బతికుండగానే చంపేశారు !
సర్వే సిబ్బంది వింతలీలలు
వీఆర్‌పురం: ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు పుల్లెందుల పుల్లయ్య. వయస్సు 80 ఏళ్లు. వీఆర్‌పురం మండలం వడ్డిగూడెం గ్రామం. ఇతడికి కొన్ని సంవత్సరాలుగా నెలకు రూ.200 వృద్ధాప్య పింఛన్ వస్తోంది. ఈ పింఛన్‌ను నెలకు రూ.వెయ్యికి పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగానే తనకు ఐదు రెట్లు అదనంగా డబ్బులొస్తాయని సంతోషించాడు. అయితే సర్వే అధికారుల నిర్వాకంతో అతడి ఆశలన్నీ అడియాశలయ్యాయి.
నాలుగు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన పింఛన్ సిబ్బందికి తన కార్డు చూపించి పెన్షన్ ఇవ్వమని కోరగా.. ‘నీవు చనిపోయినట్లు జాబితాలో ఉందని, అందుకే నీకు పింఛన్ మంజూరు కాలేద’ని సమాధానం ఇవ్వడంతో పుల్లయ్య కంగుతిన్నాడు. తాను పేదవాడినని, ఆదుకునేందుకు కూడా ఎవరూ లేరని, ఎలాగైనా తన పింఛన్ ఇప్పించాలని కోరుతున్నాడు. దీనిపై ఎంపీడీవో లక్ష్మీభాయిని వివరణ కోరగా, సర్వే జాబితాలో పుల్లయ్య చనిపోయినట్లుగా కోడ్ 11 వేసి ఉందని, ఆ జాబితా ఆధారంగానే లబ్ధిదారుల పేర్లు అప్లోడ్ చేస్తామని చెప్పారు. పుల్లయ్య బతికే ఉన్నట్లు ప్రస్తుత విచారణలో తేలిందని, అతడికి పింఛన్ మంజూరయ్యేలా ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.