నోటుకు ఓటు అమ్ముకోవద్దు
కందుకూరు, న్యూస్‌లైన్:: ఎన్నికల్లో విచ్చలవిడిగా ధనం ఖర్చు చేయడం.. డబ్బున్న వాళ్లకే రాజకీయాల్లో ప్రాధాన్యం పెరగడం. ఆదర్శాలు, ఆశయాలు కేవలం మాటలకే పరిమితం కావడం.. ప్రజల్ని నాయకులు తప్పుదోవ పట్టించి తమ పబ్బం గడుపుకొంటున్నారని.. ఓటర్లు సైతం నోటుకు ఓటు అమ్ముకుంటున్నారనే విషయమై ఆయన ఎంతగా ఆవేదనకు గురయ్యారో ఈ చిత్రమే నిదర్శనంగా నిలుస్తోంది. మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కందుకూరు జెడ్పీటీసీ అభ్యర్థి పూలగాజుల జంగయ్య వినూత్న రీతిలో నిరసన వ్యక్తంచేశారు. నోటుకు ఓటు అమ్ముకునే సంప్రదాయాన్ని పారదోలాలంటూ మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తపరిచారు.
ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతూ.. అంబేద్కర్, మహాత్మా జ్యోతీరావు పూలే, బాబూ జగ్జీవన్‌రామ్ సిద్ధాంతాల సాధన కోసమే తాను జెడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. ఎన్నికల్లో ఓటు హక్కును డబ్బుకు అమ్ముకుంటే తమను తాము మోసం చేసుకున్నట్లేనన్నారు. జనరల్ కోటాలో ప్రతి ఒక్కరూ పోటీ చేయవచ్చన్నారు. బలహీనవర్గాల అభ్యున్నతి కోసం తాను జెడ్పీటీసీ అభ్యర్థిగా రంగంలో ఉన్నానని.. అల్మరా గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన వేడుకున్నారు. జంగయ్యకు మద్దతుగా నాయకులు ఢిల్లీ రాములు ముదిరాజ్, గండు ఈశ్వర్ మాదిగ, సత్తయ్య పాల్గొన్నారు.