కార్పొరేట్లకు బ్యాంక్ లెసైన్స్లు వద్దు
వడోదర: ప్రైవేట్ సంస్థలకు బ్యాంకింగ్ లెసైన్స్లు ఇవ్వడాన్ని ది ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) వ్యతిరేకిస్తోంది. కార్పొరేట్ కంపెనీలకు బ్యాంకింగ్ లెసైన్స్లు ఇవ్వడం దేశ ప్రయోజనాలకు హానికరమని, వాళ్ల స్వప్రయోజనాలకే వీటిని వాడుకుంటారని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సి.హెచ్.వెంకటాచలం పేర్కొన్నారు. అంతేకాకుండా బ్యాంకింగ్ సేవలు కూడా ఖరీదవుతాయన్నారు. ప్రభుత్వం కొత్తగా బ్యాంకింగ్ లెసైన్స్లు ఇవ్వాలని యోచిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ జరిగిన ఫెడరేషన్ ఆప్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్స్ జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. 1969కు ముందు బ్యాంకులను ప్రైవేట్ వ్యాపార సంస్థలే నిర్వహించేవని, వాటి అస్తవ్యస్త విధానాల కారణంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను పటిష్టపరచాల్సిన అవసరముందని వెంకటాచలం స్పష్టంచేశారు.