
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని, ఇకపై కూడా ఇదే జోరు కొనసాగించి మరిన్ని విజయాలు సాధిస్తానని భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. స్పెయిన్ నుంచి స్వస్థలం తిరిగొచ్చిన అనంతరం మంగళవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడాడు.
వరల్డ్ చాంపియన్‌షిప్ రజత పతకంపై...
ఎవరికైనా ప్రపంచ చాంపియన్‌షిప్ విజయం ఎంతో ప్రత్యేకం. నాకూ చాలా సంతోషంగా ఉంది. ఈ స్థాయి పెద్ద టోర్నీలో విజయం అంత సులువుగా దక్కదు. విజేతగా నిలవకపోయినా ఫైనల్ ఆడటం కూడా ఎంతో గొప్ప ఘనతగా భావిస్తున్నా. 2017లోనే పతకం గెలుస్తానని భావించినా అది సాధ్యం కాలేదు. ఈసారి ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగడం కూడా మేలు చేసింది.
వచ్చే ఏడాది ప్రణాళికలపై...
విజయాల జోరు కొనసాగించడంతో పాటు అవసరమైన చోట లోపాలు సరిదిద్దుకొని ఆటను మరింత మెరుగుపర్చుకోవడం ముఖ్యం. రాబోయే 8–10 నెలలు నా కెరీర్‌లో ఎంతో కీలకం. జనవరి 10 నుంచి జరిగే ఇండియా ఓపెన్‌తో 2022లో మళ్లీ టైటిల్స్ వేటలో పడతా. అనంతరం ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో రాణించడం ముఖ్యం. ఆపై కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్ ఈవెంట్లు ఉన్నాయి. నా గాయాల బాధ పూర్తిగా తప్పినట్లే. నేనిప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నాను.
ఒలింపిక్స్ ఆడలేకపోవడంపై...
టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది. కరోనా కారణంగా కనీసం తొమ్మిది క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లు రద్దు కావడం దెబ్బ తీసింది. ఆరంభ టోర్నీల్లో గాయం కారణంగా ఆడలేకపోగా, కోలుకొని కోర్టులో దిగే సరికి కోవిడ్ వచ్చేసింది. నా చేతుల్లో ఏమీ లేకుండా పోయింది. అయితే ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోయినంత మాత్రాన ప్రపంచం ముగిసిపోలేదని భావించా. ఇకపై ఎలా ఆడాలనే దానిపైనే దృష్టి పెట్టి మంచి ఫలితం సాధించా