చైనాతో సవాల్
నేటి నుంచి బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్
సైనా, సింధు, కశ్యప్‌లపైనే ఆశలు
కోపెన్‌హగెన్: ఈసారి ఎలాగైనా పతకం సాధించాలనే పట్టుదల ఒకరిది... గతం కంటే మెరుగైన పతకం గెలవాలనే లక్ష్యం మరొకరిది... ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పి.వి. సింధులు ప్రపంచ చాంపియన్‌షిప్‌కు సిద్ధమయ్యారు. నేటి నుంచి డెన్మార్క్‌లోని కోపెన్‌హగెన్‌లో జరగనున్న ఈ చాంపియన్‌షిప్‌లో వీరిద్దరి కల నెరవేరాలంటే చైనా గోడను అధిగమించాల్సి ఉంటుంది.
గతేడాది టోర్నీలో కాంస్యంతో ఆకట్టుకున్న సింధు.. ఈ మెగా ఈవెంట్‌లో పతకం గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. అలాగే ఇటీవల గ్లాస్గో గేమ్స్‌లోనూ కాంస్యంతో మెరిసింది. కాబట్టి ఈసారి కూడా ఆమెపై భారీ ఆశలే ఉన్నాయి. మరోవైపు సైనా మాత్రం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు క్వార్టర్‌ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయింది. మిగతా ఈవెంట్లలో చైనా క్రీడాకారిణులపై ఆధిపత్యం చెలాయించే హైదరాబాద్ అమ్మాయి ఈ ఈవెంట్‌లో మాత్రం చతికిలపడుతోంది. కాలి గాయంతో కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమైన సైనా ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంది. సైనా ఏడోసీడ్‌గా, సింధు 11వ సీడ్‌గా ఈవెంట్‌లో బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరికి తొలి రౌండ్‌లో బై లభించింది. అన్ని అనుకున్నట్లు జరిగితే సైనాకు క్వార్టర్స్‌లో, సింధుకు సెమీస్‌లో చైనా క్రీడాకారిణులు ఎదురుపడే అవకాశాలున్నాయి.
కశ్యప్‌పై భారీ అంచనాలు
పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్‌పైనే ఎక్కువ ఆశలున్నాయి. కామన్వెల్త్‌లో స్వర్ణం గెలవడంతో ఇవి రెట్టింపయ్యాయి. సోమవారం డైటర్ డొమెక్ (జర్మనీ)తో జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌తో అతను ఈ టోర్నీని ప్రారంభిస్తాడు. అజయ్ జయరామ్ నాలుగోసీడ్ కనిచి టగో (జపాన్)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. యువ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ సంచలనం కోసం ఎదురుచూస్తున్నాడు. మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని మరోసారి పతకం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. 2011 టోర్నీలో ఈ జోడి కాంస్యం గెలుచుకుంది.
అయితే రెండో రౌండ్‌లో ఈ జంటకు చైనీస్ ద్వయం క్వియాంగ్ టియాన్-యునెలి జావోల నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. పంకజ్ సావంత్-ఆరతి సారా సునీల్; పురుషుల డబుల్స్‌లో అక్షయ్ దివాల్కర్-ప్రణయ్ చోప్రా; సుమీత్ రెడ్డి-మను ఆత్రిలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మిక్స్‌డ్‌లో అశ్విని...తరుణ్ కోనాతో కలిసి బరిలోకి దిగుతోంది.
జూలై చివరి వరకు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాతి నుంచి ఈ గాయంతో బాధపడుతున్నా. దీంతో సరైన ప్రాక్టీస్ చేయలేకపోయా. గత మూడు వారాల నుంచి మళ్లీ ప్రాక్టీస్ చేస్తున్నా. ఈసారి టోర్నీలో సత్తా మేరకు రాణిస్తా. -సైనా