ఇదేంటి వెంకటరమణా..?
- తిరుమల బైపాస్ రోడ్డులో బార్లను నిషేధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
- ఆ మార్గంలో బార్లకు అనుమతించాలంటూ సర్కారుపై ఎమ్మెల్యే ఒత్తిడి..!
- భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ ప్రజాసంఘాల ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మద్యం ఏరులై పారుతుండటం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. తిరుపతిలో మద్యం అమ్మకాలను నిషేధించి.. భక్తుల మనోభావాలను కాపాడాలన్న ప్రజాసంఘాల డిమాండ్‌ను ప్రభుత్వం చెవికెక్కించుకోవడం లేదు. కనీసం తిరుపతిలోనైనా మద్యాన్ని నిషేధించాలంటూ భారీ ఎత్తున పోరాటాలు చేసినా సర్కారు ఖాతరు చేయలేదు. ఖజానాను నింపుకోవడానికి భక్తుల మనోభావాలను తాకట్టు పెడుతోంది. ఈ నేపథ్యంలో కనీసం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో.. అంటే రైల్వేస్టేషన్, విష్ణునివాసం, ఆర్టీసీ బస్టాండు, శ్రీనివాసం, లీలామహల్ సర్కిల్, నంది సర్కిల్(తిరుమల బైపాస్ రోడ్డు) వరకూ మద్యం దుకాణాలు, బార్లను నిషేధించాలనే డిమాండ్ భక్తుల నుంచి వచ్చింది.
ఆ డిమాండ్‌కు కూడా స్పందించకపోవడంతో ప్రజాసంఘాలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు ఉత్తర్వుల మేరకు గతేడాది తిరుమల బైపాస్ రోడ్డులో మద్యం దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటుచేయలేదు. కానీ.. ఆ మార్గంలో తొమ్మిది బార్లకు లెసైన్సులు మాత్రం ఇచ్చింది. తిరుమల బైపాస్ రోడ్డులో బార్లను కూడా అనుమతించకూడదంటూ ప్రజాసంఘాలు మరోసారి కోర్టును ఆశ్రయించాయి. ఇప్పుడు ఈ అంశం కోర్టు విచారణలో ఉంది. దీంతో తిరుపతి బైపాస్ రోడ్డులోని తొమ్మిది బార్ల లెసైన్సులను ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు. మిగతా పదిబార్లకు రెన్యువల్ చేసింది.
ఆ తొమ్మిది బార్ల లెసైన్సుదారులు ఎమ్మెల్యే వెంకటరమణకు ప్రధాన అనుచరులు. సార్వత్రిక ఎన్నికల్లో వెంకటరమణ విజయానికి వీరు భారీ ఎత్తున ఖర్చుచేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో ఖర్చు చేసిన సొమ్మును రాబట్టుకునేందుకు బార్ల లెసైన్సుదారులు ఎమ్మెల్యే వెంకటరమణపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన వెంకటరమణ తిరుమల బైపాస్ రోడ్డులో తొమ్మిది బార్లకు అనుమతించాల్సిందేనంటూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. సోమవారం ఇదే అంశంపై హైదరాబాద్‌లో ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులతో భేటీ కావడం గమనార్హం.
దేవదేవుడు కొలువైన తిరుమలకు వెళ్లే మార్గంలో మద్యం దుకాణాలు, బార్లు ఏర్పాటుచేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనంటూ ఆధ్యాత్మికవేత్తలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా తిరుమల బైపాస్ రోడ్డులో బార్లు ఏర్పాటుచేస్తే ఉద్యమాలు తప్పవని ప్రజాసంఘాలు హెచ్చరిస్తున్నాయి. కానీ ఇవేవీ ఎమ్మెల్యే వెంకటరమణ పట్టించుకోకపోవడం గమనార్హం. తన అనుచరులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా తిరుమల బైపాస్ రోడ్డులో తొమ్మిది బార్లకు లెసైన్సులు ఇప్పించేందుకు పోరాటం చేస్తోండటం కొసమెరుపు.