public organizations
-
ప్రభుత్వంపై ప్రజాసంఘాల మండిపాటు
సాక్షి, విజయవాడ : నగరంలోని ఎంబీ భవన్లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో మద్య వ్యతిరేక ఉద్యమ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నేతలు, వక్తలు ప్రభుత్వంపై మండిపడ్డారు. మద్యపానాన్ని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయంటూ విమర్శించారు. మద్యాన్ని రాష్ట్రం ఆదాయ వనరుగా చూస్తోందని, పేదల ఆరోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదని వక్తలు మండిపడ్డారు. ఇకనైన ప్రభుత్వం మద్యం పట్ల తన వైఖరి మార్చుకోవాలంటూ హితవు పలికారు. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా బెల్టుషాపులు యధేచ్ఛగా కొనసాగుతున్న ప్రభుత్వ చర్యలు శూన్యమనని విమర్శించారు. ఇకనైనా బెల్టుషాపులను అరకట్టాలని వారు డిమాండ్ చేశారు. విచ్చలవిడి మద్యం అమ్మకాలు లక్షల కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయని ప్రజా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి లక్ష్మణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ నేత తులసీ రెడ్డి, ఏపీ మహిళా సంఘం కార్యదర్శి దుర్గా భవానీ, కార్పొరేటర్ అవుతు శైలజ పాల్గొన్నారు. -
బీసీసీఐ ప్రజా సంస్థే: లా కమిషన్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి మింగుడు పడని నిర్ణయాన్ని లా కమిషన్ తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఈ క్రికెట్ బోర్డు ప్రజా సంస్థ అని తేల్చింది. సమాచార హక్కు (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావాలని సిఫారసు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం లా కమిషన్ సిఫారసులను ఆమోదిస్తే, ఆర్టీఐ చట్టపరిధిలోకి బోర్డు వస్తే... కోర్టుల్లో ఇక ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) వెల్లువెత్తుతాయి. జట్ల సెలక్షన్, ఆటగాళ్లను ఏ ప్రాతిపదికన తీసుకున్నారని పిల్ దాఖలు చేసే అవకాశాలుంటాయి. జస్టిస్ బి.ఎస్.చౌహాన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న లా కమిషన్... బోర్డు, ఆటగాళ్లకు అందుతున్న పురస్కారాలను ఈ సందర్భంగా విశ్లేషించింది. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు తమ జెర్సీలపై త్రివర్ణాలను, హెల్మెట్లపై అశోక ధర్మచక్రాన్ని ప్రముఖంగా ధరిస్తున్నారని, వారు సాధించిన ఘనతలకు భారత ప్రభుత్వం అత్యున్నత పౌరపురస్కారాలను, పన్ను మినహాయింపులను, ప్రోత్సాహకాలను అందిస్తోందని... కాబట్టి దీన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్‌గా చూడలేమని, ప్రభుత్వ సంస్థే అవుతుందని కమిషన్ తమ సిఫారసులో పేర్కొంది. -
ఇదేంటి వెంకటరమణా..?
- తిరుమల బైపాస్ రోడ్డులో బార్లను నిషేధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు - ఆ మార్గంలో బార్లకు అనుమతించాలంటూ సర్కారుపై ఎమ్మెల్యే ఒత్తిడి..! - భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ ప్రజాసంఘాల ఆగ్రహం సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మద్యం ఏరులై పారుతుండటం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. తిరుపతిలో మద్యం అమ్మకాలను నిషేధించి.. భక్తుల మనోభావాలను కాపాడాలన్న ప్రజాసంఘాల డిమాండ్‌ను ప్రభుత్వం చెవికెక్కించుకోవడం లేదు. కనీసం తిరుపతిలోనైనా మద్యాన్ని నిషేధించాలంటూ భారీ ఎత్తున పోరాటాలు చేసినా సర్కారు ఖాతరు చేయలేదు. ఖజానాను నింపుకోవడానికి భక్తుల మనోభావాలను తాకట్టు పెడుతోంది. ఈ నేపథ్యంలో కనీసం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో.. అంటే రైల్వేస్టేషన్, విష్ణునివాసం, ఆర్టీసీ బస్టాండు, శ్రీనివాసం, లీలామహల్ సర్కిల్, నంది సర్కిల్(తిరుమల బైపాస్ రోడ్డు) వరకూ మద్యం దుకాణాలు, బార్లను నిషేధించాలనే డిమాండ్ భక్తుల నుంచి వచ్చింది. ఆ డిమాండ్‌కు కూడా స్పందించకపోవడంతో ప్రజాసంఘాలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు ఉత్తర్వుల మేరకు గతేడాది తిరుమల బైపాస్ రోడ్డులో మద్యం దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటుచేయలేదు. కానీ.. ఆ మార్గంలో తొమ్మిది బార్లకు లెసైన్సులు మాత్రం ఇచ్చింది. తిరుమల బైపాస్ రోడ్డులో బార్లను కూడా అనుమతించకూడదంటూ ప్రజాసంఘాలు మరోసారి కోర్టును ఆశ్రయించాయి. ఇప్పుడు ఈ అంశం కోర్టు విచారణలో ఉంది. దీంతో తిరుపతి బైపాస్ రోడ్డులోని తొమ్మిది బార్ల లెసైన్సులను ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు. మిగతా పదిబార్లకు రెన్యువల్ చేసింది. ఆ తొమ్మిది బార్ల లెసైన్సుదారులు ఎమ్మెల్యే వెంకటరమణకు ప్రధాన అనుచరులు. సార్వత్రిక ఎన్నికల్లో వెంకటరమణ విజయానికి వీరు భారీ ఎత్తున ఖర్చుచేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో ఖర్చు చేసిన సొమ్మును రాబట్టుకునేందుకు బార్ల లెసైన్సుదారులు ఎమ్మెల్యే వెంకటరమణపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన వెంకటరమణ తిరుమల బైపాస్ రోడ్డులో తొమ్మిది బార్లకు అనుమతించాల్సిందేనంటూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. సోమవారం ఇదే అంశంపై హైదరాబాద్‌లో ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులతో భేటీ కావడం గమనార్హం. దేవదేవుడు కొలువైన తిరుమలకు వెళ్లే మార్గంలో మద్యం దుకాణాలు, బార్లు ఏర్పాటుచేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనంటూ ఆధ్యాత్మికవేత్తలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా తిరుమల బైపాస్ రోడ్డులో బార్లు ఏర్పాటుచేస్తే ఉద్యమాలు తప్పవని ప్రజాసంఘాలు హెచ్చరిస్తున్నాయి. కానీ ఇవేవీ ఎమ్మెల్యే వెంకటరమణ పట్టించుకోకపోవడం గమనార్హం. తన అనుచరులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా తిరుమల బైపాస్ రోడ్డులో తొమ్మిది బార్లకు లెసైన్సులు ఇప్పించేందుకు పోరాటం చేస్తోండటం కొసమెరుపు.