pullala gopichand
-
సింగిల్స్ చాంప్స్ నవ్య, జస్టిన్ హో
సాక్షి, హైదరాబాద్: కొటక్ ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో అండర్–19 మహిళల సింగిల్స్‌లో నవ్య కండేరి (భారత్), జస్టిన్ హో (మలేసియా) విజేతలుగా నిలిచారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ముగిసిన ఈ టోర్నీ ఫైనల్స్‌లో నవ్య 21–15, 21–18తో ఇషారాణి బారువా (భారత్)పై, జస్టిన్ 21–18, 21–14తో ప్రణయ్ షెట్టిగర్ (భారత్)పై గెలిచారు. పురుషుల డబుల్స్ ఫైనల్లో నికోలస్ రాజ్–తుషార్ సువీర్ (భారత్) జోడీ 21–14, 21–18తో అపిలుక్–విత్చాయా (థాయ్‌లాండ్) ద్వయంపై... మహిళల డబుల్స్ ఫైనల్లో ఓంగ్ జిన్ యీ–కార్మెన్ టింగ్ (మలేసియా) ద్వయం 21–16, 21–15తో రాధిక శర్మ–తన్వీ శర్మ (భారత్) జోడీపై నెగ్గాయి. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో మయాంక్ రాణా–నర్ధన రవిశంకర్ (భారత్) జోడీ 25–23, 23–21తో కణపురం సాత్విక్ రెడ్డి–వైష్ణవి ఖాడ్కేకర్ (భారత్) జంటను ఓడించింది. చదవండి: T20 World Cup 2022: టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ బౌలర్ వచ్చేస్తున్నాడు! -
క్రీడాకారులకు ఆటే జీవితం: బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్
తిరుపతి తుడా: జాతీయ కబడ్డీ పోటీలు తిరుపతిలో బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, బ్యాడ్మింటన్ కోచ్, పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్, అర్జున అవార్డు గ్రహీత హోన్నప్ప గౌడ, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన, వందేమాతరం గీతాలాపన, భరతనాట్య ప్రదర్శన అనంతరం క్రీడా, శాంతి కపోతాలను ఎగురవేశారు. పోటీలను ప్రారంభించిన పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ.. తిరుపతిలాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో జాతీయ కబడ్డీ పోటీలను నిర్వహించడం శుభపరిణామమన్నారు. క్రీడాకారులకు ఆటే జీవితమన్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడారంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో తప్పనిసరిగా మైదానాలు ఉండాలని, నాణ్యమైన చదువుతోపాటు క్రీడల్లో రాణించేలా తర్ఫీదునివ్వాలని సీఎం సంకల్పించారని తెలిపారు. భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. తిరుపతిని క్రీడా హబ్‌గా కూడా తీర్చిదిద్దుతామన్నారు. కబడ్డీ టోర్నీతో దేశమంతా తిరుపతి వైపు చూస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు.. డాక్టర్ గురుమూర్తి, రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు.. ఆదిమూలం, జంగాలపల్లి శ్రీనివాసులు, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, నవాజ్‌బాషా, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు, కలెక్టర్ హరినారాయణన్, మునిసిపల్ కమిషనర్ గిరీష, మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్‌రెడ్డి, ముద్రనారాయణ, కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
"వచ్చే ఏడాది మరిన్ని విజయాలు సాధిస్తా"
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని, ఇకపై కూడా ఇదే జోరు కొనసాగించి మరిన్ని విజయాలు సాధిస్తానని భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. స్పెయిన్ నుంచి స్వస్థలం తిరిగొచ్చిన అనంతరం మంగళవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ రజత పతకంపై... ఎవరికైనా ప్రపంచ చాంపియన్‌షిప్ విజయం ఎంతో ప్రత్యేకం. నాకూ చాలా సంతోషంగా ఉంది. ఈ స్థాయి పెద్ద టోర్నీలో విజయం అంత సులువుగా దక్కదు. విజేతగా నిలవకపోయినా ఫైనల్ ఆడటం కూడా ఎంతో గొప్ప ఘనతగా భావిస్తున్నా. 2017లోనే పతకం గెలుస్తానని భావించినా అది సాధ్యం కాలేదు. ఈసారి ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగడం కూడా మేలు చేసింది. వచ్చే ఏడాది ప్రణాళికలపై... విజయాల జోరు కొనసాగించడంతో పాటు అవసరమైన చోట లోపాలు సరిదిద్దుకొని ఆటను మరింత మెరుగుపర్చుకోవడం ముఖ్యం. రాబోయే 8–10 నెలలు నా కెరీర్లో ఎంతో కీలకం. జనవరి 10 నుంచి జరిగే ఇండియా ఓపెన్‌తో 2022లో మళ్లీ టైటిల్స్ వేటలో పడతా. అనంతరం ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో రాణించడం ముఖ్యం. ఆపై కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్ ఈవెంట్లు ఉన్నాయి. నా గాయాల బాధ పూర్తిగా తప్పినట్లే. నేనిప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నాను. ఒలింపిక్స్ ఆడలేకపోవడంపై... టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది. కరోనా కారణంగా కనీసం తొమ్మిది క్వాలిఫయింగ్ టోర్నమెంట్లు రద్దు కావడం దెబ్బ తీసింది. ఆరంభ టోర్నీల్లో గాయం కారణంగా ఆడలేకపోగా, కోలుకొని కోర్టులో దిగే సరికి కోవిడ్ వచ్చేసింది. నా చేతుల్లో ఏమీ లేకుండా పోయింది. అయితే ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోయినంత మాత్రాన ప్రపంచం ముగిసిపోలేదని భావించా. ఇకపై ఎలా ఆడాలనే దానిపైనే దృష్టి పెట్టి మంచి ఫలితం సాధించా -
ఫోన్ ఇచ్చేస్తా... ఐస్‌క్రీమ్ తిననిస్తా
ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధుకు నజరానాలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు కోట్ల రూపాయల నగదుతో పాటు అమరావతిలో ఇంటిస్థలం ఇస్తామని ప్రకటించింది. గ్రూప్–1 స్థాయి అధికారి ఉద్యోగం కూడా ఇస్తామని తెలిపింది. అలాగే కోచ్ గోపీచంద్‌కు 50 లక్షల రూపాయల నగదు నజరానాతో పాటు అకాడమీ ఏర్పాటు కోసం ఐదెకరాలు స్థలాన్ని కేటాయించనుంది. ఢిల్లీ ప్రభుత్వం రెండు కోట్లు, హర్యానా 50 లక్షల రూపాయలు సింధుకు ఇస్తున్నాయి. సింధుతో పాటు పలువురు బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ఉద్యోగాలు ఇచ్చి సహకరిస్తున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తమ ఉద్యోగికి రూ.75 లక్షలు ప్రకటించింది. సింధుని అంబాసిడర్ చేయాలి: చాముండేశ్వరినాథ్ సాక్షి, తిరుమల: ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన పీవీ.సింధును తెలంగాణ అంబాసిడర్‌గా ప్రకటింవచ్చని ఏపీ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చాముండేశ్వరనాథ్ అన్నారు. ‘బ్రాండ్ అంబాసిడర్‌గా ఒక్కరనేం లేదు కనుక.. ఇద్దరినైనా ప్రకటించవచ్చు’ అని అభిప్రాయం వ్యక్తంచేశారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ఒలింపిక్స్‌లో రజతం గెలవడం దేశానికి గర్వకారణం అన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో సింధు బాగా పోరాడిందని అభినందించారు. భవిష్యత్‌లో తప్పక స్వర్ణపతకాన్ని సాధిస్తుందనే నమ్మకం తనకున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. రియో: ఒలింపిక్స్ పతకం కోసం ఆరు నెలలుగా సాగిన ఓ మిషన్ విజయవంతంగా ముగిసింది. ఈ ఆరు నెలల కాలంలో సింధు తన వ్యక్తిగత జీవితాన్ని చాలా కోల్పోయింది. తనకు ఇష్టమైన ఎన్నో రుచులను వదిలేసుకుంది. అందుకే పతకం గెలవగానే సింధుపై ఉన్న ఆంక్షలను గోపీచంద్ ఎత్తేశారు. ‘గత మూడు నెలలుగా సింధు దగ్గర ఫోన్ లేదు. నేను తీసేసుకున్నా ఇక వెంటనే సింధు ఫోన్ ఇచ్చేస్తా. అలాగే ఆమెకు ఇష్టమైన ఐస్‌క్రీమ్ కూడా తిననిస్తా’ అని పతకం గెలవగానే గోపీ చెప్పేశారు. అంతెందుకు సింధుకు ఎంతో ఇష్టమైన ‘స్వీట్ పెరుగు’కు కూడా ఆమె గత మూడు వారాలుగా దూరంగా ఉంది. ‘గత మూడు నెలలుగా ఏం చెబితే అది చేసింది. తన ఇష్టాలను వదిలేసుకుంది. ఎక్కడా ఇది ఎందుకు అని అడగలేదు. ఈ పతకం కోసం తను ఎంత కష్టపడిందో నాకు మాత్రమే తెలుసు’ అంటూ శిష్యురాలి గురించి మురిపెంగా చెప్పుకున్నారు కోచ్.