గ్రామీణాభివృద్ధికి కృషి చేయాలి
నూతనంగా ఎన్నికైన జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, జెడ్పీటీసీ సభ్యులు, నగర పంచాయతీ, మునిసిపల్ చైర్మన్లతోపాటు జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆదివారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ప్రతిఒక్కరూ పల్లెల అభివృద్ధికి కృషి చేయాలని వారినుద్దేశించి కేసీఆర్ పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు
* హైదరాబాద్‌లో సీఎంను కలిసిన నూతన ప్రజాప్రతినిధులు
* ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని పునరుద్ఘాటన త్వరలో ప్రజాప్రతినిధులకు
* శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడి
వరంగల్ : ఎన్నికల సమయంలో జిల్లా అభివృద్ధికి ఇచ్చిన హామీలు నూటికి నూరుశాతం అమలు చేస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేసి ప్రగతి దిశగా అడుగేయాల్సిన అవసరం ఉందన్నారు. నూతనంగా ఎన్నికైన జిల్లాపరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ, జెడ్పీటీసీ సభ్యులు, నగర పంచాయతీ, మునిసిపల్ చైర్మన్లతో పాటు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య, ఎంపీలు కడియం, సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు రమేష్, సురేఖ, శంకర్‌నాయక్, ముత్తిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్, ఎమ్మెల్సీలు బోడకుంటి, నాగపురి తదితరులు ఆదివారం హైదరాబాద్‌లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్‌ను కలిశారు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన వారిని ఆయన అభినందించారు. ప్రాథమిక స్థాయి నుంచి గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అన్ని రంగాల్లో పల్లెలను ముందువరుసలో ఉంచాలని ఆయన హితబోధ చేసినట్లు జిల్లా ప్రజాప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారని పేర్కొన్నారు.
జిల్లాలో వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధితోపాటు నగర అభివృద్ధికి ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, రాజకీయ అవినీతికి తావులేకుండా చూస్తామని చెప్పినట్లు వారు వివరిం చారు. ఆ తర్వాత సీఎం జిల్లాకు చెందిన ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు రైల్వే పరంగా సాధించాల్సిన ప్రాజెక్టులపై చర్చించినట్లు సమాచారం.
జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్