భారత సంతతి కవి శేషాద్రికి ‘పులిట్జర్’
3 సెక్షన్స్’ కవితా సంపుటికి గుర్తింపు
న్యూయార్క్: ప్రముఖ భారత సంతతి కవి విజయ్ శేషాద్రి ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారానికి ఎంపికయ్యారు. 2014 ఏడాదికి గాను కవిత్వ విభాగంలో ఆయన కవితా సంపుటి ‘3 సెక్షన్స్’కు ఈ అవార్డు ప్రకటించారు. జర్నలిజం, సాహిత్యం, నాటకం, సంగీతం తదితర విభాగాల్లో పులిట్జర్ పురస్కార విజేతల పేర్లను మంగళవారం కొలంబియా యూనివర్సిటీ వెల్లడించింది. ‘శేషాద్రి రాసిన 3 సెక్షన్స్ ఉద్వేగభరిత కవితాగుచ్ఛం. జననం నుంచి బుద్ధిమాంద్యం వరకు ఎన్నో అంశాల్లో మానవ చైతన్యాన్ని, తాత్వికతను తమాషాగా, సానుభూతి, ఆగ్రహంతో కూడిన స్వరంతో పట్టిచూపింది’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.
పులిట్జర్ కవితా పురస్కారాన్ని అమెరికన్ కవులకు అందిస్తారు. దీనికి కింద శేషాద్రి సుమారు రూ.6 లక్షలు అందుకుంటారు. 1954లో బెంగళూరులో జన్మించిన శేషాద్రి ఐదేళ్ల వయసులో అమెరికా వచ్చారు. ప్రస్తుతం న్యూయార్క్‌లోని సారా లారెన్స్ లిబరల్ ఆర్ట్స్ కాలేజీలో సాహిత్యాన్ని బోధిస్తున్నారు. పులిట్జర్ భారత సంతతి వ్యక్తిని వరించడం ఇది ఐదోసారి. కాగా, 2014కు గాను కాల్పనిక సాహిత్యంలో డోనా టార్ట్ రాసిన ‘ద గోల్డ్‌ఫించ్’కు, నాటక విభాగంలో ఆన్నీ బేకర్స్ రాసిన ‘ద ఫ్లిక్’కు పులిట్జర్ పురస్కారాలు దక్కాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా రహస్య నిఘాపై కథనాలు వెలువరించిన ‘ద వాషిం గ్టన్ పోస్ట్’, ‘గార్డియన్’ పత్రికలకు జర్నలిజం పబ్లిక్ సర్వీస్ మెడల్, సంచలన వార్తా కథనాల విభాగంలో ‘ద బోస్టన్ గ్లోబ్’కు అవార్డులు ప్రకటించారు.