
కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న పుల్లెల గోపీచంద్
తిరుపతి తుడా: జాతీయ కబడ్డీ పోటీలు తిరుపతిలో బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, బ్యాడ్మింటన్ కోచ్, పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్, అర్జున అవార్డు గ్రహీత హోన్నప్ప గౌడ, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన, వందేమాతరం గీతాలాపన, భరతనాట్య ప్రదర్శన అనంతరం క్రీడా, శాంతి కపోతాలను ఎగురవేశారు. పోటీలను ప్రారంభించిన పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ.. తిరుపతిలాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో జాతీయ కబడ్డీ పోటీలను నిర్వహించడం శుభపరిణామమన్నారు. క్రీడాకారులకు ఆటే జీవితమన్నారు.
డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడారంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో తప్పనిసరిగా మైదానాలు ఉండాలని, నాణ్యమైన చదువుతోపాటు క్రీడల్లో రాణించేలా తర్ఫీదునివ్వాలని సీఎం సంకల్పించారని తెలిపారు. భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. తిరుపతిని క్రీడా హబ్‌గా కూడా తీర్చిదిద్దుతామన్నారు.
కబడ్డీ టోర్నీతో దేశమంతా తిరుపతి వైపు చూస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు.. డాక్టర్ గురుమూర్తి, రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు.. ఆదిమూలం, జంగాలపల్లి శ్రీనివాసులు, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, నవాజ్‌బాషా, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు, కలెక్టర్ హరినారాయణన్, మునిసిపల్ కమిషనర్ గిరీష, మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్‌రెడ్డి, ముద్రనారాయణ, కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment