ఇక వైబర్లోనూ చాటింగ్!!
ఫేస్బుక్, వాట్సప్లలోనే కాదు.. తాజాగా వైబర్లోనూ చాటింగ్ చేసుకోడానికి అవకాశం వస్తోంది. భారతదేశంలో మొబైల్ ఇంటర్నెట్ వినియోగం శరవేగంగా విస్తరిస్తుండటంతో ఇన్నాళ్లూ ఉచితంగా కాల్స్ మాత్రమే అందిస్తున్న వైబర్.. ఇప్పుడు పబ్లిక్ చాట్‌ను కూడా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మార్క్ హార్డీ చెప్పారు. భారతదేశంలో తమకు అత్యధిక సంఖ్యలో యూజర్లున్నారని, మొత్తం 46 కోట్ల మంది యూజర్లుంటే, వాళ్లలో 3.3 కోట్లమంది భారతీయులేనని, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా అమెరికా, రష్యా, బ్రెజిల్, యూకే దేశాల వాళ్లు ఉన్నారని ఆయన అన్నారు.
పబ్లిక్ చాటింగ్ ద్వారా కేవలం చాటింగ్ చేసుకోవడమే కాక, కంటెంట్ కూడా షేర్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే, తాము ఫాలో అయ్యే సెలబ్రిటీల చాట్లు, వాళ్ల చర్చలను కూడా యూజర్లు చూసుకోవచ్చు. అంతేకాదు.. ఇందులో మరో కొత్త అవకాశం కూడా ఉంది. లైవ్ సంభాషణలు జరుగుతున్నప్పుడు వాటిని అప్పటికప్పుడే చూసుకోవచ్చు. వైబర్ వాడేవాళ్లు ఎంతమందిని ఫాలో అవుతుంటే అంతమంది చాట్లు చూడచ్చు. ఇందులో టెక్స్ట్, ఫొటోలు, ఆడియో, వీడియో, వెబ్ లింకులు ఏవైనా షేర్ చేసుకోవచ్చు. భారతదేశంలో ఏడాదికి 130 శాతం పెరుగుదల ఉంటోందని, ప్రతివారం తమకు అదనంగా 10 లక్షల మంది యూజర్లు కలుస్తున్నారని మార్క్ హార్డీ తెలిపారు.