నాడు: గత టీడీపీ ప్రభుత్వం బీసీలను రాజకీయాలకే వాడుకుంది. కేవలం ఓటు బ్యాంక్‌గానే ఉపయోగించుకుంది. చట్టసభల్లోగానీ, రాజకీయ పదవుల్లోగానీ తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అణగదొక్కింది. నామమాత్రంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తూతూమంత్రంగా నిధులు విదిల్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే కూరలో కరివేపాకులా వాడుకుని పక్కనబెట్టింది. చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన అన్యాయం బీసీలకు బాగా అర్థమైంది. ఏళ్ల తరబడి మోస్తున్నా.. అడుగడుగునా అవమానాలే ఎదురవుతుండడంతో ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ బాబుకు బైబై చెప్పే పరిస్థితి వచ్చింది.
నేడు: ‘బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ కాదు.. వారు సమాజానికి బ్యాక్ బోన్‌లాంటి వారు’ అని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో ఉచ్ఛరిస్తూ వారికి అండదండగా నిలుస్తున్నారు. చట్టసభల్లో సైతం వారికి సముచిత స్థానం కల్పించారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన రాజకీయ పదవులు కట్టబెట్టారు. కార్పొరేషన్లకు కావాల్సిన నిధులు సమకూర్చారు. ఆర్థిక అసమానతలు తొలగించేందుకు అనేక పథకాలు తీసుకొచ్చారు. బీసీల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి వేల కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలోనే పలువురు బీసీలు వైఎస్సార్‌సీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. గతంలో ఎప్పుడూ తమను ఇంతలా ఆదరించలేదని గొప్పగా చెప్పుకుంటున్నారు.
సాక్షి, తిరుపతి: జిల్లాలోని బీసీ నాయకులు టీడీపీకి గుడ్‌బై చెబుతున్నారు. పార్టీలో సముచిత స్థానంలేక కొందరు.. బాబు సామాజికవర్గం దాడులకు భయపడి మరికొందరు.. చులకన చేసి మాట్లాడడంతో ఇంకొందరు రాజీనామాలు చేస్తున్నారు. ఆ పార్టీలో తగిన గుర్తింలేక ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంచి పేరున్న వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం టీడీపీకి, పార్టీ ఇచ్చిన పదవికి రాజీనామా చేశారు.
తాజాగా చిత్తూరుకు చెందిన బీసీ నాయకుడు, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పి షణ్ముగం శుక్రవారం ఉదయం టీడీపీకి, తన పదవికి గుడ్‌బై చెప్పారు. ఇదివరకే చిత్తూరు నగర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మాపాక్షి మోహన్ టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెల్సిందే.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీసీలే అధికం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీసీ సామాజికవర్గం వారే అధికం. మొత్తంగా 15 లక్షలకుపైగా ఓటర్లుండగా వీరిలో వన్నెకుల క్షత్రియ సామాజికవర్గానికి చెందిన ఓటర్లే సుమారు 40 శాతం ఉన్నారు. కుప్పం, నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం ఓట్లే కీలకం. అందుకే వారిలో ముఖ్యమైన కొందరిని ఎంపిక చేసుకుని టీడీపీ నేతలు ఇప్పటికీ ఎన్నికల వరకే వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
దాడులు చేస్తూ.. చులకనగా చూస్తూ
బాబు సామాజికవర్గం నేతలు బీసీలను చులకన చేయడం, పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పించకపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. మరో వైపు దాడులకు తెగబడుతున్నట్లు బాధితలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరుకు చెందిన పీ షణ్ముగంపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు దాడిచేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే షణ్ముగం ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆ పార్టీ నాయకులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
ఏకమవుతున్న బీసీలు
టీడీపీలో బీసీలకు జరుగుతున్న అవమానాలను జీర్ణించుకోలేక ఆ సామాజికవర్గ నేతలంతా ఏకమవుతున్నారు. తిరుపతికి చెందిన డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో వన్నెకుల క్షత్రియులతో పాటు మిగిలిన బీసీ సామాజికవర్గం నాయకులు, కార్యకర్త లు రోజూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ స మావేశాల్లో టీడీపీ చేసిన అన్యాయాలు, ఆగడాలను ఎండగడుతున్నారు. శివరాత్రితర్వాత ఉమ్మడి చిత్తూ రు జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీలు సమావేశం ఏర్పా టు చేసి కార్యాచరణ ప్రకటించనున్నట్టు సమాచారం.
బీసీల సాధికారత ఎక్కడ?
బీసీల సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. చంద్రబాబు పార్టీని లాక్కున్న తర్వాత ఆ లక్ష్యాన్ని నీరుగార్చారు. బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నానని ప్రకటనలు చేసేవారే తప్ప క్షేత్రస్థాయిలో వారికి చేసింది శూన్యం. చంద్రబాబు హయాంలో బీసీలు దగాపడ్డారు. స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ అభ్యర్థి వరకు వారి సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. బీసీలను ఓట్ల కోసం వాడుకుని వదిలేశారు. టీడీపీలో ఎంత కష్టపడినా బీసీలకు న్యాయం, తగిన గౌరవం, గుర్తింపు లభించదు. 15 ఏళ్ల తన రాజకీయ జీవితంలో నన్ను నమ్మిన బీసీల కోసం నేను ఏమీ చేయలేకపోయాను. అందుకే టీడీపీకి రాజీనామా చేశాను.
–డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి
బీసీలను అణగదొక్కేందుకు కుట్ర
టీడీపీ కోసం కష్టపడ్డాను. 32 ఏళ్లుగా పార్టీని నమ్మాను. చంద్రబాబు, లోకేష్, ముఖ్యనాయకులు వస్తే వారి కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు అహర్నిశలు శ్రమించాను. అయితే పారీ్టలో నాకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. మొన్న లోకేష్ పర్యటనలో పులివర్తి నాని నాపై దాడిచేసేందుకు వచ్చారు. ఈ విషయాన్ని లోకేష్‌కు ఫిర్యాదు చేశాను. నానిపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే టీడీపీకి రాజీనామా చేశాను. చిత్తూరులో బీసీలను అణగదొక్కేందుకు కుట్రపన్నుతున్నారు. బీసీల దెబ్బ ఎలా ఉంటుందో టీడీపీ వారికి రుచిచూపిస్తాం.
– పీ షణ్ముగం, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్, చిత్తూరు
మొదలైన బుజ్జగింపుల పర్వం
బీసీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడితుండడంతో చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు దిగారు. పలువురు మాజీ మంత్రులను బీసీ నాయకుల నివాసాలకు పంపుతున్నారు. చేసిన తప్పులను సరిదిద్దుతామని చెబుతున్నట్టు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అయితే టీడీపీకి ఇప్పటి వరకు చేసిన సేవలు చాలని, తమకు ఏ పార్టీ ప్రాధాన్యత కల్పిస్తుందో వారి వెంట నడుస్తామని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయాలు బయటకు రాకుండా ఉండేందుకు పార్టీకి రాజీనామా చేసిన వారిని టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం నుంచి లేఖలు విడుదల చేయడం గమనార్హం.
చదవండి: రామోజీ దిగులు ‘ఈనాడు’ రాతల్లో కనపడుతోంది..
Comments
Please login to add a commentAdd a comment