం‘పై 1.2 మిలియన్ల కంటే ఎక్కువ ట్వీట్‌లను విశ్లేషించిన 2020 అధ్యయనం ఏం చెబుతుందంటే అలాంటి సమాచారం వెలిబుచ్చినవారిలో నిపుణులు ఎక్కువ మంది లేరని కనుక్కున్నారు. 8.5 శాతం కంటెంట్‌ తమకు తెలిసిన సమాచారాన్ని రీ పోస్ట్‌ చేయడం పైనే శ్రద్ధ చూపినట్టు తెలుస్తోంది.

దీని కారణంగా ‘సులభం గా ప్రభావితమైన వ్యక్తులు‘ ఆహారం, ఆరోగ్యం గురించి రకరకాల ఉబుసుపోని కబుర్లు సృష్టిస్తారు. అంతేకాదు, వారికి నచ్చిన ఉత్పత్తులు, సేవలను అందించే వాణిజ్య సంస్థల ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తారు. ఇతరులనూ చేయమని ప్రేరేపిస్తారు. ‘అందుకని ఒక పోస్ట్‌ నాణ్యతను ఎలా అంచనా వేయాలో నేర్చుకోవడం చాలా ముఖ్యం’ అంటారు కీల్‌. అలాంటిదేదైనా గమనిస్తే ‘వాడద్దు’ అనే హెచ్చరికకు సంకేతం’ అని గుర్తించాలంటారు ఆమె. ఎందుకంటే, ఏ ఒక్కరికీ మిగతావారికి సరిపడే పోషకాలలో పోలిక ఉండదు.

ఏం చేయాలంటే..
‘మీరు మరొకరిని చూసి వారిలాగే అవాలనుకునే నిర్ణయాన్ని ఈ క్షణమే వదిలేయండి. ఒక వ్యక్తిగా ఎదగడం గురించి ఎదుటివారిని అనుసరించవచ్చు. ఆ విలువలు మనకు మార్గనిర్దేశం చేస్తాయి. కానీ, ఆహార– ఫిట్‌నెస్‌ తీర్మానాల్లో కాదు’ అంటారు కీల్‌.
తోటివారు ఏం చేస్తున్నారో తెలుసుకోవడంలో తప్పులేదు. కానీ మీ కోసం ఓ మార్గాన్ని రూపొందించడానికి ఇతరులకు అవకాశం ఇవ్వద్దు.                                            

ఆచరించే నియమాలివి..
నిరుత్సాహపరిచే సోషల్‌ మీడియా కంటెంట్‌ నుండి దూరం అవ్వాలనుకుంటే ఎంగెల్న్, ఆమె సహచరులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

► మొదటి దశగా మిమ్మల్ని తమ శరీరాకృతితో పోలిక తెచ్చే సోషల్‌ మీడియా అకౌంట్లను తీసేయండి. దానికి బదులుగా మిమ్మల్ని ఉత్తేజిత పరిచే సమాచారాన్ని తీసుకోండి. మరొక సులువైన పరిష్కారం కూడా ఉంది. అలాంటి ఫొటోలను పదే పదే చూస్తున్నాం అనుకుంటే ఆ యాప్‌ను పూర్తిగా తొలగించండి. సోషల్‌ మీడియా నుండి విరామం మీ మానసిక ఆరోగ్యానికి మేలే చేస్తుంది. 
► సోషల్‌ మీడియా వ్యక్తులు మీ సొంత లక్ష్యాలను ప్రభావితం చేయడానికి మీరు అనుమతిస్తే, మీరు ఓటమికి లేదంటే కనీసం నిరుత్సాహానికి లోనవుతారు.
► మీ శరీరాకృతిని మార్చడానికి సంబంధించిన ఇతరుల నిర్ణయాలు ఏ మాత్రం విలువైనవి కావు అనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement