Badminton World Championship
-
చైనా ‘డబుల్’ ధమాకా... థామస్ కప్, ఉబెర్ కప్ టైటిల్స్ సొంతం..
ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తమకు తిరుగులేదని చైనా జట్లు మరోసారి చాటుకున్నాయి. థామస్ కప్, ఉబెర్ కప్ టీమ్ టోర్నమెంట్లో విజేతగా అవతరించాయి. సొంతగడ్డపై ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో చైనా మహిళల జట్టు ఉబెర్ కప్‌ను 16వ సారి... చైనా పురుషుల జట్టు థామస్ కప్‌ను 11వ సారి సొంతం చేసుకున్నాయి.ఇండోనేసియాతో జరిగిన ఉబెర్ కప్ టైటిల్ పోరులో చైనా 3–0తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో చెన్ యు ఫె 21–7, 21–16తో మరిస్కాపై... రెండో మ్యాచ్‌లో చెన్ కింగ్ చెన్–జియా యి ఫాన్ 21–11, 21–8తో సితి ఫాదియా–రిబ్కా సుగియార్తోలపై... మూడో మ్యాచ్‌లో హి బింగ్ జియావో 10–21, 21–15, 21–17తో ఎస్తెర్పై గెలిచారు. థామస్ కప్ ఫైనల్లో చైనా 3–1తో ఇండోనేసియాను ఓడించింది.తొలి మ్యాచ్‌లో షి యు కి 21–17, 21–6 తో జిన్టింగ్పై, రెండో మ్యాచ్‌లో లియాంగ్ –వాంగ్ చాంగ్ 21–18, 17–21, 21–17తో ఫజర్–అర్దియాంతోలపై నెగ్గడంతో చైనా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్‌లో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) 21–16, 15–21, 21–17తో లీ షి ఫెంగ్‌ను ఓడించాడు. నాలుగో మ్యాచ్‌లో హి జి టింగ్–జియాంగ్ 21–11, 21–15తో ఫిక్రి–మౌలానాలపై నెగ్గి చైనాకు 3–1తో టైటిల్‌ను ఖరారు చేశారు.ఇవి చదవండి: స్టార్ రెజ్లర్ బజరంగ్ పై.. తాత్కాలిక నిషేధం! -
BWF 2022: ప్రణయ్ జోరుకు తెర
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు విజేతగా నిలిచిన జపాన్ స్టార్, టైటిల్ ఫేవరెట్ కెంటో మొమోటాపై సంచలన విజయంతో పతకం ఆశలు రేపిన హెచ్.ఎస్.ప్రణయ్ ‘షో’కు క్వార్టర్ ఫైనల్లో తెరపడింది. పురుషుల సింగిల్స్‌లో చైనా ఆటగాడు జావో జన్ పెంగ్ 19–21, 21–6, 21–18తో ప్రణయ్ ఆశల్ని క్వార్టర్స్‌లోనే తుంచేశాడు. తొలి గేమ్ ఆరంభంలో బాగా ఆడిన ప్రణయ్ ఒక దశలో 19–13తో ఆధిక్యంలో ఉన్నాడు. కానీ అదే పనిగా చేసిన తప్పిదాలతో అనూహ్యంగా ప్రత్యర్థి 19–19తో పుంజుకున్నాడు. కానీ ప్రణయ్ వరుసగా రెండు పాయింట్లు చేసి గేమ్ కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో భారత ఆటగాడు పూర్తిగా నిరాశపరిచాడు. దీంతో చైనీస్ షట్లర్ 11–1తో దూసుకెళ్లాడు. అదే జోరుతో గేమ్ గెలిచాడు. మూడో గేమ్‌లో ప్రత్యర్థికి దీటుగా రాణించినప్పటికీ కీలక తరుణంలో పాయింట్లు చేసిన చైనా ఆటగాడు గేమ్‌తో పాటు మ్యాచ్ గెలిచి సెమీస్ చేరాడు. గతేడాది స్పెయిన్‌లో జరిగిన ఈవెంట్లోనూ ప్రణయ్ ఆట క్వార్టర్స్‌లోనే ముగిసింది. -
సాత్విక్–చిరాగ్ ‘డబుల్స్’ ధమాకా
భారత అమ్మాయిల జోడి 11 ఏళ్ల క్రితమే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకం పని పట్టింది. ఈ టోర్నీ చరిత్రలో ఇన్నేళ్లయినా పురుషుల జోడీ వల్ల ఒక్క పతకం కూడా రాలేదు. ఇప్పుడా లోటు ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ వల్ల తీరింది. చిరాగ్‌శెట్టితో జతకట్టిన తెలుగు తేజం తనకన్నా మెరుగైన రెండో ర్యాంకింగ్ జోడీని కంగు తినిపించాడు. సెమీస్ చేరడం ద్వారా సాత్విక్–చిరాగ్‌లకు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. టోక్యో: మన షట్లర్లు దూసుకెళుతున్నారు. కామన్వెల్త్గేమ్స్, ఏషియాడ్, ఒలింపిక్స్, థామస్–ఉబెర్ కప్, ప్రపంచ చాంపియన్‌షిప్ ఇలా ఏ మెగా ఈవెంట్ అయినా సరికొత్త చరిత్ర సృష్టిస్తూ సాగుతున్నారు. తాజాగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పురుషుల డబుల్స్‌లో అందని ద్రాక్షయిన పతకాన్ని ఇప్పుడు అందుకోనున్నారు. అంతర్జాతీయ సర్క్యూట్లో స్థిరంగా రాణిస్తున్న సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి–చిరాగ్ శెట్టి ఈ టోక్యో ఈవెంట్లో ఆ ఘనత సాధించారు. పురుషుల డబుల్స్‌లో ప్రపంచ ఏడో ర్యాంక్ జోడీ సెమీస్ చేరడంతో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నారు. క్వార్టర్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకు జంటపై భారత ద్వయం ఆటను చూస్తే పతకం రంగు మారినా ఆశ్చర్యం లేదు. అంతలా డిఫెండింగ్ చాంపియన్స్‌పై సత్తా చాటారు. రెండో గేమ్‌లో పుంజుకున్న స్థానిక మేటి ర్యాంకింగ్ జోడీని నిర్ణాయక గేమ్‌లో ఓడించి మరీ సెమీస్ చేరిన తీరు అద్భుతం! శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడి 24–22, 15–21, 21–14తో ప్రపంచ రెండో ర్యాంకు, డిఫెండింగ్ చాంపియన్ టకురో హోకి–యుగో కొబయాషి (జపాన్) జంటను కంగుతినిపించింది. గంటా 15 నిమిషాల పాటు జరిగిన ఈ హోరాహోరీ పోరాటంలో భారత జోడీదే పైచేయి అయ్యింది. తొలిగేమ్‌లో ఆరంభం నుంచే పట్టుబిగించిన సాత్విక్–చిరాగ్ 12–5తో జోరు పెంచారు.అయితే వరుసగా ఏడు పాయింట్లు సాధించిన డిఫెండింగ్ చాంపియన్ జంట 16–14తో పోటీలో పడింది. ఈ గేమ్ ఆఖరిదాకా పట్టుసడలించని పోరాటం చేసిన భారత జంటే గేమ్ గెలుచుకుంది. కానీ రెండో గేమ్‌లో పుంజుకున్న జపాన్ షట్లర్లు భారత ఆటగాళ్లకు చెక్‌పెట్టారు. నిర్ణాయక మూడో గేమ్‌లో సాత్విక్ జంటే అదరగొట్టింది. 16–9తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత జోడీ అదే వేగంతో పాయింట్లను సాధిస్తూ మ్యాచ్‌ను గెలిచింది. మరో పురుషుల డబుల్స్ జోడీ ఎం.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిలకు క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. అర్జున్–ధ్రువ్ 8–21, 14–21తో మూడు సార్లు చాంపియన్లుగా నిలిచిన మొహమ్మద్ అహసాన్–సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు. భారత@13 డబుల్స్‌లో భారత్‌కిది రెండో పతకం. మహిళల డబుల్స్‌లో ఇదివరకే (2011లో) గుత్తాజ్వాల–అశ్విని పొన్నప్ప కాంస్యం గెలుచుకుంది. ఓవరాల్‌గా అయితే ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్‌కిది 13వ పతకం. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు స్వర్ణం సహా ఐదు పతకాలు నెగ్గగా, సైనా రజత, కాంస్య పతకాలు సాధించింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ (రజతం), లక్ష్యసేన్ (కాంస్యం), సాయిప్రణీత్ (కాంస్యం), దిగ్గజం ప్రకాశ్ పదుకొనె (కాంస్యం) పతక విజేతలుగా నిలిచారు. -
క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టిన చిరాగ్ శెట్టి-సాత్విక్ జోడి
చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి జోడి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది. టోక్యో వేదికగా జరిగిన ప్రిక్వార్టర్స్‌లో డానిష్ జంట జెప్పీ బే, లాస్సే మోల్హెడేను 21-12, 21-10 తేడాతో ఈ భారత స్టార్ జోడీ ఓడించింది. అంతకుముందు సాత్విక్ ,చిరాగ్ జంట గ్వాటెమాలన్ జంటను ఓడించి ప్రీ-క్వార్టర్ఫైనల్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక జపాన్ ద్వయం టకురో హోకి, యుగో కొబయాషితో క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ ,చిరాగ్ తలపడనుంది. మరోవైపు భారత షట్లర్లు ధ్రువ్ కపిల- ఎం.ఆర్ అర్జున్ తొలి సారి బీడబ్ల్యూఎఫ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. గురువారం జరిగిన ప్రీ-క్వార్టర్ఫైనల్లో హీ యోంగ్ కాయ్ టెరీ–లో కీన్ హీన్ జంటను ఓడించి ఈ ద్వయం క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది. చదవండి: BWF World Badmintonship 2022: చరిత్ర సృష్టించిన ధ్రువ్- అర్జున్ జోడీ.. తొలిసారిగా.. -
BWF World Championship: భారత్‌కు భారీ షాక్.. పీవీ సింధు దూరం!
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2022కు భారత్‌కు భారీ షాక్ తగిలింది. ఒలింపిక్ మెడలిస్ట్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చీలమండ గాయం కారణంగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు దూరమైంది. ఈ విషయాన్ని సింధూ తండ్రి పివి రమణ దృవీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్పోర్ట్స్ స్టార్‌తో మాట్లాడుతూ.. "సింధూ కామన్వెల్త్ గేమ్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో గాయపడింది. ఆమె తీవ్రమైన నొప్పితోనే స్వర్ణం పతకం సాధించింది. ఈ క్రమంలో సింధూ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు దూరం కానుంది. ఆమె గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది ఆక్టోబర్‌లో జరిగే పారిస్, డెన్మార్క్ ఓపెన్‌పై సింధు దృష్టంతా ఉంది" అని పేర్కొన్నాడు. కాగా బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సింధు స్వర్ణ పతకం గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఫైనల్లో గాయంతోనే ఆడినట్లు మ్యాచ్ అనంతరం సింధు కూడా వెల్లడించింది. ఇక బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఆగస్టు 21 నుంచి ఆగస్టు 28 వరకు జరగనుంది. కాగా ఇప్పటి వరకు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో సింధు 5 పతకాలు సొంతం చేసుకుంది. 2019 బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు గోల్డ్‌మెడల్ కైవసం చేసుకుంది. అదే విధంగా ఆమె ఖాతాలో రెండు సిల్వర్ మెడల్స్, రెండు కాంస్య పతకాలు కూడా ఉన్నాయి. చదవండి: CWG 2022- Narendra Modi: స్వర్ణ యుగం మొదలైంది.. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: ప్రధాని మోదీ -
"వచ్చే ఏడాది మరిన్ని విజయాలు సాధిస్తా"
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని, ఇకపై కూడా ఇదే జోరు కొనసాగించి మరిన్ని విజయాలు సాధిస్తానని భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. స్పెయిన్ నుంచి స్వస్థలం తిరిగొచ్చిన అనంతరం మంగళవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ రజత పతకంపై... ఎవరికైనా ప్రపంచ చాంపియన్‌షిప్ విజయం ఎంతో ప్రత్యేకం. నాకూ చాలా సంతోషంగా ఉంది. ఈ స్థాయి పెద్ద టోర్నీలో విజయం అంత సులువుగా దక్కదు. విజేతగా నిలవకపోయినా ఫైనల్ ఆడటం కూడా ఎంతో గొప్ప ఘనతగా భావిస్తున్నా. 2017లోనే పతకం గెలుస్తానని భావించినా అది సాధ్యం కాలేదు. ఈసారి ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగడం కూడా మేలు చేసింది. వచ్చే ఏడాది ప్రణాళికలపై... విజయాల జోరు కొనసాగించడంతో పాటు అవసరమైన చోట లోపాలు సరిదిద్దుకొని ఆటను మరింత మెరుగుపర్చుకోవడం ముఖ్యం. రాబోయే 8–10 నెలలు నా కెరీర్లో ఎంతో కీలకం. జనవరి 10 నుంచి జరిగే ఇండియా ఓపెన్‌తో 2022లో మళ్లీ టైటిల్స్ వేటలో పడతా. అనంతరం ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో రాణించడం ముఖ్యం. ఆపై కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్ ఈవెంట్లు ఉన్నాయి. నా గాయాల బాధ పూర్తిగా తప్పినట్లే. నేనిప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నాను. ఒలింపిక్స్ ఆడలేకపోవడంపై... టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది. కరోనా కారణంగా కనీసం తొమ్మిది క్వాలిఫయింగ్ టోర్నమెంట్లు రద్దు కావడం దెబ్బ తీసింది. ఆరంభ టోర్నీల్లో గాయం కారణంగా ఆడలేకపోగా, కోలుకొని కోర్టులో దిగే సరికి కోవిడ్ వచ్చేసింది. నా చేతుల్లో ఏమీ లేకుండా పోయింది. అయితే ఒలింపిక్స్‌కు అర్హత సాధించకపోయినంత మాత్రాన ప్రపంచం ముగిసిపోలేదని భావించా. ఇకపై ఎలా ఆడాలనే దానిపైనే దృష్టి పెట్టి మంచి ఫలితం సాధించా -
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధుకు పరాజయం
-
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధుకు పరాభవం
చైనా : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు చుక్కెదురైంది. స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో సింధు వరుస పరాజయం పాలైంది. మొదటి గేమ్‌లో కొంత పోరాటపటిమ చూపిన సింధు రెండో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. మొదటి గేమ్‌ను 21-19 తేడాతో సొంతం చేసుకున్న మారిన్ రెండో గేమ్‌లో మరింత చెలరేగిపోయింది. మారిన్ దూకుడు ముందు సింధు తేలిపోయింది. ఎప్పటిలాగే గట్టిగా అరుస్తూ, కేకలు వేస్తూ.. మైదానంలో చెలరేగిపోయిన మారిన్ రెండో గేమ్‌ను 21-10తేడాతో సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సింధు సరిపెట్టుకుంది. -
వరల్డ్ చాంపియన్‌షిప్: సైనా కథ ముగిసింది!
నాన్జింగ్ (చైనా): బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పదో సీడ్ భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కథ ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో వరల్డ్ నంబర్ 8 క్రీడాకారిణి ఒలింపిక్ విజేత కరోలినా మారిన్(స్పెయిన్) చేతిలో సైనా చిత్తుగా ఓడింది. అద్భుత ప్రదర్శనతో మారిన్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పటిదాకా ఈ మెగా టోర్నీలో ఓ సారి రజతం (2015), మరో సారి కాంస్యం (2017) సాధించిన సైనా మారిన్‌కు ఏ మాత్రం పోటీనివ్వలేకపోయింది. ఆద్యంతం దూకుడుగా ఆడిన మారిన్ వరుస సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించి 21-6, 21-11 తేడాతో విజయం సొంతం చేసుకుంది. మారిన్ దెబ్బకు కేవలం 31 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. కోర్టులో చిరుతలా కదిలిన మారిన్ మెరుపు షాట్లకు సైనా సమాధానం ఇవ్వలేకపోయింది. 2015లో వీరిద్దరూ ఈ చాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడగా అప్పుడు కూడా కరోలినాదే పైచేయి సాధించింది. కోర్టులో మారిన్ అత్యంత వేగంగా కదిలిందని, అద్బుతమైన ప్రదర్శన చేసిందని మ్యాచ్ అనంతరం సైనా కొనియాడింది. ఆమె వేగంతో ఏం చేయాలో తనకు అర్థం కాలేదని, ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదని సైనా చెప్పుకొచ్చింది. మిక్స్డ్ డబుల్స్‌లో నిరాశే.. మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సాత్విక్ సాయిరాజ్ జోడీ సైతం పరాజయం పాలైంది. టాప్ సీడ్ జెంగ్ సివే– హుయంగ్ యకిఒంగ్ (చైనా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 21-17, 21-10 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడలకు లీ చోంగ్ వీ దూరం
మలేసియా బ్యాడ్మింటన్ దిగ్గజం లీ చోంగ్ వీ ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడల నుంచి వైదొలిగాడు. 35 ఏళ్ల లీ చోంగ్ వీ శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో అతను కనీసం నెలరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఫలితంగా లీ చోంగ్ వీ ఈనెల 30 నుంచి చైనాలో జరిగే ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల నుంచి... వచ్చే నెలలో ఇండోనేసియాలో జరిగే ఆసియా క్రీడల నుంచి తప్పుకున్నాడు. ఈ ఏడాది తొమ్మిది టోర్నీలు ఆడిన లీ చోంగ్ వీ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం నెగ్గడంతోపాటు మలేసియా ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. -
సంఖ్యే కాదు..పతకాలూ పెరుగుతాయి
ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత ఆటగాళ్లకు ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదు. 2018లో దాదాపు ఏడు నెలలు ముగిసినా అటు పురుషుల, ఇటు మహిళల విభాగాల్లో ఒక్క పెద్ద టోర్నీ కూడా (కామన్వెల్త్ క్రీడలను మినహాయిస్తే) మన షట్లర్లు గెలవలేదు. ఇక ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆటగాళ్లు సన్నద్ధమయ్యారు. ఈ నెల 30 నుంచి చైనాలోని నాన్జింగ్ నగరంలో జరగబోయే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 25 మంది షట్లర్ల బృందం ఇందులో పాల్గొంటుండటం విశేషం. 40 ఏళ్ల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ మొత్తం కలిపి 7 పతకాలు గెలుచుకోగలిగింది. ఈ నేపథ్యంలో ఈసారి మన షట్లర్లు ఎన్ని పతకాలు సాధిస్తారనేది ఆసక్తికరం. సాక్షి, హైదరాబాద్: గత ఏడాది గ్లాస్గోలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఒక రజతం, ఒక కాంస్యం భారత్ ఖాతాలో చేరాయి. అయితే ఈసారి మన ఆటగాళ్లు మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చి ఎక్కువ పతకాలు సాధించగలరని జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్నా, మనకు వేర్వేరు విభాగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. 2018లో వరల్డ్ టూర్ టోర్నీల్లో మన షట్లర్ల ప్రదర్శన ప్రభావం దీనిపై ఉండదన్న గోపీచంద్... భారత్ సన్నాహాలపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. విశేషాలు ఆయన మాటల్లోనే... వరల్డ్ చాంపియన్‌షిప్‌కు సన్నద్ధత... పోటీ చాలా తీవ్రంగా ఉండే ఇలాంటి పెద్ద టోర్నీకి సరైన రీతిలోనే మా సన్నద్ధత సాగుతోంది. అయితే వరుస టోర్నీల వల్ల మాకు తగినంత సమయం లభించలేదు. అనేక మంది ఆటగాళ్లు ఇప్పుడు సర్క్యూట్లోనే ఉన్నారు. ఈ జులై నెలలోనే చాలా మంది వరుసగా మలేసియా, ఇండోనేసియా, థాయ్‌లాండ్, సింగపూర్, ప్రస్తుతం రష్యా (24–29) టోర్నీ లలో ఆడుతూ వచ్చారు. దాంతో క్యాంప్‌లో ఒకేసారి శిక్షణ సాధ్యం కాలేదు. అయితే అంతా ఫిట్‌గా ఉన్నారు కాబట్టి సమస్య లేదు. మెరుగైన ప్రదర్శన ఇవ్వగలమని నమ్మకముంది. జట్టు సంఖ్యపై... మొత్తం 25 మంది సభ్యులతో భారత్ బరిలోకి దిగుతుండటం సంతోషకర పరిణామం. ఇంత పెద్ద సంఖ్యలో మనోళ్లు ఒకేసారి వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆడలేదు. కటాఫ్ తేదీ నాటికి ఉన్న ప్రపంచ ర్యాంక్‌ను బట్టి ఆటగాళ్లు అర్హత సాధిస్తారు. అంటే మనోళ్ల ప్రదర్శన వివిధ అంతర్జాతీయ టోర్నీల్లో చాలా మెరుగ్గా ఉందనే అర్థం. వరల్డ్ ర్యాంక్ ద్వారా క్వాలిఫై అయ్యారంటే వారి ఆటను ప్రశంసించాల్సిందే. దీని వల్లే నాకు నమ్మకం మరింత పెరిగింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మన షట్లర్లు పతకం గెలవడం కొత్త కాదు. ఈసారి మరిన్ని పతకాలు గెలుస్తామనే నమ్మకం ఉంది. కేవలం సంఖ్యతో సరిపెట్టకుండా విజయాలు కూడా సాధించాలని పట్టుదలగా ఉన్నాం. 2018లో మన ఆటగాళ్ల ప్రదర్శనపై... వాస్తవంగా చెప్పాలంటే అంత గొప్పగా ఏమీ లేదు. సూపర్ సిరీస్ స్థాయి విజయాలు దక్కలేదనేది వాస్తవం. అయితే మరీ నిరాశాజనకంగా ఏమీ లేదు. కామన్వెల్త్ క్రీడల్లో మన జట్టు అద్భుతంగా ఆడి 6 పతకాలు సాధించింది. నా అభిప్రాయం ప్రకారం కొన్ని టోర్నీల్లో బాగా ఆడినా అదృష్టం కలిసి రాక ఓడిపోయారు. ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం కామన్వెల్త్, ఆసియా క్రీడలవంటిపైనే ఫోకస్ చేస్తూ దాని ప్రకారమే ట్రైనింగ్ సాగడంతో ఇతర పెద్ద టోర్నమెంట్లలో ఫలితాలు సానుకూలంగా రాలేదు. జనవరి నుంచి అమల్లోకి వచ్చిన ఏడాదికి 12 తప్పనిసరి టోర్నీల కొత్త నిబంధన కూడా కొంత ఇబ్బంది పెట్టింది. అయితే ఈ ప్రదర్శన ప్రభావం వరల్డ్ చాంపియన్‌షిప్‌పై మాత్రం ఉండదని నా నమ్మకం. సింధు, సైనా ఫామ్‌పై... వీళ్లిద్దరు వరల్డ్ క్లాస్ ప్లేయర్లు. ఎప్పుడైనా, ఎలాంటి స్థితిలోనైనా సత్తా చాటగల సమర్థులు కాబట్టి రాబోయే టోర్నీల్లో వారి గురించి ఆందోళన లేదు. ఈ సంవత్సరం సింధు రెండు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచి మరో రెండు టోర్నీల్లో సెమీస్ వరకు వచ్చింది. కామన్వెల్త్ ఫైనల్లో సింధును ఓడించిన సైనా, ఇండోనేసియా మాస్టర్స్‌లో ఫైనల్ చేరింది. వారిలో ఆత్మవిశ్వాసానికి లోటు లేదు కాబట్టి మెగా టోర్నీలో మళ్లీ సత్తా చాటగలరు. గత ఏడాది కూడా సింధు (రజతం), సైనా (కాంస్యం) పతకాలు సాధించిన విషయం మరచిపోవద్దు. శ్రీకాంత్ ఆటతీరుపై... ఆందోళన పడాల్సిందేమీ లేదు. అతని ఆటలో లోపాలు లేవు. అన్ని విధాలా బాగానే ఆడుతున్నాడు. అయితే ఒక ఏడాది గెలిచిన టోర్నీలను మరుసటి ఏడాది వరుసగా నిలబెట్టుకోవడం అంత సులువు కాదు. శ్రీకాంత్ విషయంలో కూడా అదే జరుగుతోంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి ఇండోనేసియా ఓపెన్ తొలి రౌండ్లో ఓడిపోవడం కొంత అనూహ్యం. వారం రోజుల వ్యవధిలో కెంటో మొమోటా (జపాన్) చేతిలోనే అతను రెండు సార్లు ఓడిపోవడమే ఆశ్చర్యపరచింది. మేం కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాం. మళ్లీ అది జరగకుండా కొత్త వ్యూహంతో శ్రీకాంత్ సిద్ధమవుతున్నాడు. కశ్యప్ కెరీర్‌పై... వరుస గాయాలు అతని కెరీర్‌పై ప్రభావం చూపించాయి. సర్క్యూట్లో చురుగ్గానే ఉన్నాడు కానీ గాయాల వల్ల పూర్తి స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. కోలుకొని ప్రయత్నిస్తున్నా ఆశించిన విజయాలు దక్కడం లేదు. సింగపూర్ ఓపెన్‌లో అతను 15 నిమిషాల్లోనే ఓడిపోయిన తొలి రౌండ్ మ్యాచ్ అసలు ఆడకుండా ఉండాల్సింది. ప్రత్యర్థి భారత్‌కే చెందిన ఆటగాడు (సౌరభ్ వర్మ) కావడం వల్ల నిబంధనల ప్రకారం వాకోవర్ ఇవ్వకూడదు. దాంతో ఏదోలా బరిలోకి దిగి మ్యాచ్ ముగించాడు. మన్ముందు అతని కెరీర్ గురించైతే ఇప్పుడే చెప్పలేను. వరల్డ్ చాంపియన్‌షిప్ బరిలో భారత షట్లర్లు ►పురుషుల సింగిల్స్: శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్, సమీర్ వర్మ. ►మహిళల సింగిల్స్: పీవీ సింధు, సైనా నెహ్వాల్. ►పురుషుల డబుల్స్: సుమీత్ రెడ్డి–మను అత్రి, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి, అర్జున్–శ్లోక్ రామచంద్రన్, తరుణ్ కోన–సౌరభ్ శర్మ. ►మహిళల డబుల్స్: సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప; కుహూ గార్గ్– నింగ్షి హజారికా; మేఘన–పూర్వీషా; సంయోగిత–ప్రజక్తా సావంత్. ►మిక్స్డ్ డబుల్స్: సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; సాత్విక్–అశ్విని పొన్నప్ప; సౌరభ్ శర్మ–అనౌష్క పారిఖ్; రోహన్ కపూర్–కుహూ గార్గ్. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత ప్రదర్శన ►1983: ప్రకాశ్ పదుకోన్ ( పురుషుల సింగిల్స్‌లో కాంస్యం) ►2011: గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప (మహిళల డబుల్స్‌లో కాంస్యం) ►2013, 2014: పీవీ సింధు (మహిళల సింగిల్స్‌లో కాంస్యాలు) ►2015: సైనా నెహ్వాల్ (మహిళల సింగిల్స్‌లో రజతం) ►2017: పీవీ సింధు (మహిళల సింగిల్స్‌లో రజతం), సైనా నెహ్వాల్ (మహిళల సింగిల్స్‌లో కాంస్యం). ►మొత్తం: 2 రజతాలు, 5 కాంస్యాలు -
మన పోరాటం ముగిసింది
సింగపూర్ సిటీ: సింగపూర్ ఓపెన్‌లో భారత ప్లేయర్ల పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లోనే సౌరభ్ వర్మ, శుభాంకర్ ఓటమి పాలయ్యారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో సౌరభ్ వర్మ 21–18, 15–21, 11–21తో తైన్ మిన్హ్ ఎన్గుయెన్ (వియత్నాం) చేతిలో, శుభాంకర్ 13–21, 14–21తో చౌ టైన్ చెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్ విభాగంలో రుత్విక శివాని, రితూపర్ణ దాస్ కూడా ప్రిక్వార్టర్స్ దశను దాటలేకపోయారు. రుత్విక శివాని 8–21, 15–21తో సయాక తలకహాషి (జపాన్) చేతిలో... రితూపర్ణ దాస్ 21–15, 13–21, 16–21తో యూలియా యుసేఫిన్ సుసాంటో (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం 15–21, 11–21తో చాంగ్ తక్ చింగ్–వింగ్ యుంగ్ (హాంకాంగ్) జంట చేతిలో ఓడింది. సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ 14–21, 21–16, 14–21తో లీ చున్ హై రెగినాల్డ్–చౌ హై వాహ్ (హాంకాంగ్) ద్వయం చేతిలో ఓడింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 17–21, 18–21తో యున్ని –యియాన్‌గ్యు (చైనా) జోడీ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
22 ఏళ్లకే ఇన్ని సాధిస్తే...
♦ ఇకపైనా సింధుకు తిరుగుండదు ♦ కోచ్ గోపీచంద్ ఆశాభావం సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలతో మన జట్టు మరో మెట్టు ఎక్కిందని భారత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. ఈ మెగా ఈవెంట్లో రజత, కాంస్యాలు సాధించిన పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించగల సత్తా సింధులో ఉందని ఆయన అన్నారు. ఇంకా గోపీచంద్ ఏమన్నారంటే... ఇలాంటి మ్యాచ్ జీవితంలో చూడలేదు... సింధు వయసు కేవలం 22 ఏళ్లు. ఇప్పటికే 3 ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలు, ఒలింపిక్ మెడల్‌తో పాటు రెండు సూపర్ సిరీస్ టోర్నీలలో విజేతగా నిలిచింది. ఇది చాలా పెద్ద ఘనత. ఇక ముందు ఆమె ఇదే తరహాలో కష్టపడితే పెద్ద సంఖ్యలో విజయాలు ఆమె ఖాతాలో చేరతాయి. సింధు ఆడిన ఫైనల్ మ్యాచ్‌లాంటిది నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. కోచ్ స్థానంలో కూర్చున్న నాతో పాటు దేశంలో ఎంతో మంది ఈ మ్యాచ్‌ను ఊపిరి బిగబట్టి చూడటమే ఈ మ్యాచ్ గొప్పతనం గురించి చెబుతోంది. షెడ్యూల్‌ను సాకుగా చూపించలేము... అంపైర్ నిబంధనల ప్రకారమే సింధును ఎల్లో కార్డుతో హెచ్చరించారు. మ్యాచ్‌ల సందర్భంగా ఇలాంటివి చిన్న విషయాలే. మ్యాచ్ సమయాలను ప్రసారకర్తలు నిర్ణయించడం సరైంది కాకపోయినా... భారత్‌లోని ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకోవడం వల్ల కొన్ని సార్లు ఇది తప్పదు. అయితే మ్యాచ్ తుది ఫలితానికి దీనిని సాకుగా చూపించలేము. ఫిట్నెస్ ప్రమాణాలు పెంచుకోవాలి... ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఫిట్నెస్ ప్రమాణాలు ఎంతో పెరిగాయి. ఆ స్థాయికి చేరడంపై మనం కూడా దృష్టి పెట్టాం. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించకపోయినా శ్రీకాంత్, సాయిప్రణీత్ చక్కటి ప్రదర్శన కనబర్చారు. మొత్తంగా మన షట్లర్ల ఆట పట్ల సంతృప్తిగా ఉన్నాను. మెరుగైన స్థితిలో ఉన్నా... ప్రస్తుత భారత క్రీడారంగం గతంలోకంటే ఎంతో మెరుగైన స్థితిలో ఉంది. భారత ప్రధాన మంత్రి ఒకరు క్రీడల గురించి, క్రీడలను ప్రోత్సహించడం గురించి ఇంత తరచుగా మాట్లాడటం గతంలో ఎప్పుడూ జరగలేదు. అత్యున్నత స్థాయి అధికారులు ఆటలు, సౌకర్యాల గురించి ఇంత ఎక్కువగా చర్చించడం కూడా ఇప్పుడే కనిపిస్తోంది. ఇది మన ఆటలకు మేలు చేసే అంశం. ఇప్పటి వరకైతే క్రీడలు సరైన దిశలో సాగుతున్నాయి. ఇక ముందు ఇంకా చేయాల్సింది చాలా ఉంది. -
పిక్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్
రెండో రౌండ్లో శ్రీకాంత్, జైరాం బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్ కోపెన్‌హాగెన్: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో ‘బై’ లభించిన సైనా... మంగళవారం జరిగిన రెండో రౌండ్లో సునాయాస విజయం సాధించింది. ఏడో సీడ్ సైనా 21-11, 21-9 తేడాతో రష్యాకు చెందిన నటాలియా పెర్మినోవాను చిత్తు చేసింది. 31 నిమిషాల్లోనే భారత నంబర్‌వన్ ప్లేయర్ ఈ మ్యాచ్‌ను ముగించింది. పురుషుల సింగిల్స్‌లో తెలుగు కుర్రాడు కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-11, 11-21, 21-12 స్కోరుతో ఇజ్టోక్ ఉట్రోసా (స్లొవేకియా)ను ఓడించాడు. మరో భారత ఆటగాడు అజయ్ జైరాంకు ‘వాకోవర్’ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. తొలి రౌండ్లో అతను నాలుగో సీడ్ కెనిచి టాగో (జపాన్)తో తలపడాల్సి ఉండగా...చివరి నిమిషంలో కెనిచి తప్పుకోవడంతో అజయ్ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. మహిళల డబుల్స్‌లో భారత్‌కు చెందిన ప్రజక్తా సావంత్-ఆరతి సారా సునీల్ జోడి ప్రత్యర్థికి ‘వాకోవర్’ ఇచ్చింది. ఫలితంగా పుతీతా సుప్రజిరకుల్- సప్సిరీ (థాయిలాండ్) జంట రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. మరో వైపు మిక్స్డ్ డబుల్స్‌లోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. భారత జోడి అరుణ్ విష్ణు-అపర్ణా బాలన్ రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. ఆరో సీడ్ మైకేల్ ఫక్స్-బిర్గిట్ మైకేల్స్ (జర్మనీ) 21-14, 21-11 తో అరుణ్-అపర్ణలపై గెలుపొందింది. కశ్యప్ నిష్ర్కమణ కామన్వెల్త్లో స్వర్ణం నెగ్గి ఉత్సాహం మీదున్న పారుపల్లి కశ్యప్‌కు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ 24-26, 21-13, 18-21తో డీటర్ డోమ్కీ (జర్మనీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. -
జ్వాల జోడికి వాకోవర్
బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్ కోపెన్‌హాగెన్: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల డబుల్స్ జోడి గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఈ జంటతో తలపడాల్సిన హీతర్ ఆల్వర్-కేట్ రాబర్ట్‌షా (ఇంగ్లండ్) ఆఖరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకోవడంతో భారత ద్వయానికి వాకోవర్ లభించింది. రెండో రౌండ్లో జ్వాల-అశ్విని, చైనాకు చెందిన ఐదో సీడ్ కింగ్ టియాన్-యున్లీ జావోను ఎదుర్కొంటారు. గతంలో వీరితో తలపడిన ఆరు సార్లూ భారత జంట ఓటమిపాలైంది. మరో వైపు మిక్స్డ్ డబుల్స్‌లో మాత్రం భారత్‌కు చెందిన అశ్విని పొన్నప్ప-తరుణ్ కోన జోడి తొలి రౌండ్లోనే ఓటమిపాలైంది. ప్రపంచ 16వ ర్యాంక్ జంట అండర్స్ క్రిస్టియన్సెన్-జూలీ హౌమన్ (డెన్మార్క్) 21-16, 27-25తో అశ్విన్-తరుణ్‌పై విజయం సాధించింది. -
చైనాతో సవాల్
నేటి నుంచి బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్ సైనా, సింధు, కశ్యప్‌లపైనే ఆశలు కోపెన్హగెన్: ఈసారి ఎలాగైనా పతకం సాధించాలనే పట్టుదల ఒకరిది... గతం కంటే మెరుగైన పతకం గెలవాలనే లక్ష్యం మరొకరిది... ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పి.వి. సింధులు ప్రపంచ చాంపియన్‌షిప్‌కు సిద్ధమయ్యారు. నేటి నుంచి డెన్మార్క్‌లోని కోపెన్‌హగెన్‌లో జరగనున్న ఈ చాంపియన్‌షిప్‌లో వీరిద్దరి కల నెరవేరాలంటే చైనా గోడను అధిగమించాల్సి ఉంటుంది. గతేడాది టోర్నీలో కాంస్యంతో ఆకట్టుకున్న సింధు.. ఈ మెగా ఈవెంట్లో పతకం గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. అలాగే ఇటీవల గ్లాస్గో గేమ్స్‌లోనూ కాంస్యంతో మెరిసింది. కాబట్టి ఈసారి కూడా ఆమెపై భారీ ఆశలే ఉన్నాయి. మరోవైపు సైనా మాత్రం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు క్వార్టర్‌ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయింది. మిగతా ఈవెంట్లలో చైనా క్రీడాకారిణులపై ఆధిపత్యం చెలాయించే హైదరాబాద్ అమ్మాయి ఈ ఈవెంట్లో మాత్రం చతికిలపడుతోంది. కాలి గాయంతో కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమైన సైనా ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్తో ఉంది. సైనా ఏడోసీడ్‌గా, సింధు 11వ సీడ్‌గా ఈవెంట్లో బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరికి తొలి రౌండ్లో బై లభించింది. అన్ని అనుకున్నట్లు జరిగితే సైనాకు క్వార్టర్స్‌లో, సింధుకు సెమీస్‌లో చైనా క్రీడాకారిణులు ఎదురుపడే అవకాశాలున్నాయి. కశ్యప్‌పై భారీ అంచనాలు పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్‌పైనే ఎక్కువ ఆశలున్నాయి. కామన్వెల్త్లో స్వర్ణం గెలవడంతో ఇవి రెట్టింపయ్యాయి. సోమవారం డైటర్ డొమెక్ (జర్మనీ)తో జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌తో అతను ఈ టోర్నీని ప్రారంభిస్తాడు. అజయ్ జయరామ్ నాలుగోసీడ్ కనిచి టగో (జపాన్)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. యువ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ సంచలనం కోసం ఎదురుచూస్తున్నాడు. మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని మరోసారి పతకం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. 2011 టోర్నీలో ఈ జోడి కాంస్యం గెలుచుకుంది. అయితే రెండో రౌండ్లో ఈ జంటకు చైనీస్ ద్వయం క్వియాంగ్ టియాన్-యునెలి జావోల నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. పంకజ్ సావంత్-ఆరతి సారా సునీల్; పురుషుల డబుల్స్‌లో అక్షయ్ దివాల్కర్-ప్రణయ్ చోప్రా; సుమీత్ రెడ్డి-మను ఆత్రిలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మిక్స్‌డ్‌లో అశ్విని...తరుణ్ కోనాతో కలిసి బరిలోకి దిగుతోంది. జూలై చివరి వరకు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాతి నుంచి ఈ గాయంతో బాధపడుతున్నా. దీంతో సరైన ప్రాక్టీస్ చేయలేకపోయా. గత మూడు వారాల నుంచి మళ్లీ ప్రాక్టీస్ చేస్తున్నా. ఈసారి టోర్నీలో సత్తా మేరకు రాణిస్తా. -సైనా