'టాయిలెట్లో పాములుండొచ్చు జాగ్రత్త'
న్యూ సౌత్ వేల్స్ : 'కుక్కలున్నాయి జాగ్రత్త' అనే బోర్డు చాలామంది ఇళ్ల ముందు మనం చూస్తూనే ఉంటాం, 'పిక్ పాకెటర్స్ తో జాగ్రత్త', 'అపరిచితులతో అప్రమత్తంగా ఉండండి' లాంటి బోర్డులైతే బస్ స్టేషన్లలో, రైల్వే స్టేషన్లలో కనబడుతున్నాయి. కానీ 'టాయిలెట్లో పాములుండొచ్చు జాగ్రత్త' అనే సైన్ బోర్డు ఎక్కడైనా చూశారా? ఆస్ట్రేలియాలో ఇలాంటి బోర్డులు చాలా దర్శనిమిస్తున్నాయి.
ఆస్ట్రేలియాలోని కొన్ని పబ్లిక్ టాయిలెట్లు, బీచ్ ల వద్ద ఏర్పాటు చేసిన బోర్డులు పలువురిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. మంగళవారం 'ఆస్ట్రేలియా డే'ను సెలబ్రేట్ చేసుకునేందుకు ఆస్ట్రేలియా వాసులంతా ఉత్సాహంగా సన్నద్ధమవుతుండగా వాతావరణ, వారసత్వ విభాగానికి చెందిన న్యూ సౌత్ వేల్స్ ఆఫీసు రక్షణ చర్యలకు దిగింది. 'గమనిక-టాయిలెట్ బౌల్ లో పాములు ఉండొచ్చు' అంటూ టాయిలెట్ల తలుపులపై వార్నింగ్ బోర్డులు ఏర్పాటు చేసింది . 'విషపూరితంకాని పాములు ఇంతకుముందు ఈ టాయిలెట్లో కనిపించాయి. కావున టాయిలెట్ ను ఉపయోగించే ముందు చెక్ చేసుకోండి' అంటూ న్యూ సౌత్ వేల్స్ కు చెందిన జాతీయ పార్కులు, వన్యప్రాణుల సంరక్షణా విభాగం ఏర్పాట్లను చేసింది.
అలాగే దక్షిణ సిడ్నీలోని గారీ బీచ్ వద్ద గల రాయల్ నేషన్ పార్క్ వద్ద కూడా 'రాళ్ల మధ్య కొండచిలువలు కలవు.. జాగ్రత్త' అంటూ సందర్శకులను అప్రమత్తం చేసే పనులు చేపట్టింది. దీనిపై ఓ ప్రభుత్వాధికారి మాట్లాడుతూ.. 'పాములు ఎటు నుంచైనా ఎప్పుడైనా రాగల జీవులు, అందుకే అప్రమత్తం చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో అధిక సంఖ్యలో పాములు తిరగడం ఈ మధ్య గమనించాం. రిస్క్ నుంచి ప్రజలను రక్షించేందుకే సాధారణ హెచ్చరికలను ఏర్పాటు చేశాం' అని చెప్పారు. అలాగే ప్రజలకు కలిగిన ఈ ఇబ్బంది తొలగించేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ముఖ్యంగా నదీ తీరాల్లో తిరిగే ఎరుపు రంగు ఉదరం గల నలుపు రంగు పాములు టాయిలెట్లలో చొరబడుతున్నాయట. ఒకవేళ ఈ పాముల బెడద నుంచి తప్పించుకున్నా తేనెటీగలు వదిలేట్టు లేవు. ప్రమాదకరమైన ఈగల నుంచి కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ అప్రమత్తం చేసింది ప్రభుత్వ సిబ్బంది. మొత్తానికి ఈ సైన్ బోర్డులు మనకు నవ్వు తెప్పిస్తున్నా.. ఆస్ట్రేలియా వాసులను మాత్రం పబ్లిక్ టాయిలెట్ల వైపు చూడాలంటేనే భయపెడుతున్నాయి.