కట్టడ కార్మికుల పరిహారం పెంపు
= మంత్రి పరమేశ్వర్ నాయక్
= లక్షలాది మందికి లబ్ధి
= కార్మికులు పేరు నమోదు చేయించుకోవాలి
= అటువంటి వారికే పథకాలు వర్తింపు
= కార్మికుల వద్దకే అధికారులు వెళ్లి పేర్ల నమోదుకు శ్రీకారం
= బళ్లారి జిల్లాలో ప్రక్రియ ప్రారంభం
= త్వరలో అన్ని జిల్లాలకూ విస్తరణ
= హంపి ముగింపు ఉత్సవాలకు చిరంజీవి
సాక్షి, బెంగళూరు : నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం వివిధ రూపాల్లో అందిస్తున్న పరిహారం, ఆర్థిక సాయం మొత్తాన్ని పెంచనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పి.టి.పరమేశ్వర్నాయక్ వెల్లడించారు. దీని వల్ల రాష్ట్రంలోని ఈ రంగంపై ఆధారపడ్డ లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. బెంగళూరులోని విధానసౌధలో శుక్రవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. నిర్మాణ రంగంలోని కార్మికులు కార్మిక శాఖ వద్ద తమ పేర్లను నమోదు చేసుకునే ప్రక్రియ నిదానంగా సాగుతోందన్నారు. దీంతో భవన నిర్మాణ ప్రాంతం వద్దకే అధికారులు వెళ్లి.. కార్మికుల పేర్లను నమోదు చేసుకునే ప్రక్రియ బళ్లారిలో ఇటీవలే ప్రారంభించామని, ఈ విధానాన్ని దశల వారీగా అన్ని జిల్లాలకూ విస్తరింపజేస్తామని అన్నారు.
పేరు నమోదు చేసుకున్న వారికే సంక్షేమ ఫలాలు అందుతాయని స్పష్టం చేశారు. గార్మెంట్స్ ఫ్యాక్టరీల్లోని కార్మికులకు ప్రస్తుతం రూ.4,700 కనీస వేతనంగా పొందుతున్నారని, దీన్ని కూడా పెంచే యోచనలో ఉన్నామని తెలిపారు. దీనితో పాటు కట్టడ కార్మికుల పరిహారం పెంపుపై ఈ నెల 12న స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా 100 ఐటీఐ కళాశాలలు, వంద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు ప్రత్యేక భవనాలు నిర్మించే ఆలోచనలో ఉన్నామని మంత్రి వెల్లడించారు.
హంపి ముగింపు ఉత్సవాలకు కేంద్ర మంత్రి చిరంజీవి
వచ్చే ఏడాది జనవరి 10 నుంచి మూడు రోజుల పాటు హంపి ఉత్సవాలు నిర్వహిస్తామని బళ్లారి జిల్లా ఇన్చార్జ్ మంత్రిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్న పరమేశ్వర్ నాయక్ తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా విచ్చేస్తారని తెలిపారు. 12న జరిగే ముగింపు ఉత్సవాలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాలకు రూ.6 కోట్ల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు.