లైకులు కొట్టలేదని కోపమా..?
ఫేస్బుక్, ట్వీటర్లలో మీ గురించి మీరు ఎక్కువగా పోస్టులు పెడుతున్నారా, తరచూ స్టేటస్ అప్డేట్ చేస్తున్నారా, చేసే ప్రతిపనీ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారా, మీరు పురుషులైతే.. మీకు కొంచెం అహంకారం.. అసాంఘిక కార్యకలాపాలపై మక్కువ ఉన్నట్టేనని సైకాలజిస్టులు చెబుతున్నారు. లండన్‌లోని రెండు విశ్వవిద్యాలయాల సైకాలజిస్టులు జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. తన గురించి తాను ఎక్కువగా చెప్పుకునే వారు.. ఎక్కువ పోస్టులు పెట్టేవారిని కొంచెం అనుమానంతో చూడాల్సిందేనని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన సైకాలజిస్ట్ డాక్టర్ నెల్లీ ఫెరస్కీ అంటున్నారు.
కామెంట్లు పెట్టలేదని.. లైకులు కొట్టలేదని తరచూ ఫిర్యాదులు చేసే వారు, నెగటివ్ కామెంట్స్‌పై తీవ్రంగా స్పందించే వారు కూడా ఈ కోవకే చెందుతారని పేర్కొంటున్నారు. చాలామంది పురుషుల్లో సహజంగానే ఉండే అహంకార ధోరణుల వల్ల ఇలా జరుగుతోందని, అదే మహిళలైతే సామాజిక మాధ్యమాలను మనదీ.. మనవారు అన్న అనుభూతిని ఆస్వాదించేందుకు ఎక్కువగా వాడుతుంటారని చెబుతున్నారు. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించిన సర్వే ద్వారా తాము అంచనాకు వచ్చామని నెల్లీ తెలిపారు.