పులిచింతలే ఆధారం
తెలంగాణలో యథేచ్ఛగా కృష్ణా జలాల వినియోగం
భవిష్యత్తుపై కృష్ణా డెల్టా రైతుల్లో ఆందోళన
సాగు, తాగునీటి అవసరాలకు పులిచింతల ప్రాజెక్టే ఆధారం
ముందుచూపుతో శంకుస్థాపన చేసిన వైఎస్సార్
20 టీఎంసీలు నిల్వ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు
90శాతం పనులే పూర్తి
సాక్షి, విజయవాడ : ‘మాకు విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తాం..’ అని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ‘ప్రస్తుతం అక్కడ నీరు తక్కువగా ఉన్నందున జలవిద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తే వచ్చే ఏడాది కృష్ణా డెల్టాకు కనీసం తాగునీరు కూడా అందించలేం..’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లోనే సకాలంలో సాగునీరు అందక రైతులు ఇబ్బందులుపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న పరిస్థితే కొనసాగితే వచ్చే ఏడాది తమకు చుక్కనీరు కూడా వచ్చే అవకాశం లేదని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.
ఈ క్రమంలో అందరి దృష్టి పులిచింతల ప్రాజెక్టుపైనే పడింది. కృష్ణా డెల్టా రైతాంగానికి సాగు, తాగునీటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముందుచూపుతో పులిచింతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద వదులుతున్న నీటిలో 20 టీఎంసీలను పులిచింతల ప్రాజెక్టు వద్ద నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తోంది.
తెలంగాణ తీరుతో తీవ్ర నష్టం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సమస్యను పరిష్కరించుకునేందుకు శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణా నీటిని విద్యుదుత్పత్తికి యథేచ్ఛగా వాడుకుటోంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 854అడుగుల కంటే తక్కువ ఉంటే వచ్చే వేసవిలో కృష్ణాడెల్టాకు, రాయలసీమ జిల్లాలతోపాటు హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యలు ఏర్పడతాయి. ఇప్పటికే అక్కడ నీటిమట్టం 860 అడుగులకు చేరుకుంది. విద్యుత్ ఉత్పత్తి విషయంలో తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఇదే పద్ధతిని అవలంబించే అవకాశం ఉంది. అదే జరిగితే కృష్ణా డెల్టా ప్రాంత వాసులు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరక్క అల్లాడే పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ మొదలు పెట్టిన పులిచింతల ప్రాజెక్టే మండువేసవిలో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులను ఆదుకునే అవకాశం ఉంటుంది.
90 శాతం పూర్తయ్యాయి
పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం పనులు 90శాతం పూర్తయ్యాయని, మరో 10శాతం మాత్రమే మిగిలి ఉందని ప్రాజెక్టు ఈఈ ప్రకాష్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రాజెక్టు అత్యవసర గే ట్లను తెరిచేందుకు ఉపయోగించే గ్యాట్రీ క్రేన్ ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. ఏదైనా ఇబ్బంది వల్ల ప్రాజెక్టు గేట్లు తెరుచుకోక పోతే గ్యాట్రీ క్రేన్ ద్వారా అత్యవసర గేట్లు తెరవొచ్చని వివరించారు. వీటి ఏర్పాటుకు మరో మూడు నెలలు పడుతుందని తెలిపారు. అన్ని పనులు పూర్తయితే పులిచింతల జలయాశంలో 45 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చని వివరించారు. దీంతో కృష్ణాడెల్టా రైతులకు సాగు, తాగునీరుకు ఇబ్బందులు ఉండవన్నారు.
నష్టపరిహారం కోసం రూ.80 కోట్లు అవసరం
తెలంగాణ నుంచి వచ్చిన సమస్యను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం 20 టీఎంసీల నీటిని పులిచింతల ప్రాజెక్టులో నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనికిగాను నల్లగొండ జిల్లాలోని నాలుగు గ్రామాలను ఖాళీ చేయించేందుకు గతంలో రూ.20 కోట్లు పరిహారం ఇవ్వగా, తాజాగా మరో రూ.40 కోట్లు మంజూరు చేసింది. అయితే 40 టీఎంసీల నీటిని నిల్వ చేస్తే ఎనిమిది గ్రామాలు ముంపునకు గురవుతాయి.
ఈ గ్రామ ప్రజలకు నష్టపరిహారం ఇవ్వాలంటే మరో రూ.80 కోట్లు అవసరం అవుతాయని రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రూ.80 కోట్లు విడుదల చేసి, ఆయా గ్రామాల ప్రజలకు చెల్లిస్తే ఈ ప్రాజెక్టులో 40 టీఎంపీల నీరు నిల్వ చేయవచ్చు. కనీసం వచ్చే ఏడాదికైనా ఈ పని పూర్తి చేయాలని కృష్ణా డెల్టా రైతాంగం ముక్తకంఠంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితేనే డెల్టా ప్రాంతానికి నీటి కష్టాలు తీరతాయి.