భారత అమ్మాయిల జోడి 11 ఏళ్ల క్రితమే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకం పని పట్టింది. ఈ టోర్నీ చరిత్రలో ఇన్నేళ్లయినా పురుషుల జోడీ వల్ల ఒక్క పతకం కూడా రాలేదు. ఇప్పుడా లోటు ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాత్విక్ సాయిరాజ్ వల్ల తీరింది. చిరాగ్‌శెట్టితో జతకట్టిన తెలుగు తేజం తనకన్నా మెరుగైన రెండో ర్యాంకింగ్ జోడీని కంగు తినిపించాడు. సెమీస్ చేరడం ద్వారా సాత్విక్–చిరాగ్‌లకు కనీసం కాంస్య పతకం ఖాయమైంది.
టోక్యో: మన షట్లర్లు దూసుకెళుతున్నారు. కామన్వెల్త్‌గేమ్స్, ఏషియాడ్, ఒలింపిక్స్, థామస్–ఉబెర్ కప్, ప్రపంచ చాంపియన్‌షిప్ ఇలా ఏ మెగా ఈవెంట్ అయినా సరికొత్త చరిత్ర సృష్టిస్తూ సాగుతున్నారు. తాజాగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పురుషుల డబుల్స్‌లో అందని ద్రాక్షయిన పతకాన్ని ఇప్పుడు అందుకోనున్నారు. అంతర్జాతీయ సర్క్యూట్‌లో స్థిరంగా రాణిస్తున్న సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి–చిరాగ్ శెట్టి ఈ టోక్యో ఈవెంట్‌లో ఆ ఘనత సాధించారు.
పురుషుల డబుల్స్‌లో ప్రపంచ ఏడో ర్యాంక్ జోడీ సెమీస్ చేరడంతో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నారు. క్వార్టర్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకు జంటపై భారత ద్వయం ఆటను చూస్తే పతకం రంగు మారినా ఆశ్చర్యం లేదు. అంతలా డిఫెండింగ్ చాంపియన్స్‌పై సత్తా చాటారు. రెండో గేమ్‌లో పుంజుకున్న స్థానిక మేటి ర్యాంకింగ్ జోడీని నిర్ణాయక గేమ్‌లో ఓడించి మరీ సెమీస్ చేరిన తీరు అద్భుతం! శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడి 24–22, 15–21, 21–14తో ప్రపంచ రెండో ర్యాంకు, డిఫెండింగ్ చాంపియన్ టకురో హోకి–యుగో కొబయాషి (జపాన్) జంటను కంగుతినిపించింది. గంటా 15 నిమిషాల పాటు జరిగిన ఈ హోరాహోరీ పోరాటంలో భారత జోడీదే పైచేయి అయ్యింది.
తొలిగేమ్‌లో ఆరంభం నుంచే పట్టుబిగించిన సాత్విక్–చిరాగ్ 12–5తో జోరు పెంచారు.అయితే వరుసగా ఏడు పాయింట్లు సాధించిన డిఫెండింగ్ చాంపియన్ జంట 16–14తో పోటీలో పడింది. ఈ గేమ్ ఆఖరిదాకా పట్టుసడలించని పోరాటం చేసిన భారత జంటే గేమ్ గెలుచుకుంది. కానీ రెండో గేమ్‌లో పుంజుకున్న జపాన్ షట్లర్లు భారత ఆటగాళ్లకు చెక్‌పెట్టారు. నిర్ణాయక మూడో గేమ్‌లో సాత్విక్ జంటే అదరగొట్టింది. 16–9తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత జోడీ అదే వేగంతో పాయింట్లను సాధిస్తూ మ్యాచ్‌ను గెలిచింది. మరో పురుషుల డబుల్స్ జోడీ ఎం.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిలకు క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. అర్జున్–ధ్రువ్ 8–21, 14–21తో మూడు సార్లు చాంపియన్లుగా నిలిచిన మొహమ్మద్ అహసాన్–సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యారు.
భారత@13
డబుల్స్‌లో భారత్‌కిది రెండో పతకం. మహిళల డబుల్స్‌లో ఇదివరకే (2011లో) గుత్తాజ్వాల–అశ్విని పొన్నప్ప కాంస్యం గెలుచుకుంది. ఓవరాల్‌గా అయితే ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్‌కిది 13వ పతకం. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు స్వర్ణం సహా ఐదు పతకాలు నెగ్గగా, సైనా రజత, కాంస్య పతకాలు సాధించింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ (రజతం), లక్ష్యసేన్ (కాంస్యం), సాయిప్రణీత్ (కాంస్యం), దిగ్గజం ప్రకాశ్ పదుకొనె (కాంస్యం) పతక విజేతలుగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment