మహా పుష్కరాలపై పిల్ కొట్టివేత..
{పభుత్వాలది ప్రచారం ఎంతమాత్రం కాదు
అది కేవలంసమాచారం ఇవ్వడమే
అలా చేయడం {పభుత్వాల బాధ్యత
అన్ని మతాలను సమానంగా చూడటమే లౌకికవాదం
ధర్మాసనం స్పష్టీకరణ
హైదరాబాద్: మహాపుష్కరాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) హైకోర్టు కొట్టేసింది. పుష్కరాలకోసం ప్రభుత్వాలు చేస్తోంది ప్రచారం కాదని, ప్రజలకు సమాచారాన్నే అందిస్తున్నాయని స్పష్టంచేసింది. ప్రజల మతవిశ్వాసాలకు సంబంధించి న కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయడం ప్రభుత్వాల బాధ్యతని తేల్చిచెప్పింది. పుష్కరాలద్వా రా ప్రభుత్వాలు ఓ మతాన్నే ప్రోత్సహిస్తున్నాయన్న వాదనల్లో అర్థంలేదంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. మహాపుష్కరాలకు ప్రచారం చే యడం లౌకికస్ఫూర్తికి విరుద్ధంగా ప్రకటించాలని, రాజమండ్రిలో పుష్కరాల ప్రారంభం రోజున జరిగిన తొక్కిసలాటలో 29 మంది చనిపోవడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును బాధ్యుడిగా చేయాలంటూ పౌరహక్కుల సంఘం నేత చిల్కా చంద్రశేఖర్ దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున వి.రఘునాథ్ వాదనలు వినిపిస్తూ.. గోదావరిలో స్నానమాచరిస్తే పుణ్యం, మోక్షం కలుగుతుందంటూ ఇరుప్రభుత్వాలు ప్రచారం హోరెత్తిస్తున్నాయని, ప్రజల డబ్బుతో ప్రభుత్వాలిలా ఓ మతపరమైన కార్యక్రమాలకు ప్రచారం చేయడం లౌకికస్ఫూర్తికి విరుద్ధమన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ప్రభుత్వాలు మహాపుష్కరాలకే కాదు.. పలు ఇతర మతకార్యక్రమాలకూ ఇలానే చేస్తున్నాయి. ప్రధాని రంజాన్‌కు ఈద్ ముబారక్ చెబితే తప్పవుతుందా? హ్యాపీ దీపావళి అంటే ఓ మతానికి మద్దతు పలుకుతున్నట్లా? మీ ప్రకారం ఓ పండుగకు సెలవు ప్రకటించడమూ తప్పన్నట్లు ఉంది. లౌకికస్ఫూర్తిని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.
అన్నిమతాల్ని సమానంగా చూడటమే లౌకికవాదం. ప్రధాని, సీఎంలూ రంజాన్‌కు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయ డం.. ఎవరైనా ఆహ్వానిస్తే వెళ్లడం సర్వసాధారణం. ఇలా వెళ్లడం ఓ మతాన్ని ప్రోత్సహించినట్లవుతుందని అనగలమా? వినాయకచవితి, దసరాలకు విగ్రహాల నిమజ్జనానికి ప్రభుత్వాలు కోట్ల సొమ్ము ఖర్చుచేస్తూ ప్రజలకిబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇలాచేయడం ప్రభుత్వాల బాధ్యత. దీన్ని ఓ మతాన్ని ప్రోత్సహించడానికి చేస్తున్నారనడానికి వీల్లేదు కదా? పుష్కరాలకు వెళితే మీకు అదిస్తాం.. ఇదిస్తాం.. అని చెబితే తప్పు. అలా ప్రభుత్వాలు చేస్తుంటే చెప్పండి. మేం జోక్యం చేసుకుంటాం. అంతేతప్ప ఇటువంటి వ్యాజ్యాల్లో మాత్రం కాదు’’ అని వ్యాఖ్యానించింది.
అత్యంత దురదృష్టకరం
రాజమండ్రిలో పుష్కరాల ప్రారంభం రోజున తొక్కిసలాట జరిగి 29 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇవి అసహజ మరణాలు కానేకాదని, ఓ మనిషి చేసిన హత్యలని రఘునాథ్ నివేదించారు. ఏపీ సీఎం చంద్రబాబే దీనికి బాధ్యులని, ఆయన ప్రచారంకోసం ఓ డాక్యుమెంటరీ చిత్రీకరణకు చేసిన ఏర్పాట్లవల్లే అంతమంది మృత్యువాత పడ్డారని తెలిపారు. రాజకీయలబ్ధికోసమే డాక్యుమెంటరీకి శ్రీకారం చుట్టారన్నారు. తెల్లవారుజాము 2 గంటల నుంచి ఉదయం 8.30 గంటల వరకు చంద్రబాబుకోసం జనాల్ని క్యూలైన్లలో నిలిపేశారని, దీంతో తొక్కిసలాట జరిగిందని వివరించారు. 29 మంది చనిపోయినా ఏపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టూ లేదని, అసహజ మరణాలని ఎఫ్ఐఆర్ నమోదు చేసి చేతులు దులుపుకుందని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఆ ఘటన అత్యంత దురదృష్టకరమంది. కాగా లౌకికవాదానికి ముడిపెట్టి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని విచారించలేమని, దీన్ని కొట్టేస్తున్నామని పేర్కొంది.