మానసిక బలమే విజయ రహస్యం!
మనిషి నిండు నూరేళ్ళ జీవితంలో యుక్తవయస్సు ఒక ముఖ్యమైన ‘జోన్’. ఈ జోన్‌లో ఉన్నప్పుడు, ఎదుర్కొంటున్న అనేక సమస్యలను అధిగమించి బయటకు రావడం, ఒక ‘ఛాలెంజ్’గా ఉంటుందంటాడు డా. జాన్ ఎడ్వర్డ్ అనే మానసిక నిపుణుడు. ఇలాంటి సంఘర్షణలో చాలామంది ఒకవైపు పెద్దవారు చెప్పే పద్ధతులనూ, మరోవైపు స్నేహితుల జీవనశైలినీ గమనిస్తూ... ఏ పద్ధతి ఆచరించాలో, ఎవరి మాట వినాలో తెలియక సందిగ్ధంలో పడి కొట్టుమిట్టాడుతుంటారు.
ఏదైనా ఒక పని చెయ్యాలనుకున్నప్పుడు దాంట్లో ఉండే సాధకబాధకాలను లోతుగా ఆలోచించి చెయ్యాలి. కానీ, అలా చెయ్యాలనుకోకపోవడం, తీరా దానివల్ల వచ్చే రిస్కును ఎలా ఎదుర్కోవాలో తెలియక, సతమతమై పోవడం అన్నవి చాలామందిలో చూస్తుంటాం. అలానే కొందరు పెద్దలు తమ అభిరుచుల్ని పిల్లలపై రుద్దడానికి చూస్తారు. దీనివల్ల పిల్లలపై ఒత్తిడి ఎక్కువ అవుతుంటుంది. మరికొందరు టీనేజర్లు దుందుడుకుతనంతో ఎక్కువగా రిస్క్ తీసుకుంటూ ఉంటారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో సాహసాలు చేస్తుంటారు. అలానే మిత్రులతో కలిసి మద్యపానం, సిగరెట్లు కాల్చడం లాంటివి చేస్తూ, హీరోయిజమ్ ప్రదర్శిస్తుంటారు. ఇవన్నీ ఉడుకు రక్తంతో యువతరం తీసుకుంటున్న నిర్ణయాలు.
ఈనాటి యువతరంలో కనబడే ఇంకొక ముఖ్యమైన మానసిక రుగ్మత - ‘యాంక్సైటీ న్యూరోసిస్’. దీనికి లోబడిన వారు ప్రతిదానికీ భయపడుతుంటారు. ఏమీలేక పోయినా ఏదో జరుగుతుందని ఊహించుకొని భయపడుతుంటారు. గుండెదడ, చెమటలు అధికంగా పట్టడం, ఏకాగ్రత కోల్పోవడం లాంటి లక్షణాలుంటాయి. ఫలితంగా మద్యం సేవించడం, డ్రగ్స్‌కు అలవాటు పడడం, ఆ మత్తులో జీవితాన్ని నాశనం చేసుకోవటం చూస్తున్నా.
టీనేజ్‌లో ఉండే మరో ముఖ్య సమస్య ‘ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్’. దీంతో బాధపడుతున్నవారు ఎవరి మాట వినరు. తాము ఏం చేసినా అదే సరైనదని భావిస్తుంటారు. తల్లితండ్రుల మాట అసలు వినరు. వాళ్ళను ‘ఓల్డ్‌టైమర్సు’ అంటారు. మొండితనం, వాదనతో ఎదుటి వారిని కన్విన్సింగ్ చేయడానికి ప్రయత్నించి అలవాటుగా మార్చుకుంటారు.
యువతలో వచ్చే మరో తీవ్రమైన మానసిక జబ్బు ‘మేనిక్ డిప్రెసివ్ సైకోసిస్’. ఈ జబ్బులో పడ్డవారిది మితిమీరిన ఆత్మవిశ్వాసం. అతి హుషారుగా, అధికంగా మాట్లాడుతుంటారు. అందరితో వాదించడం, అతి సంతోషం, అతికోపంతో ప్రవర్తించడం, డాబులు, గొప్పలు చెప్పడం, విపరీతంగా డబ్బు ఖర్చు చేయడం, అనవసరపు షాపింగులు చేయడం, ఆలోచించకుండా వ్యాపారాలు చేయడం, ఏదో సాధిద్దామని తలాతోకా లేని కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం, ప్రణాళిక లేకుండా అప్పులు చేయడం - ఇదంతా ‘మేనియా’ లక్షణాలుగా చెప్పవచ్చు. ఇదే సమయంలో కొందరు ఎంతటి సమస్యనైనా తెలివిగా పరిష్కరించుకొని జీవితంలో ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకొంటుంటారు. అందుకు వారి మానసిక ఆరోగ్యమే కారణం.
-డా॥కల్యాణ్ చక్రవర్తి, న్యూరోసైకియాట్రిస్టు