నాంపల్లి టేషనుకాడి...
‘‘రూపాయి నోటుకి కొత్త రూపం వచ్చింది.
కానీ.. ధనిక–పేద అంతరాలు మారలేదు!
సంపాదనకి కొత్త కొత్త మార్గాలు వచ్చాయి.
కానీ.. ఇతరుల కష్టాన్ని దోచుకోవాలనే కొందరి స్వార్థం మారలేదు!’’ అన్నారు నటుడు మాదాల రవి. మాదాల రంగారావు, మురళీమోహన్ హీరోలుగా ‘ధవళ’ సత్యం దర్శకత్వంలో మాదాల రంగారావు నిర్మించిన చిత్రం ‘ఎర్ర మల్లెలు’. విప్లవ చిత్రాలకి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ చిత్రంలోని ‘నాంపల్లి టేషనుకాడి..’ పాటను ‘ప్రజా నాట్యమండలి’ ప్రభు రాశారు. ఈ పాటతత్వం గురించి మాదాల రవి మాటల్లో...
సుమారు ముప్ఫై ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ పాట వింటుంటే... అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో పెద్ద మార్పు రాలేదనిపిస్తుంది. పాట సందర్భం ఏంటంటే.... ఓ ధనవంతుడు నాంపల్లి నుంచి ఒంగోలుకి రైల్లో వస్తాడు. అక్కణ్ణుంచి ఆయన ప్రయాణం కోసం స్టేషన్ బయట ఖరీదైన కారు సిద్ధంగా ఉంటుంది. ఆ కారుని శుభ్రం చేస్తున్న కుర్రాణ్ణి చూసి జాలిపడిన వాళ్లావిడ ఏదైనా సహాయం చేయమంటుంది. అప్పుడా ధనవంతుడు కోపంతో ‘నాంపల్లి స్టేషన్లో ఎక్కింది మొదలు ఒంగోలు దిగే వరకు ఎక్కడ చూసినా ఇలాంటోళ్లే. ఇడియట్స్! కల్చర్ పెరిగిపోయి దేశమంతా రామరాజ్యం అయిపోతుంటే.. ఇలాంటి వెధవలంతా కలసి ఆ పేరుని పాడు చేస్తున్నారు’ అని వెళ్లిపోతాడు. అప్పుడీ పాట మొదలవుతుంది.
పల్లవి:
నాంపల్లి టేషనుకాడి రాజాలింగో... రాజాలింగా
రామారాజ్యం తీరు సూడు... శివాశంభు లింగా... లింగా (2)
నాంపల్లి టేషనుకాడి రాజాలింగో... రాజాలింగా
రామారాజ్యం తీరు సూడు... శివాశంభు లింగా... లింగా (2)
‘ఒంగోలే కాదు.. నాంపల్లితో పాటు మన దేశమంతా ఇటువంటి పరిస్థితే ఉందా?’ అని పిల్లాడు ఈ పాట అందుకుంటాడు. అప్పుడు నాంపల్లి స్టేషన్, ఇప్పుడు హైదరాబాద్ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ట్రాఫిక్ సిగ్నల్స్... ప్రతిచోటా కారు శుభ్రం చేయడానికి వచ్చే పిల్లలు అప్పుడప్పుడూ కనిపిస్తారు.
చరణం : తిందామంటే తిండీలేదు... ఉందామంటే ఇల్లే లేదు (2)
చేద్దామంటే కొలువు లేదు... పోదామంటే నెలవు లేదు ‘‘ నాంపల్లి..‘‘
గుక్కెడు గంజి కరువైపాయే... బక్కటి ప్రాణం బరువైపాయే (2)
బీదబిక్కి పొట్టలు గొట్టి... మేడలు గట్టె సీకటి శెట్టి ‘‘నాంపల్లి..‘‘
స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా మనిషి కనీస అవసరాలు తిండి, ఇల్లు, ఉద్యోగం లేని ప్రజలు మన దేశంలో ఉన్నారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చాయి. కానీ, ఇదే టెక్నాలజీని ఉపయోగించి పేదల కష్టాన్ని దోచుకుంటున్న ధనవంతుల గురించి అప్పుడప్పుడూ వార్తల్లో చదువుతూనే ఉన్నాం.
చరణం:
లేని అమ్మది అతుకుల బతుకు.. ఉన్న బొమ్మకి అందం ఎరువు (2)
కార్లలోన తిరిగే తల్లికి కట్టే బట్ట బరువైపాయె
‘‘నాంపల్లి..‘‘
ఈ చరణం విన్నప్పుడల్లా ‘ప్రభుగారు ఎంత ముందు చూపుతో ఆలోచించారు’ అనిపిస్తుంది. పాశ్చాత్య సంస్కృతి పేరుతో చిట్టిపొట్టి బట్టలు వేసుకోవడం ఇప్పటి ట్రెండ్. ఓ పక్క పేదలు చిరిగిన బట్టలకు అతుకులు వేసుకుంటుంటే.. మరోపక్క డబ్బున్నోళ్లు అందంగా ముస్తాబవడానికి వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఎవర్నీ తప్పుబట్టడం లేదు. కానీ, మన భారతీయ సంస్కృతికి సుదూరంగా ప్రజలు వెళ్తున్నారనేది అక్షర సత్యం. పైగా, ఇప్పుడు బట్టలు ఎంత కురచగా ఉంటే అంత ఎక్కువ రేటు ఉంటున్నాయి.
చరణం: ముందు మొక్కులు ఎనక తప్పులు... ఉన్నవాడికే అన్నీ చెల్లును (2)
ఉలకావేమి పలకావేమి... బండరాయిగ మారిన సామి ‘‘నాంపల్లి..‘‘
అప్పుడూ.. ఇప్పుడూ... వేలకోట్లకు టోపీ పెట్టేసినోళ్లు ఎక్కడైనా దర్జాగానే తిరుగుతున్నారు. పైకి దేవుడికి మొక్కుతున్నారు. వెనక తప్పులు చేస్తున్నారు. వాళ్లకు అన్నీ చెల్లుతున్నాయి. ఈ పరిస్థితులపై భగవంతుడు ఎప్పుడూ స్పందించడం లేదు! అని కుర్రాడు బాధతో పాటని ముగిస్తాడు.
ఈ పాటకి చాలా ప్రత్యేకతలున్నాయి. ప్రముఖ గాయని ఎస్పీ శైలజగారు ఈ పాటతోనే చిత్రసీమకు పరిచయమయ్యారు. తొలి పాటతోనే ఉత్తమ గాయనిగా నంది పురస్కారం అందుకున్నారామె. నేను బాల నటుడిగా పరిచయమైంది కూడా ఈ పాటతోనే. ఇందులో నేను నటించడం వెనుక జరిగిన ఓ చిత్రమైన సంఘటన గురించి చెప్పాలి. ఈ చిత్రానికి నిర్మాత నాన్నగారే కదా. పాటల రికార్డింగ్ పూర్తయిన తర్వాత క్యాసెట్ ఇంటికి తీసుకొచ్చారు. ఓసారి ఈ పాట పెట్టుకుని నేను డ్యాన్స్ చేస్తున్నాను. ఎక్కడో బయటకు వెళ్లొచ్చిన నాన్నగారు నన్ను చూశారు. పాటంతా పూర్తయిన తర్వాత నా దగ్గరికి వచ్చి మెచ్చుకున్నారు. తర్వాత సినిమాలో కూడా నా చేత నటింపజేశారు. ఒక్క రోజులోనే పాట చిత్రీకరణ పూర్తయింది. మరో విశేషం ఏంటంటే... ప్రముఖ దర్శకులు టి. కృష్ణగారు ఈ పాటకి దర్శకత్వ పర్యవేక్షణ వహించారు. ఈ పాటకి నృత్యదర్శకులు ఎవరూ లేరు.
టి. కృష్ణగారితో పాటు చిత్ర దర్శకులు ‘ధవళ’ సత్యంగారు, చిత్రానికి కో–డైరెక్టర్‌గా పనిచేసిన బి. గోపాల్... ముగ్గురూ కలసి చిత్రీకరించారు. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ ‘ఎర్ర మల్లెలు’ చిత్రం సిల్వర్‌జూబ్లీ ఆడింది. సినిమాతో పాటు పాట కూడా సూపర్‌హిట్. ‘ప్రజా నాట్యమండలి ప్రభుగారు రాసిన ఏకైక పాట ఇది. తెలుగులోని అత్యుత్తమ వంద పాటల్లో ‘నాంపల్లి టేషనుకాడ..’ పాట ఒకటని ‘నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎన్ఎఫ్డీసీ) పేర్కొంది.
ఇంటర్వూ్య: సత్య పులగం